ఒక సినిమా ఆగింది.. కాంబినేషన్ మాత్రం ఆగలేదు!
విజయ్ దేవరకొండ, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఒక ఆగిపోయిన సినిమా కూడా ఉంది.
విజయ్ దేవరకొండ, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఒక ఆగిపోయిన సినిమా కూడా ఉంది. 2019లో హీరో అనే ప్రాజెక్ట్ మొదలైంది. షూటింగ్ కూడా చేశారు. కానీ ఒక షెడ్యూల్ తర్వాత సినిమా ముందుకు వెళ్లలేదు. అసలైతే ఇలాంటి అనుభవం తర్వాత అదే హీరో, బ్యానర్ మళ్లీ కలవడానికి కొంత గ్యాప్ వస్తుంది. విజయ్, మైత్రి విషయంలో మాత్రం కథ వేరుగా సాగింది.
ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాను ప్లాన్ చేశారు. విజయ్ బైక్ రేసర్‌గా కనిపించాల్సి ఉండగా, మాళవిక మోహనన్ హీరోయిన్‌గా తీసుకున్నారు. షూటింగ్ కోసం టీమ్ బయట దేశాలకు కూడా వెళ్లింది. కొంత భాగం పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పట్లో కథ, బడ్జెట్ విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. కానీ సినిమా ఎందుకు నిలిచిపోయిందనే విషయంపై పూర్తి వివరాలు బయటకు రాలేదు.
అదే సమయంలో మైత్రి బ్యానర్‌లో విజయ్ చేసిన డియర్ కామ్రేడ్ కూడా వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితం ఇవ్వలేదు. ఒకవైపు హీరో ఆగిపోవడం, మరోవైపు డియర్ కామ్రేడ్ రిజల్ట్ ఇలా రెండు సినిమాలు. నెగిటివ్ గా జరిగినా విజయ్‌తో మైత్రి ప్రయాణం అక్కడితో ఆగలేదు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఖుషితో మళ్లీ ఇద్దరూ కలిసి పని చేశారు. విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఆ సినిమాను మైత్రి నిర్మించింది. ఒక పాత ప్రాజెక్ట్ ఆగిపోయిందనే కారణంతో విజయ్‌ను పక్కన పెట్టకుండా, కొత్త కథ కుదిరినప్పుడు మళ్లీ సినిమా చేశారు. నిర్మాత, హీరో మధ్య ఉన్న కంఫర్ట్ లేకపోతే ఇలా రెండోసారి కలిసి పని చేయడం అంత ఈజీ కాదు.
ఇప్పుడు అదే బంధం రణబలి వరకు వచ్చింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న ఈ సినిమాను కూడా మైత్రి నిర్మిస్తోంది. గత సినిమాలతో పోలిస్తే ఈసారి పెద్ద కాన్వాస్‌లో కథను ప్లాన్ చేస్తున్నారు. విజయ్ కెరీర్‌లో కూడా ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా మారింది. ఒకప్పుడు బైక్ రేసింగ్ కథ కోసం కలిసిన కాంబినేషన్ ఇప్పుడు పూర్తిగా వేరే ప్రపంచంలో సినిమా చేస్తోంది. సర్దార్ 2 ఈవెంట్‌లో హీరో సినిమాను నిర్మాత రవిశంకర్ మళ్లీ గుర్తు చేయడంతో ఆ సినిమా గురించి మళ్లీ రకరకాల గాసిప్స్ వస్తున్నాయి. విజయ్, దర్శకుడికి అభిప్రాయ బేధాలు వచ్చాయని కూడా టాక్స్ వస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని పెద్దది కాకుండానే సైలెంట్ గా ముగించేసింది.