'జన నాయగన్' ఇప్పట్లో వచ్చే ప్రసక్తే లేదా?
దళపతి విజయ్ నటించిన చివరి సినిమా `జన నాయగన్`. చుట్టూ ఏం జరుగుతోంది?.. ఎందుకు రిలీజ్ వాయిదాపడింది? .. సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ జారీ చేయడానికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.;
దళపతి విజయ్ నటించిన చివరి సినిమా `జన నాయగన్`. చుట్టూ ఏం జరుగుతోంది?.. ఎందుకు రిలీజ్ వాయిదాపడింది? .. సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ జారీ చేయడానికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఎందుకు మళ్లీ కోర్టు మెట్లెక్కారు? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అభిమాన నటుడు విజయ్ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో అభిమానుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
ఈ మూవీని ముందు జనవరి 9న పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ సమస్యల కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. సెన్సార్ బోర్డ్ వారు చెప్పిన కట్స్‌కు, డైలాగ్‌లని మ్యూట్ చేయడానికి అంగీకరించిన టీమ్ తిరిగి సెన్సార్‌కు పంపించింది. అయినా సరే వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మేకర్స్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం, ఇరువురి వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి తీర్పుని రిజర్వ్ చేసి శుక్రవారం ఉదయం సెన్సార్ వారు సర్టిఫికెట్ జారీ చేయాల్సిందేనని తీర్పు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక `జన నాయగన్`కు ఎలాంటి అడ్డు లేదని, ఇక థియేటర్లలోకి వచ్చేస్తుందని విజయ్ అభిమానులు, సినీ లవర్స్, విజయ్‌ని అభిమానించే కోలీవుడ్ స్టార్స్ సంబరాలు చేసుకున్నారు. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సీన్ మళ్లీ మారింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాస్ హైకోర్ట్ డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. అంతే కాకుండా తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో `జన నాయగన్` రిలీజ్ ఇప్పట్లో కష్టమనే సంకేతాలు మొదలయ్యాయి. శుక్రవారం సింగిల్ జడ్జ్ తీర్పుతో సినిమాని సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ చేసుకోవచ్చని మేకర్స్‌తో పాటు అభిమానులు, కోలీవుడ్ వర్గాలు భావించాయి. కానీ తాజా తీర్పుతో అందరిలోనూ విజయ్ సినిమా రిలీజ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన కష్టాలు జనవరి 21న ఇచ్చే తీర్పుతో అయినా తీరతాయా? అనే అనుమానం అందరినీ వెంటాడుతోంది.
రాజకీయ కారణాల వల్లే విజయ్ సినిమాకు అడ్డంకులు ఎదురవుతున్నాయని,సెన్సార్ వివాదం చిలికి చిలికి పెను తుఫానుగా మారుతోందని,దీన్ని ముక్తఖంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్ ఫేర్‌వెల్ మూవీగా రిలీజ్ అవుతున్న `జన నాయగన్`పై ఎందుకు ఇలాంటి వివాదం జరుగుతోందో అర్థం కావడం లేదని, తమిళ సినిమాలని సీబీఎఫ్‌సీ టార్గెట్ చేస్తోందని, దీని వల్ల కోట్ల రూపాయలు నిర్మాతలు, ఇండస్ట్రీ నష్టపోతోందని కోలీవుడ్ వర్గాలు వాపోతున్నాయి.