'జననాయగన్'కు నో బ్రేక్స్.. అంతా సెట్ అయిపోయినట్లేనా?

ఎన్నో బ్రేకులతో నిలిచిపోయిన ఆ సినిమా విడుదలకు ఇప్పుడు లైన్ క్లియర్ అయిందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.;

Update: 2026-05-10 09:30 GMT

తమిళనాడు పాలిటిక్స్ లో సంచలనం సృష్టించిన కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన చివరి చిత్రం జననాయగన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఎన్నో బ్రేకులతో నిలిచిపోయిన ఆ సినిమా విడుదలకు ఇప్పుడు లైన్ క్లియర్ అయిందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

మొదట ఆ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మూవీ టీమ్ భావించింది. అయితే సెన్సార్‌ సంబంధిత సమస్యలు వరుసగా ఎదురయ్యాయి. కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. బోర్డు సూచనల మేరకు చేంజెస్ చేసినప్పటికీ సర్టిఫికెట్‌ ప్రాసెస్ ఆలస్యమైంది. ఇబ్బందులు పెరగడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించినా ఆశించిన ఫలితం రాలేదు.

అదే సమయంలో సినిమాకు మరో షాక్‌ తగిలింది. చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలు ఆన్‌ లైన్‌ లో లీక్ కావడంతో ఓటీటీ డీల్స్‌ పై ప్రభావం పడిందని సమాచారం. ఇప్పటికే భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఆ సినిమాపై ఒత్తిడి పెరిగిన సమయంలో తమిళనాడు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం కూడా విడుదలకు మరో అడ్డంకిగా మారింది. దీంతో మొత్తం మూవీ టీమ్ కాస్త సైలెంట్ అయింది.

అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికలు కంప్లీట్ అవ్వడం, విజయ్ అధికారంలోకి రావడం, రాజకీయ వాతావరణం కూడా అనుకూలంగా మారడంతో జన నాయగన్ విడుదలకు పెద్దగా ఆటంకాలు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తమిళనాడులో విజయ్‌ కు ఉన్న భారీ ఫ్యాన్‌ బేస్‌ ఇప్పుడు సినిమాకు ఎక్స్ట్రా అసెట్ గా మారనుంది.

దీంతో సంక్రాంతి సీజన్‌ లో ఆ సినిమా విడుదలై ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదనే చర్చ కూడా సాగుతోంది. అప్పట్లో భారీ చిత్రాల పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మన శంకర వరప్రసాద్ గారు వంటి భారీ సినిమాలు థియేటర్లను ఆక్యుపై చేయడంతో జననాయగన్ కు సరిపడా స్క్రీన్లు దొరికే పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు పెద్ది మినహా పెద్ద సినిమాల హడావిడి లేకపోవడం జన నాయగన్ కు కలిసొచ్చే అంశంగా మారింది.

థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా ఎక్కువగా ఉండటంతో విడుదలకు సరైన సమయమిదేనని అంతా చెబుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని, సంచలనాలు క్రియేట్ అవుతాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా వల్ల భారీ నష్టాలు వస్తాయేమోనని ఆందోళన చెందిన నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోందని కోలీవుడ్‌ లో టాక్ వినిపిస్తోంది.

పొలిటికల్ విక్టరీతో పాటు విజయ్ ఇమేజ్ మరింత పెరగడం సినిమాకు పాజిటివ్‌ గా మారిందని భావిస్తున్నారు. మే 27వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. జోరుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు అభిమానులు కూడా ప్రత్యేక డిమాండ్లు చేస్తున్నారు. సినిమా టైటిల్ కార్డులో దళపతి విజయ్ బదులుగా సీఎం విజయ్ అని చూపించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా చూస్తే.. రాజకీయ సంచలనంతో పాటు జన నాయగన్ కు కూడా కొత్త ఊపు వచ్చినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు ఆ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News