'జన నాయగన్' సెన్సార్.. అసలు విషయం ఇదేనా?
యూ/ఏ సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. వెంటనే సెన్సార్ బోర్డు అప్పీల్ చేయగా, ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించింది.;
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ.. ఆయన కెరీర్ లోనే చివరి సినిమా.. జన నాయగన్. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. భారీ బడ్జెట్ తో చిత్రాన్ని రూపొందించింది. జనవరి 9వ తేదీన మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ సమస్యల కారణంగా విడుదల అవ్వలేదు.
అలా జన నాయగన్ మూవీ సెన్సార్ సర్టిఫికెట్ విషయం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎందుకు సెన్సార్ బోర్డు అధికారులు సర్టిఫికెట్ ను జారీ చేయలేదోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అసలేం జరిగిందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఆ విషయంపై ఇప్పటివరకు ఒక టాక్ వినిపించగా.. ఇప్పుడు మరో విషయం నెట్టింట ఫుల్ వైరల్ గా మారడం గమనార్హం.
నిజానికి.. డిసెంబర్ లో సినిమాను సెన్సార్ కు పంపించామని మూవీ టీమ్ చెబుతుంది. అప్పుడు సెన్సార్ బోర్డు కొన్ని మార్పులు సూచించిందని, దీంతో వాటికి తగ్గట్టు ఛేంజెస్ చేసి పంపామని అంటుంది. కానీ సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని, రిలీజ్ దగ్గరపడుతున్నా సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఇచ్చింది.
యూ/ఏ సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలంటూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. వెంటనే సెన్సార్ బోర్డు అప్పీల్ చేయగా, ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించింది. దీంతో సుప్రీంకోర్టుకు జన నాయగన్ మూవీ టీమ్ వెళ్లగా, ఆ విషయంలో జోక్యానికి నిరాకరించింది. మద్రాసు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. అయితే ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడానికి అసలు కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది.
సినిమాలో తమిళనాడు అధికార పార్టీని విమర్శించే డైలాగ్స్, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని అవమానించేలా ఉన్న కొన్ని ఎపిసోడ్ లు ఉన్నాయని సెన్సార్ బోర్డు అభిప్రాయపడిందట. వాటిని తొలగించాలని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ మూవీ టీమ్ మాత్రం వాటినన్నింటినీ తొలగించలేదని సమాచారం. విజయ్ పొలిటికల్ ఎంట్రీ దృష్టిలో పెట్టుకుని స్టోరీతోపాటు డైలాగ్స్ రాసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అందుకే వాటిని తొలగిస్తే సినిమా ఉద్దేశమే మారిపోతుందని నిర్మాతలు అప్పుడు భావించేరేమోనని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా సెన్సార్ బోర్డు.. ఛేంజెస్ తో తృప్తి చెందక రివిజన్ కమిటీకి మూవీని పంపిందట. అందుకే సర్టిఫికెట్ రావడం ఆలస్యమైందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు. రివిజన్ కమిటీ చెప్పిన మార్పులు చేశాక సర్టిఫికెట్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాసెస్ అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మరి..