ప్రభాస్.. కొన్ని రోజుల వరకు తప్పదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ విడుదలై కొన్ని రోజులు గడుస్తున్నా, సినిమా చుట్టూ విమర్శల వేడి తగ్గడం లేదు.;

Update: 2026-01-30 02:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ విడుదలై కొన్ని రోజులు గడుస్తున్నా, సినిమా చుట్టూ విమర్శల వేడి తగ్గడం లేదు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా, బ్లాక్‌ బస్టర్ హిట్‌ గా నిలుస్తుందని అభిమానులు భావించారు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, మిక్స్‌ డ్ రిజల్ట్ కే పరిమితమైంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

ముఖ్యంగా ప్రభాస్ లుక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ముఖం నేచురల్ గా కనిపించడం లేదని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ సరిగ్గా కాలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో డూప్ ఆర్టిస్టుల వినియోగం ఎక్కువగా ఉందని, అలాంటి విషయాలకు ప్రభాస్ ఎలా ఒప్పుకున్నారని ప్రశ్నలు వేస్తున్నారు. ప్రభాస్‌ యాక్టింగ్ పై విమర్శలు లేకున్నా.. మేకింగ్ లోపాల వల్ల ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ దెబ్బతిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కథ, కథనంలో పట్టు లేకపోవడం, విజువల్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమా నెగటివ్ టాక్‌కు కారణమవుతున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వసూళ్ల పరంగా కూడా ది రాజా సాబ్ ఆశించిన రేంజ్‌ ను అందుకోలేకపోయింది. పాన్ ఇండియా మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేసిన ట్రేడ్ వర్గాలు, కలెక్షన్లు తగ్గుముఖం పట్టడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఆ సినిమా వసూళ్లను, గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ చిత్రంతో పోలుస్తున్నారు.

ఆ సినిమా కన్నా తక్కువ వసూళ్లు ఉన్నాయని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే సినిమా థియేటర్లలో రిలీజై చాలా రోజులు గడిచినా, ట్రోల్స్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతుండటంతో, ట్రోల్స్ మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటీటీలో సినిమా అందుబాటులోకి వస్తే, కొన్ని సన్నివేశాల క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, కొత్తగా విమర్శలకు దారితీయవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే, ప్రభాస్ కెరీర్‌ ను గమనిస్తే, ఇలాంటి విమర్శలు ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినా, ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్టులతో కమ్‌ బ్యాక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లైన్‌ లో ఉన్న బడా చిత్రాలపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

ఏదేమైనా ది రాజా సాబ్ విషయంలో కొన్నిరోజుల వరకు ప్రభాస్‌ కు ట్రోల్స్ తప్పేలా కనిపించడం లేదు. సినిమా థియేటర్ రన్ కంప్లీట్ అయ్యాక.. ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవు.. కచ్చితంగా పెరుగుతాయి కానీ తగ్గవు. మరి విమర్శలు ఎప్పుడు తగ్గుతాయనేది వేచి చూడాలి.

Tags:    

Similar News