అంతా విజయసాయిరెడ్డి డైరెక్షనేనా? ఏ5 అప్రూవర్ అయినట్లేనా!

ఏపీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు కొలిక్కి వచ్చింది. కేసులో ప్రధాన నిందితులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు చాకచక్యంగా అరెస్టు చేస్తున్నారు.;

Update: 2025-05-17 10:30 GMT

ఏపీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు కొలిక్కి వచ్చింది. కేసులో ప్రధాన నిందితులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు చాకచక్యంగా అరెస్టు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి, కీలక నిందితులు ధనుంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీని అదుపులోకి తీసుకోవడంతో విచారణ దాదాపు ముగింపు దశకు చేరుకుందనే టాక్ వినిపిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్ స్కాం అంటూ హడావుడి మొదలుపెట్టినా, విచారణ, అరెస్టుల పర్వం మొదలైంది మాత్రం గత మార్చిలోనే.. దాదాపు 8 నెలలుగా నత్తనడకగా సాగిన విచారణ ఒకేసారి ఊపందుకోడానికి ప్రధాన కారణం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటూ ప్రచారం జరుగుతోంది. ‘‘ఔను.. లిక్కర్ స్కాం జరిగింది’’ అంటూ విజయసాయిరెడ్డి మార్చిలో చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి ఇంతవరకు వచ్చిందని అంటున్నారు.

గత మార్చి నెలలో కాకినాడ సీపోర్టు వాటాల బదిలీపై సీఐడీ విచారణకు వెళ్లిన విజయసాయిరెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కాంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసి రెడ్డి అంటూ అప్పట్లో విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. ఆ తర్వాతే స్కాంపై విచారణకు ఏర్పాటైన సిట్ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. అప్పటి వరకు సోదాలు, తనిఖీలు అంటూ కాలం గడిపిన సిట్ అధికారులు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనతో రాజ్ కసిరెడ్డిని విచారణకు పిలిచారు. మరోవైపు అప్పటివరకు లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా తమకేం జరగదని, తమ పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని ధీమా వ్యక్తం చేశారు. కానీ, విజయసాయిరెడ్డి నోరు విప్పిన తర్వాత రాజ్ కసిరెడ్డితోపాటు ఎంపీ మిథున్ రెడ్డి వంటివారు కోర్టు నుంచి రక్షణకు ప్రయత్నించడం గమనార్హం. వైసీపీ ఆవిర్భావం నుంచి తమతో ఉన్న విజయసాయిరెడ్డి సడన్ గా రాజకీయ విరామం ప్రకటించడం, మాజీ సీఎం జగన్ చుట్టు ఉన్నవారిపై కోటరీ ముద్ర వేసి తనను అధినేత నుంచి దూరం చేశారనే ఆరోపణలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని అంటున్నారు.

వైసీపీలో సీనియర్లతో విజయసాయిరెడ్డికి గ్యాప్ రావడంతో ఆయన గత ప్రభుత్వంలో తీసుకున్న పలు విధానాలను పూసగుచ్చినట్లు కూటమి ప్రభుత్వానికి చెప్పేసినట్లు చెబుతున్నారు. ఇక సుమారు 8 నెలలు పాటు లిక్కర్ స్కాంలో సోదాలు చేసిన సిట్ కు లభించని సమాచారం విజయసాయిరెడ్డి చెప్పడంతోనే అరెస్టుల వరకు వెళ్లిందని టాక్ వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి బయట మాట్లాడిన తర్వాత వేగంగా మారిన పరిణామాలు వైసీపీని తీవ్రంగా దెబ్బతీశాయంటున్నారు. ఈ పరిస్థితులు గమనిస్తున్న వారు సిట్ దర్యాప్తు విజయసాయిరెడ్డి డైరెక్షనులో కొనసాగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి స్కాంలో 5వ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి మిగిలిన నిందితులకు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. విజయసాయిరెడ్డి మినహా మిగిలిన వారంతా అరెస్టు భయంతో వణికి పోతుంటే సాయిరెడ్డి మాత్రం గుడులు, గోపురాలకు వెళుతూ పాప.. ప్రక్షాళన కోరుతున్నారని అంటున్నారు.

జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తున్న వారు విజయసాయిరెడ్డి, సిట్ చర్యలను గమనిస్తే కేసులో సాయిరెడ్డి అప్రూవర్ గా మారిపోయారా? అని సందేహిస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా విజయసాయిరెడ్డి తీరు చూస్తే ఆయన ప్రభుత్వానికి, సిట్ కు పూర్తిగా సహకరిస్తున్నట్లేనని అంటున్నారు. సిట్ అధికారులు కూడా వరుసగా నిందితులను అరెస్టు చేస్తుండటం, విజయసాయిరెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోందని అంటున్నారు.

మరోవైపు గత ప్రభుత్వంలో నెంబర్ టు గా వ్యవహరించారనే ఆరోపణలను సైతం కొట్టిపడేస్తున్న విజయసాయిరెడ్డి.. తనకు మాజీ సీఎం జగన్ కు మధ్య చాలా గ్యాప్ ఉందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ పాలనాకాలంలో అన్నీతానే అన్నట్లు వ్యవహరించిన సాయిరెడ్డి యూటర్న్ తో ఎన్నికల్లో ఓటమికి మించిన నష్టం జరుగుతోందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. లిక్కర్ స్కాంలో పార్టీని డ్యామేజ్ చేసేలా సమాచారం సాయిరెడ్డి ఇచ్చారా? అనే అనుమానాలకు తోడు మరిన్ని అంశాలపై గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని ఇబ్బంది పెట్టేలా సాయిరెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తారా? అనే టెన్షన్ కూడా వైసీపీలో కనిపిస్తోంది. దీంతో సాయిరెడ్డిని కట్టడి చేసే వ్యూహంపై వైసీపీ అధిష్టానం ఫోకస్ చేసిందని అంటున్నారు.

Tags:    

Similar News