రాజు గారి డైరెక్టర్.. హిట్ కొట్టినా నెక్స్ట్ ఛాన్స్ డౌటే!
అనగనగా ఒక రాజు.. ఇటీవల సంక్రాంతి బరిలో దిగిన ఆ మూవీ మంచి హిట్ గా నిలిచింది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.;
అనగనగా ఒక రాజు.. ఇటీవల సంక్రాంతి బరిలో దిగిన ఆ మూవీ మంచి హిట్ గా నిలిచింది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. పండుగ సీజన్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబట్టి.. సంక్రాంతి హిట్స్ జాబితాలో ఒకటిగా మారింది. ఆకట్టుకునే కథ, మెప్పించే కథనం, ఎంటర్టైన్మెంట్.. అన్నీ కలిసిన ఆ సినిమా నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ పడేలా చేసింది.
సాధారణంగా ఏ సినిమా అయినా హిట్ అయితే.. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. తదుపరి ప్రాజెక్టుల అవకాశాలు కూడా క్యూ కడతాయి. కానీ అనగనగా ఒక రాజు మూవీ విషయంలో మాత్రం అది పూర్తిగా వర్తించట్లేదనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఆ సినిమా హిట్ అయినప్పటికీ, దర్శకుడు మారికి నెక్స్ట్ ఛాన్స్ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకు ప్రధాన కారణం.. అనగనగా ఒక రాజు మూవీకి వచ్చిన క్రెడిట్ ఎక్కువగా నవీన్ పోలిశెట్టికే దక్కడమనే చెప్పాలి. కథ, రచన, యాక్టింగ్, ప్రమోషన్స్ సహా సినిమాకు సంబంధించిన నుంచి అన్ని విషయాల్లో కూడా నవీన్ పాత్ర చాలా కీలకంగా కనిపించింది. స్క్రిప్ట్ ఆయన చేతిలోనే తయారైంది. చిన్మయితో కలిసి నవీన్ స్క్రిప్ట్ వర్క్ చేశారు. దీంతో సినిమా సక్సెస్ మొత్తం నవీన్ ఖాతాలోనే పడిపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక దర్శకుడు మారి విషయానికి వస్తే.. సినిమా హిట్ అయినా సరే ఆయన పేరు పెద్దగా హైలైట్ కాలేదన్న మాట వినిపిస్తోంది. ప్రమోషన్ల సమయంలో దర్శకుడి కంటే నవీన్ పోలిశెట్టే ముందుండటం, మీడియా ఇంటరాక్షన్లలో కూడా హీరో డామినేషన్ కనిపించడంతో, దర్శకుడికి ప్రత్యేక గుర్తింపు రాలేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఇండస్ట్రీలో ఇదేం కొత్త విషయం కాదనే చెప్పాలేమో.
ఎందుకంటే గతంలో కూడా కొన్ని సినిమాల్లో హీరోల ఇమేజ్, స్క్రిప్ట్ ఇన్వాల్వ్మెంట్ కారణంగా దర్శకులు వెనుకబడ్డ సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే మీద హీరోల పట్టు ఎక్కువగా ఉంటే, సక్సెస్ క్రెడిట్ వారికే వెళ్లిపోతుంది. అనగనగా ఒక రాజు కూడా అలాంటి కేటగిరీలోకే వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దర్శకుడు మారి పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు.
హిట్ సినిమా ఆయన ఖాతాలో పడింది కాబట్టి, సరైన కథతో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే అవకాశాలు రావచ్చని అభిప్రాయం. కానీ ఇండస్ట్రీలో పోటీ ఎక్కువగా ఉండటం, కొత్త దర్శకులు క్యూ కడుతుండటంతో మారికి వెంటనే పెద్ద అవకాశం దక్కుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. మొత్తానికి అనగనగా ఒక రాజు సినిమా నవీన్ పోలిశెట్టిని మరోసారి స్టార్ హీరోగా నిలబెట్టగా, దర్శకుడు మారికి మాత్రం హిట్ కొట్టినా నెక్స్ట్ ఛాన్స్ విషయంలో అనిశ్చితి మిగిల్చిందనే చెప్పాలి.