'ప్యూర్ ఫీల్ తోనే స్కాలర్ షిప్స్'.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విరోష్
ఇటీవలే విజయ్ తన సతీమణి రష్మికతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలో గృహప్రవేశం చేసిన సందర్భంగా.. టాలెంట్ ఉన్న విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు.
స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల తెలంగాణంలోని నాగర్ కర్నూల్ జిల్లా స్వగ్రామంలో టాలెంటెడ్ స్టూడెంట్స్ కు అండగా ఉంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 180 మందికి స్కాలర్ షిప్స్ అందించారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్ కు చెందిన పాఠశాలల్లో 2026 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి మెరిట్ స్కాలర్ షిప్ అవార్డులను ప్రకటించారు. ఆదివారం ఉదయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న స్వయంగా విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.
ఇటీవలే విజయ్ తన సతీమణి రష్మికతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలో గృహప్రవేశం చేసిన సందర్భంగా.. టాలెంట్ ఉన్న విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ.. విద్యార్థుల్లో ఇన్స్పిరేషన్ కలిగించేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
"ఊరు మస్త్ అందంగా ఉంది. వెదర్ బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడే మమ్మీ చేతులెత్తించి మరీ క్లాస్ పీకారు" అంటూ సరదాగా మాటలు ప్రారంభించిన ఆయన.. "ముందు మీ అందరికీ కంగ్రాట్స్. మిమ్మల్ని సెలబ్రేట్ చేయడానికి ఈరోజు మేం వచ్చాం. మీ మార్కులు కాదు.. మీరంతా ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్స్ గా సాధించిన డిసిప్లిన్, ఫోకస్ ను సెలబ్రేట్ చేస్తున్నాం" అన్నారు.
"మార్కులు ఒకసారి ఎక్కువ వస్తాయి.. మరొకసారి తక్కువ వస్తాయి. ఇంకొక స్కూల్‌లో ఇంకెవరో ఫస్ట్ వస్తారు. కానీ డిసిప్లిన్, ఫోకస్ ఉంటే ఎప్పుడైనా జీవితంలో సాధిస్తారు" అని చెప్పారు. నాగర్ కర్నూల్ స్టడీస్ డెవలప్మెంట్ పై సంతోషం వ్యక్తం చేసిన విజయ్.. "ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నాగ ర్‌కర్నూల్ ఈసారి తెలంగాణలో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఆ క్రెడిట్ నాకు ఇచ్చారు. కానీ అంతా మానిటర్ చేస్తే ప్రోగ్రెస్ వచ్చింది. టీచర్స్ కు, పేరెంట్స్ కు క్రెడిట్ ఇవ్వాలి. ఒక ఏడాదిలో ప్రోగ్రెస్ రావడం కష్టం. వాళ్ల ఎఫర్ట్ కనిపిస్తోంది" అని పేర్కొన్నారు.
"పిల్లల పర్సనాలిటీ పక్కన వాళ్లను చూస్తూ డెవలప్ అవుతుంది. నేను పేరెంట్స్, పుట్టపర్తి ఎన్విరాన్మెంట్ బట్టి ఇలా పెరిగా. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి" అని సూచించారు.కడపలో షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెబుతూ.. "నాతో ఫోటో తీసుకున్న రోజు పెద్ద వాళ్ళు తోసుకోవడం వల్ల పిల్లలు కూడా అలాగే చేశారు.. అందుకే పెద్ద వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేస్తే పిల్లలు కూడా అలాగే చేస్తారు" అని అన్నారు.
"మేం చిన్న స్కాలర్ షిప్ గిఫ్ట్ మాత్రమే ఇస్తున్నాం. కానీ మీ అందరి జీవితంలో భాగం కావాలని కోరుకుంటున్నాం. మొత్తం తెలంగాణ అంతా ఇవ్వాలని మా డ్రీమ్. ప్యూర్ ఫీల్ తో చేస్తున్నాం. ప్రతి ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేస్తాం. అందరికీ గుడ్ లక్" అంటూ విషెస్ తెలిపారు. ఆ తర్వాత విజయ్, రష్మిక ఇద్దరూ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించారు. ఫ్యూచర్ జెనరేషన్స్ కు అండగా నిలవాలనే వారి ఆలోచన ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది.