విరుష్క లండన్ ఇంట్లో లార్డ్ శ్రీకృష్ణుని ఆరా
అంతేకాదు.. ఇండియాలో ఉన్నప్పుడు విరుష్క జోడీ, బృందావనంలోని ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు కూడా తీసుకున్నారు.;
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (విరుష్క) దంపతులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చాలా నిశ్శబ్దంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ఈ జంట తమ విశ్రాంత జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు, ఎలాంటి మీడియా గ్లేర్, పబ్లిక్ డిస్ట్రబెన్సెస్ లేకుండా గడిపేందుకు లండన్ లో నివశించాలని భావించినట్టు కథనాలొచ్చాయి. పలు సందర్భాల్లో లండన్ లోని ఇస్కాన్ దేవాలయంలో కీర్తన్స్, భజన్స్ లో పాల్గొని భక్తి శ్రద్ధలతో కనిపించారు. ఇటీవల లండన్ నివాసంలో వారు నిర్వహించిన పూజ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
విరుష్కకు ఇస్కాన్ (ISKCON)తో ఎంతో గొప్ప అనుబంధం ఉంది. వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇస్కాన్ గొప్ప పునాది. విరాట్, అనుష్కలకు ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ సమాజం), కృష్ణ భక్తి పై మొదటి నుంచీ గౌరవం ఉంది.
ఈ జంట లండన్‌లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా భక్తివేదాంత మనోర్ లేదా లండన్ నగరంలోని ఇస్కాన్ కేంద్రాలను సందర్శిస్తూ ఉంటారు. గతంలో వీరు అక్కడ కీర్తనల్లో పాల్గొన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
అంతేకాదు.. ఇండియాలో ఉన్నప్పుడు విరుష్క జోడీ, బృందావనంలోని ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. విరాట్ కోహ్లీ తన ప్రశాంతతకు, మానసిక శక్తికి ఇటువంటి ఆధ్యాత్మిక పర్యటనలే కారణమని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో విరుష్క బృందావనంలోని వరాహ్ ఘాట్‌లోని ఆశ్రమం శ్రీ హిట్ రాధా కేలి కుంజ్‌లో ప్రేమానంద్ జీ మహారాజ్‌ను సందర్శించారు. భజన్ మార్గ్ అధికారిక ఇన్‌స్టాహ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో ఈ జంట ప్రేమానంద్ జీ మహారాజ్‌తో లోతైన ఆధ్యాత్మిక సంభాషణలో నిమగ్నమై కనిపించారు.
ఇస్కాన్ - ఆధ్యాత్మిక మార్గం
`ఇస్కాన్` ద్వారా కృష్ణ సన్నిధానం స్వర్గధామానికి చేరుస్తుందా? అంటే....ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) ప్రధానంగా భగవద్గీత, శ్రీమద్భాగవతం బోధనలపై ఆధారపడి ఉంటుంది. శ్రీకృష్ణుడిని పరమాత్మగా నమ్మి, నిరంతరం ఆయన నామస్మరణ చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని వారు విశ్వసిస్తారు.
సాధారణ పురాణాల ప్రకారం పుణ్యం చేస్తే `స్వర్గానికి` వెళ్తాము అంటారు. కానీ ఇస్కాన్ బోధనల ప్రకారం, భక్తుల అంతిమ లక్ష్యం జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది, కృష్ణుడి నివాసమైన `గోలోక బృందావనం` చేరుకోవడం. కేవలం దేవాలయానికి వెళ్లడమే కాకుండా.. క్రమశిక్షణ, శాకాహారం, జపం, నిస్వార్థ సేవ ద్వారా మనసును శుద్ధి చేసుకోవడమే ఈ మార్గంలోని అసలు ఉద్దేశ్యం.
విరాట్ కోహ్లీ వంటి గ్లోబల్ ఐకాన్ తన బిజీ లైఫ్ షెడ్యూల్‌లోనూ ఇలాంటి సంప్రదాయాలను, ఆధ్యాత్మికతను పాటించడం నేటి యువతకు ఒక ప్రేరణగా నిలుస్తోంది. ఇంతకుముందు కేవలం ఇస్కాన్ దేవాలయాలకు వెళ్లి ఆచరించిన మనోశుద్ధి కార్యక్రమాలను ఇప్పుడు ఇంట్లో కూడా కొనసాగించడం తదుపరి దశ. భవిష్యత్ లో ఈ జంట మరింత ఉన్నతమైన హైట్స్ కి చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లార్డ్ శ్రీకృష్ణుని సన్నిధానంలో పూజలాచరించినప్పుడు అక్కడ లార్డ్ ఆరా పని చేస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది వారికి అద్భుతమైన శక్తినిస్తుంది.