సూర్యకి సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌, వార్నింగ్‌..!

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఇప్పటికే ఆయన రాజకీయ నాయకుడిగా మారి పోయాడు.;

Update: 2025-07-31 14:30 GMT

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఇప్పటికే ఆయన రాజకీయ నాయకుడిగా మారి పోయాడు. సమయం ఉన్నప్పుడు 'జన నాయగన్‌' సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావించినప్పటికీ వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కనుక ఎన్నికల్లో మైలేజ్‌ కోసం విజయ్‌ నటిస్తున్న ఈ చివరి సినిమాను వచ్చే ఏడాది పొంగల్ రేసులో దించడం జరిగింది. జన నాయగన్‌ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని ప్రకటించి చాలా నెలలు అవుతుంది. కనుక పెద్ద హీరోల సినిమాలు పొంగల్ రేసులో ఉండే అవకాశం లేదని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా రెండు సినిమాలు పొంగల్‌ రేసులోకి విజయ్‌తో ఢీ కొట్టేందుకు దూక బోతున్నాయి.

2026 సంక్రాంతికి శివ కార్తికేయన్‌ పరాశక్తి

శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందుతున్న 'పరాశక్తి' సినిమాను 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. శివ కార్తికేయన్‌ ఒక మోస్తరు హీరో కనుక పెద్దగా ఇబ్బంది ఏం ఉండదు అనుకున్నారు. కానీ ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమాను సైతం 2026 సంక్రాంతి రేసులో విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందట కరుప్పు సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అంతే కాకుండా సినిమాను పొంగల్‌ కి విడుదల చేయాలని కూడా భావిస్తున్నారు.

జన నాయగన్‌ కి పోటీగా కరుప్పు మూవీ

విజయ్‌ సినిమా జన నాయగన్‌ పొంగల్ రేసులో ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ సినిమాకు పోటీ ఉంటే ఖచ్చితంగా థియేటర్ల సంఖ్య తగ్గుతుంది, పోటీ ఉంటే ఓపెనింగ్ కూడా తగ్గుతాయి. విజయ్ చివరి సినిమా కనుక సోలో రిలీజ్‌కి అంతా సహకరించాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. జన నాయగన్ సినిమాకు పోటీగా కరుప్పు సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరాశక్తి కారణంగానే విజయ్ సినిమాకు నష్టం ఉంటుంది అనుకుంటూ ఉంటే ఇప్పుడు కరుప్పు సినిమాతో సూర్య మరింత డ్యామేజ్ చేయబోతున్నాడు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

సూర్య సినిమా వాయిదా పడేనా?

సూపర్‌ స్టార్‌కి చివరి సినిమా కనుక ఆయనకు గౌరవ ప్రధంగా వీడ్కోలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకు కోలీవుడ్‌ స్టార్స్‌ అంతా సహకరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ సూర్య మాత్రం తన కరుప్పు సినిమాను విడుదల చేయడం ద్వారా విజయ్‌ ను అగౌరవ పరుస్తున్నాడు అంటూ కొందరు విజయ్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో సూర్యను విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరుప్పు సినిమాను పొంగల్‌కి విడుదల చేయకూడదని వార్నింగ్‌ ఇస్తున్నారు. సూర్యకు కొందరు విజయ్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌ చేస్తూ డేట్‌ మార్చుకోమంటున్నారు, మరికొందరు మాత్రం సీరియస్ వార్నింగ్‌లు ఇస్తూ కరుప్పు సినిమా డేట్‌ మార్చుకోవాల్సిందే అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. చివరకు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News