పార్ట్ టైమ్ సేవింగ్స్.. రూ.100 కోట్ల సినిమా!

21 ఏళ్ల వయసులో మూడేళ్ల పాటు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి దాచుకున్న డబ్బంతా ఒక సినిమాపై పెట్టడం చిన్న నిర్ణయం కాదు.

Update: 2026-09-08 03:42 GMT

21 ఏళ్ల వయసులో మూడేళ్ల పాటు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి దాచుకున్న డబ్బంతా ఒక సినిమాపై పెట్టడం చిన్న నిర్ణయం కాదు. అనుప్రియా నాగర్ మాత్రం అదే చేసింది. యూకేలో చదువుకుంటూ సంపాదించిన తన సేవింగ్స్‌ను హనుమాన్ అంష్ కోసం పెట్టింది. సినిమా నిర్మాణంలో అనుప్రియతో పాటు మరికొందరు నిర్మాతలు కూడా ఉన్నారు. ఇప్పుడు రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇండియాలో రూ.100 కోట్ల మార్క్ దాటింది.

అసలు అనుప్రియకు సినిమా ఆలోచన కూడా విచిత్రంగానే వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు స్టీవ్ జాబ్స్‌పై ఒక అసైన్‌మెంట్ చేసింది. అప్పుడే ఆయనకు నీమ్ కరోలి బాబాతో ఉన్న ఆధ్యాత్మిక కనెక్షన్ గురించి తెలిసింది. అక్కడి నుంచి నీమ్ కరోలి బాబా గురించి చదవడం మొదలుపెట్టి, చివరకు అదే విషయాన్ని సినిమా వరకు తీసుకొచ్చింది.

చదువు పూర్తయ్యాక అనుప్రియకు జ్యూరిచ్‌లో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ 2025లో ఇండియాకు తిరిగొచ్చి హనుమాన్ అంష్ నిర్మాణంలో భాగమైంది. అప్పటివరకు ఆమెకు సినిమా నిర్మాణంలో అనుభవం లేదు. అయినా యూకేలో మూడేళ్లు పార్ట్ టైమ్ పనులు చేసి దాచుకున్న సేవింగ్స్ మొత్తం ఈ ప్రాజెక్ట్‌లో పెట్టినట్టు అనుప్రియ స్వయంగా చెప్పింది.

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా హనుమాన్ అంష్ తెరకెక్కింది. మొదట సినిమా ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. విడుదల తర్వాత ఒక దశలో స్క్రీన్స్ భారీగా తగ్గిపోయాయి. అక్కడి నుంచి మౌత్ టాక్ తో పరిస్థితి మారింది. మళ్లీ స్క్రీన్స్ పెరుగుతూ వెళ్లాయి. ఐదో వారానికి వచ్చేసరికి ఇండియా కలెక్షన్స్ రూ.100 కోట్లను దాటాయి. ప్రస్తుతం రూ.120 కోట్లకు పైగా నెట్ వచ్చినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

అనుప్రియ మాత్రం తనకు కలెక్షన్స్ కంటే నీమ్ కరోలి బాబా గురించి యువత తెలుసుకోవడమే ముఖ్యమని చెబుతోంది. విదేశీయుల ద్వారా ఆయన గురించి మొదట తెలుసుకోవాల్సి రావడం తనకు బాధగా అనిపించిందని కూడా చెప్పింది. అందుకే ముఖ్యంగా యువతకు ఆయన కథ చేరాలనే ఉద్దేశంతో సినిమా చేసినట్టు తెలిపింది.

హనుమాన్ అంష్‌కు ఇప్పుడు సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే మొదటి సినిమా హిట్ అయిందని ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచే ఆలోచనలో లేరట. రూ.2 కోట్లలో చేసిన మొదటి సినిమాలో ఉన్న సింప్లిసిటీ, రా ఫీల్ అలాగే ఉండాలని అనుప్రియ చెబుతోంది. మొదటి సినిమా చివర్లోనే రెండో భాగానికి హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు టీమ్ సిద్ధమవుతోంది.

Tags:    

Similar News