13 హ‌త్య‌ల‌తో లింకు.. స్టార్ హీరో లేడీ మేనేజ‌ర్ డెత్ కేసులో బిగ్ ట్విస్టు

ప్రముఖ హిందీ నటుడు..అత‌డి మాజీ లేడీ మేనేజర్ అనుమానాస్పద మృతి కేసు ఆరేళ్ల తర్వాత ఊహించని మలుపు తిరిగింది.

Update: 2026-09-08 03:41 GMT

ప్రముఖ హిందీ నటుడు..అత‌డి మాజీ లేడీ మేనేజర్ అనుమానాస్పద మృతి కేసు ఆరేళ్ల తర్వాత ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో తీగ లాగే కొద్దీ డొంక క‌దులుతోంది. సదరు హీరో లేడీ మేనేజర్ మరణంపై బొంబాయి హైకోర్టు ఇటీవల సీబీఐ (CBI) విచారణకు ఆదేశించడంతో ఈ కేసు మళ్లీ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ అధినేత ఆర్నాబ్ గోస్వామి సహా పలువురు లాయర్లు.. ప్రత్యక్ష సాక్షులు చేస్తున్న వ్యాఖ్యలు ఈ వ్యవహారంలో ఉన్న గూడుపుఠాణీని బయటపెడుతున్నాయి.

సదరు హీరో లేడీ మేనేజర్ ఎత్తైన భవంతి నుంచి కింద పడి మరణించిన తీరుపై ప్రారంభం నుంచీ తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆర్నాబ్ గోస్వామి ఈ కేసుపై స్పందిస్తూ బిల్డింగ్ పైనుంచి దూకినట్లయితే మృతదేహం భవనానికి 25 అడుగుల దూరంలో ఎలా పడుతుందని ప్రశ్నించారు. అంతేకాకుండా.. అప్పట్లో జరిగిన పోస్ట్ మార్టం, ఆటాప్సీ రిపోర్టులతో పాటు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణ అంతా అనుమానాస్పదంగానే సాగిందని మండిపడ్డారు. సదరు హీరో లేడీ మేనేజర్ ఆ ప్రముఖ హిందీ నటుడికి కొన్ని కీలక రహస్యాలు చెప్పిన తర్వాతే ఈ వరుస ఘటనలు జరిగాయని ఆరోపించారు.

మరోవైపు వివాదాస్పద మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే బృందం సదరు హీరో లేడీ మేనేజర్ కుటుంబ లాయర్‌ను సంప్రదించడం కేసులో అతిపెద్ద ట్విస్ట్‌గా మారింది. ఈ కేసులో తాను `అప్రూవర్`గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయ‌న‌ ప్రకటించడమే కాకుండా.. ఈ వ్యవహారంతో దాదాపు 13 హత్యలకు సంబంధం ఉందనే సంచలన విషయాన్ని బయటపెట్టేందుకు సిద్ధపడినట్లు లాయర్ తెలిపారు. లేడీ మేనేజర్ మరణించిన తర్వాత కూడా ఆమె ఫోన్‌ను ఉపయోగించి ఎవరు ఎవరితో మాట్లాడారో ట్రాక్ చేశారని... సాక్ష్యాలు చెప్పడానికి ముందుకు వచ్చిన ఐపీఎస్ అధికారులను అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ బెదిరించారని లాయర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇదే సమయంలో సదరు హీరో లేడీ మేనేజర్ తండ్రి మీడియా ముందుకు వచ్చి తన కుమార్తెది ఆత్మహత్య కాదని, అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు చేసిన కుట్ర అని ఆవేద‌న‌గా చెప్పారు. ఆ ప్రముఖ హిందీ నటుడి మరణానికి.. నా కుమార్తె మరణానికి 100 శాతం సంబంధం ఉంది... ఆ నటుడికి సంబంధించిన ఒక వీడియోను నా కుమార్తె పంపింది. అదే ఆమె ప్రాణాలమీదికి తెచ్చింది. పోలీసులు ఇన్నేళ్లుగా నిందితులను కాపాడేందుకే ప్రయత్నించారు. దీని వెనుక పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు! అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముంబై పోలీసులు ఇది ఆత్మహత్య అని తేల్చేసినా స‌ద‌రు లేడీ మేనేజ‌ర్ తండ్రి వేసిన పిటిషన్ ఆధారంగానే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

రాజకీయంగా కూడా ఈ వ్యవహారం ముంబై వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్ర‌ముఖ రాజ‌కీయ పార్టీ ఎమ్మెల్యే హస్తం ఉందంటూ పిటిషన్‌లో ఆరోపణలు రావడం, ఆయన ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించడం కూడా పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. ఏదేమైనా ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సీబీఐ రంగంలోకి దిగడం.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌తో 13 హత్యల లింకుపై ప్ర‌ముఖ పోలీస్ అధికారి అప్రూవర్‌గా మారతానని చెప్పడంతో ఆ ప్రముఖ హిందీ నటుడు- సదరు హీరో లేడీ మేనేజర్ మరణాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు త్వరలోనే వెలుగులోకి వస్తారని అభిమానులు, ప్రజలు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ కేసుపై విచార‌ణ కొనసాగుతోంది.

Tags:    

Similar News