సూపర్ స్టార్ మూవీలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్‌గా వారు..!
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం తన చివరి సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే రాజకీయాలతో బిజీ అయిన విజయ్ 'జన నాయగన్' సినిమా తర్వాత హీరోగా కనిపించక పోవచ్చు అని తమిళనాట, కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.;
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం తన చివరి సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే రాజకీయాలతో బిజీ అయిన విజయ్ 'జన నాయగన్' సినిమా తర్వాత హీరోగా కనిపించక పోవచ్చు అని తమిళనాట, కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అందుకే జన నాయగన్ సినిమాను చాలా స్పెషల్‌గా తీర్చిదిద్దుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు తెలుగు హిట్ మూవీ భగవంత్ కేసరి ఇన్స్పిరేషన్ అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అది నిజమే అన్నట్లుగా కొన్ని సాక్షాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం రీమేక్ అనే విషయాన్ని ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. తెలుగు వర్షన్‌కి చాలా మార్పులు చేయడం ద్వారా దీన్ని రీమేక్ అని కాకుండా, డైరెక్ట్ సినిమాగానే మేకర్స్ చెప్పుకుంటున్నారు అనేది కొందరి మాట. అసలు విషయం ఏంటి అనేది విడుదలైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
జన నాయగన్ సినిమా అప్డేట్...
సూపర్ స్టార్‌గా దాదాపు మూడు దశాబ్దాలుగా తమిళ ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన విజయ్ చివరి సినిమా ఇదే అంటే ఆయన అభిమానులతో పాటు, రెగ్యులర్ ప్రేక్షకులు సైతం ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం సంతోషంగానే ఉంది, ఆయన రాష్ట్రం కోసం పని చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ సినిమాలను చేస్తూనే ఆ పని చేయవచ్చు కదా అని చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ రెండు పడవల ప్రయాణం తనకు ఇష్టం లేదని విజయ్ సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నాడు అంటూ ఆయన పార్టీ నాయకులు చెబుతున్నారు. అందుకే జననాయగన్ సినిమాను చాలా స్పెషల్‌గా ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగానే భారీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో పాటు పలు సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ను ఈ సినిమాలో జొప్పించారని తెలుస్తోంది.
సూపర్ స్టార్ విజయ్ చివరి సినిమా...
తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి సినిమా క్లైమాక్స్ కు జన నాయగన్ సినిమా క్లైమాక్స్ కి పోలిక ఉండదని అంటున్నారు. క్లైమాక్స్ లో సర్‌ప్రైజింగ్ గా తనకు ఎంతో ఇష్టమైన, తన కెరీర్‌లో కీలకమైన ముగ్గురు నలుగురు దర్శకులను విజయ్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌తో పాటు మరో ఇద్దరు దర్శకులను క్లైమాక్స్ సీన్ లో చూపిస్తారని తెలుస్తోంది. వారితో విజయ్ డైరెక్ట్ డైలాగ్ షాట్స్ ఉంటాయట. ఒక బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను, ఆ బాధ్యతను మీరు సరిగ్గా నెరవర్తించాలంటూ చెప్తాడట. అలా సినిమాను ముగించడం ద్వారా తన సినిమా ఇండస్ట్రీకి వీడ్కోలును విజయ్ ఇవ్వబోతున్నాడు అంటున్నారు. తాను ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చినా, తన సన్నిహితులు అయిన వీళ్లు మీకు సినిమాల ద్వారా వినోదం ను ఇస్తారు అనేది విజయ్ అందులో తన ఫ్యాన్స్‌కి సందేశంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేక్...
విజయ్ నటిస్తున్న ఈ సినిమాను 2026 పొంగల్ రేసులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. గత కొంత కాలంగా విజయ్ నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి అదే సమయంలో విడుదల చేయడం చూస్తూ ఉన్నాం. కానీ జన నాయగన్ సినిమాను మాత్రం తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేయాలని అనుకోవడం లేదట. అందుకే తెలుగు బయ్యర్లు ఆసక్తి చూపించినా అమ్మేందుకు నిర్మాతలు ఒప్పుకోలేదు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కాకున్నా ఓటీటీ స్ట్రీమింగ్ కావడం ఖాయం. అందుకే విజయ్ చివరి సినిమా అన్ని విధాలుగా స్పెషల్‌గా ఉంచేందుకు గాను ఫిల్మ్ మేకర్స్ డబ్బులతో సంబంధం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్స్ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, విజయ్ ఫ్యాన్స్ కి గుర్తుండి పోయేలా నిలుస్తుందని అంటున్నారు. అంతే కాకుండా సినిమా విజయ్ పొలిటికల్ జర్నీకి మరింత ఉపయోగపడే విధంగా ఉంటుందని కూడా అంటున్నారు.