తిడుతుంటే చూస్తూ ఊరుకోవడం కష్టం!

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తన వ్యక్తిగత జీవితం- సోషల్ మీడియా ప్రభావం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-04-15 03:00 GMT

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తన వ్యక్తిగత జీవితం- సోషల్ మీడియా ప్రభావం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి తమన్నా భాటియాతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో తనపై వస్తోన్న‌ నెగటివిటీ, ట్రోలింగ్ పై ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఈ నేప‌థ్యంలో కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించడం చర్చనీయాంశమైంది. తమన్నా- విజయ్ వర్మల బ్రేకప్ విష‌యం తెలిసిందే. అయితే ఈ సాకుతో సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అది తన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తోంద‌న్నారు. `ఎవరు పడితే వారు తిడుతుంటే చూస్తూ ఊరుకోవడం కష్టం` అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని కానీ వ్యక్తిగత విషయాల్లోకి ఇతరులు అనవసరంగా జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని విజయ్ వర్మ అభిప్రాయపడ్డారు.సోషల్ మీడియా అనేది విషపూరితమైన వాతావరణంగా మారుతోందని అక్కడ ఉండే ప్రతికూలత కంటే తన పనిపై దృష్టి పెట్టడమే ఉత్తమమని భావిస్తున్నాన‌న్నారు.

అందుకే మానసిక ఆరోగ్యం కోసం డిజిటల్ ప్రపంచం నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప‌రిశ్ర‌మ స‌హాకొంద‌న‌రు నెటిజ‌నులు మ‌ద్ద‌తుగా నిలిచారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరిగే దాడి ఏ స్థాయిలో ఉంటుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఎంత స్టార్‌డమ్ ఉన్నా? వారు కూడా మనుషులేనని, వారికి భావోద్వేగాలు ఉంటాయన్న విషయాన్ని ట్రోలర్స్ మర్చిపోతున్నారని పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం విజయ్ వర్మ ప్రొఫెషనల్ కెరీర్ పై దృష్టి పెట్టారు.

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన తన నటన ద్వారానే విమర్శకులకు సమాధానం చెప్పాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ సృజనాత్మకతను మెరుగు పరుచుకోవడమే ప్రస్తుతానికి ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ విరామం తనను మరింత దృఢంగా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మ‌ద్య కాలంలో విజ‌య్ న‌టుడిగా పెద్ద బిజీగా క‌నిపించ‌లేదు. 2024 లో `మ‌ర్డ‌ర్ ముబార‌క్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందు కొచ్చాడు. కానీ ఈ సినిమా ఆశీంచిన ఫ‌లితాలు సాధించ‌లేదు. గ‌త ఏడాది విజ‌య్ న‌టించిన `గుస్తాక్ ఇష్క్` రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా నిరుత్సాహాన్నే మిగిల్చింది. ప్ర‌స్తుతం విజ‌య్ చేతిలో అధికారికంగా ఎలాంటి ప్రాజెక్ట్ లు లేవు. కొత్త సినిమాలేవైనా అత‌డు క‌మిట్ అయితే? వెల్ల‌డిస్తే గానీ క్లారిటీ రాదు.

Tags:    

Similar News