కొడవ పద్ధతిలో రష్మిక - విజయ్ పెళ్లి ఎలా జరగబోతోందో తెలుసా?
కొడవ సంప్రదాయం చాలా ప్రత్యేకం. ఇందులో మిగతా పెళ్లిళ్లలాగా అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేయడం, బ్రాహ్మణ పూజారి మంత్రోచ్ఛరణలు ఉండవు.;
చాలా కాలంగా ఊరిస్తున్న 'విరోష్' పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ఇప్పటికే విజయ్,రష్మిక ల పెళ్లి ఉదయ్‌పూర్ వేదికగా తెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగిపోయింది. కొడవ సంప్రదాయాల మేళవింపుతో ఈ వేడుక నేడు సాయంత్రం మరింత అంగరంగ వైభవంగా జరగబోతోంది. ముఖ్యంగా రష్మిక సొంత ఊరైన కొడవ (కూర్గ్) సంప్రదాయం ప్రకారం జరిగే వివాహ తంతు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అస్సలు బ్రాహ్మణ పురోహితులు లేకుండా, పెద్దల సమక్షంలో ప్రకృతి సాక్షిగా జరిగే ఈ అరుదైన పెళ్లి వేడుక విశేషాలు ఇప్పుడు చూద్దాం..
ప్రకృతి సాక్షిగా.. పెద్దల ఆశీస్సులతో:
కొడవ సంప్రదాయం చాలా ప్రత్యేకం. ఇందులో మిగతా పెళ్లిళ్లలాగా అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేయడం, బ్రాహ్మణ పూజారి మంత్రోచ్ఛరణలు ఉండవు. అంతా ప్రకృతిని, పూర్వీకులను స్మరిస్తూ సాగుతుంది. 'కావేరమ్మ' (కావేరి నది)ని దైవంగా భావించి, కుటుంబ పెద్దల ఆశీస్సులతో ఈ బంధం ముడిపడుతుంది. ఇక రష్మిక తన పూర్వీకుల పద్ధతిని గౌరవిస్తూ, ఈ ఆచారాలను పాటించబోతుండటం విశేషం. ఉదయం తెలుగు పద్ధతిలో జరిగిన పెళ్లిలో విజయ్ సంప్రదాయం ప్రతిబింబిస్తే, సాయంత్రం జరిగే కొడవ వేడుకలో రష్మిక మూలాలు కళ్లముందు కదలాడనున్నాయి.
విభిన్నమైన వేషధారణ.. పాతక్ మెరుపులు:
కొడవ పెళ్లిలో ప్రధాన ఆకర్షణ వధువు కట్టుకునే చీర. సాధారణంగా మనం కొంగును ఎడమ భుజంపై వేసుకుంటే, కొడవ పద్ధతిలో చీర కుచ్చెళ్లు వెనుక వైపు ఉండి, కొంగు కుడి భుజంపై నుండి వస్తుంది. దీనినే 'కొడవ ఉడుగే' అంటారు. దీనికి తోడు రష్మిక 'పాతక్' అనే సంప్రదాయ బంగారు నాణెం ఉన్న నెక్లెస్‌ను ధరించనుంది. ఇది ఆ సంప్రదాయంలో వివాహితకు ఇచ్చే అత్యంత పవిత్రమైన గుర్తు. ఇక విజయ్ కూడా కొడవ పురుషులు ధరించే 'కుప్య' (నలుపు రంగు కోటు) వంటి ప్రత్యేక దుస్తుల్లో మెరిసే అవకాశం ఉంది. ఈ విభిన్నమైన ఆహార్యం ఈ జంటను మరింత స్పెషల్‌గా చూపించనుంది.
ఈ పెళ్లిలో కేవలం పూజలే కాదు, నృత్యం మరియు సంగీతానికి పెద్దపీట వేస్తారు. కొడవ సంప్రదాయంలో 'వాల్గ' అనే జానపద నృత్యం ఎంతో ఫేమస్. పెళ్లిలో బంధువులంతా కలిసి చేసే ఈ డాన్స్ ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక పెళ్లి ముగిశాక మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసే విందులో కూడా ఈ రెండు రాష్ట్రాల వంటకాల రుచులు వడ్డించనున్నట్లు సమాచారం. ఇక 8 సంవత్సరాల స్నేహం, ప్రేమ ఇప్పుడు ఇలా రెండు గొప్ప సంస్కృతుల కలయికతో వివాహ బంధంగా మారి.. అభిమానులకు పండుగ లాంటి సందర్భాన్ని కలిగించారు.