ట్రెండీ టాక్: స్టార్ల నోటి దురద ఫలితం- కోట్లాది రూపాయల మూల్యం!
సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల ఒక చిన్న వ్యాఖ్యతో లేదా వీడియాలో నెగెటివ్ పోస్ట్ తో ప్రఖ్యాత సంస్థల వ్యాపారాలను, వాటి బ్రాండ్ ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల ఒక చిన్న వ్యాఖ్యతో లేదా వీడియాలో నెగెటివ్ పోస్ట్ తో ప్రఖ్యాత సంస్థల వ్యాపారాలను, వాటి బ్రాండ్ ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఫలితంగా సంస్థలు సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సదరు స్టార్లపై కోట్లాది రూపాయల నష్టపరిహారం కోరుతూ రివర్స్‌లో డిఫమేషన్ కేసులు ఫైల్ చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహిపై ఒక ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీ కేసు నమోదు చేయగా.. గతంలోనూ పలువురు ప్రఖ్యాత సెలబ్రిటీలు బ్రాండ్లు.. వ్యాపార సంస్థల చేతిలో చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు.
నోరా ఫతేహి - ప్రయివేట్ ఏవియేషన్ కంపెనీ దావా:
బాలీవుడ్ నటి, డాన్సర్ నోరా ఫతేహి ఇటీవల ముంబై-జైపూర్ ప్రయాణంలో తాను ప్రయాణించిన చార్టర్డ్ విమానాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ఆ విమానాన్ని `టాయ్ కార్`, `లేగో ప్లేన్` (టాయ్ విమానం) అంటూ అభివర్ణిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్ట్ చేశారు. కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్న నోరా వ్యాఖ్యల వల్ల తమ కంపెనీ బుకింగ్స్ 15-20 శాతం పడిపోయాయని.. వ్యాపార ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిందని ఆరోపిస్తూ సదరు ఏవియేషన్ కంపెనీ గాంధీనగర్ కోర్టులో 3 కోట్ల సివిల్ డిఫమేషన్ దావా వేసింది. వీడియోలు వెంటనే డిలీట్ చేసి.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
కిమ్ కర్దాషియాన్ - ఫ్యాషన్ డిజైన్ కాపీరైట్ వివాదం:
అంతర్జాతీయ పాప్ ఐకాన్, రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియాన్ ఫ్యాషన్ బ్రాండ్ `మిస్‌గైడెడ్` తన అవుట్‌ఫిట్ డిజైన్లను కాపీ కొట్టి అమ్మేస్తోందని.. తన పేరును అక్రమంగా వాడుకుంటోందని సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, ఆపై కోర్టు వ్యాజ్యం తీవ్ర చర్చనీయాంశమైంది. కిమ్ వ్యాఖ్యలు తమ బ్రాండ్ వ్యాపారాన్ని దెబ్బతీశాయని సదరు బ్రాండ్ వాదించినా అంతిమంగా కోర్టు కిమ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి... సదరు ఫ్యాషన్ బ్రాండ్‌కు 2.7 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం విధించింది.
కాన్యే వెస్ట్- అడిడాస్ & క్రిస్టియన్ డియోర్ లీగల్ వివాదం:
హాలీవుడ్ ర్యాపర్ కాన్యే వెస్ట్ ప్రసిద్ధ బ్రాండ్ అడిడాస్.. ఇతర బ్రాండ్లను ఉద్దేశించి.. సంస్థల నిర్వహణపై బహిరంగంగా వివాదాస్పద , అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా అడిడాస్ కంపెనీ ఆయనతో ఉన్న బిలియన్ డాలర్ల స్నీకర్ డీల్‌ను రద్దు చేసుకోవడమే కాకుండా.. బ్రాండ్ ఇమేజ్‌కు చేకూర్చిన నష్టానికి భారీ స్థాయిలో చట్టపరమైన నష్టపరిహార ప్రక్రియను ప్రారంభించింది.
సెలబ్రిటీ ఎండోర్స్‌మెంట్లు - కాంపిటీషన్ కమిషన్ అండ్ బ్రాండ్ కేసులు:
భారతదేశంలోనూ పలువురు ప్రముఖ స్టార్లు (అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఎంఎస్ ధోని వంటి వారు) తాము ప్రచారం చేసిన ప్రాజెక్టులు లేదా బ్రాండ్లు ( రియల్ ఎస్టేట్, లెర్నింగ్ యాప్స్) విఫలమైనప్పుడు లేదా తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పుడు రివర్స్ విమర్శలు- బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతిన్నందుకు నష్టపరిహారం- చట్టపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు. బ్రాండ్ ఒప్పందాలను ఉల్లంఘించి ఇతర పోటీ సంస్థలను పొగడటం లేదా అసత్య ప్రచారాలు చేయడం వల్ల బ్రాండ్లు స్టార్లకు చట్టపరమైన నోటీసులు జారీ చేసిన సంఘటనలు ఉన్నాయి.
సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న స్టార్స్ చేసే వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలుగా మిగిలిపోకుండా.. కంపెనీల కోట్లాది రూపాయల వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్లు - ఏవియేషన్ కంపెనీలు సెలబ్రిటీల `నోటిదురద`ను చట్టపరంగా ఎదుర్కొంటూ భారీ డిఫమేషన్ కేసులతో బుద్ధి చెబుతున్నాయి. ముక్కు పిండి కోట్లాది రూపాయల నష్టపరిహారాన్ని గుంజుకుంటున్నాయి.