న‌గ్నంగా చెట్టెక్కిన న‌టుడు.. కార‌ణం తెలిస్తే విస్తుపోవాల్సిందే!

హిమాలయాల్లో 14 రోజుల పాటు ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన ఈ ఫోటోలు, మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉండవచ్చో చూపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.;

Update: 2026-01-11 03:30 GMT

బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ అద్భుత న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇటు సౌత్ లోను భారీ ఫాలోయింగ్ ఉంది. అత‌డు ఇంత‌కుముందు ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన `తుపాకి` (తుప్పాకి-త‌మిళం) చిత్రంలో విల‌న్‌గా న‌టించాడు. ఎన్బీకే డాకుమ‌హారాజ్ చిత్రంలోను అత‌డు న‌టించాడు. విద్యుత్ ఇటీవ‌ల బాలీవుడ్ లో ప‌లు చిత్రాల‌లో హీరోగా నటించి వ‌రుస విజ‌యాల్ని అందుకున్నాడు.

ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ `డాకు మహారాజ్` విలన్‌గా అత‌డు మాస్ ఫ్యాన్స్ మ‌న‌సుల‌ను గెలుచుకున్నాడు.బాలయ్య మాస్ పవర్‌కు తోడు విద్యుత్ హై-వోల్టేజ్ యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందో ఆ సినిమాలో చూపించారు పూరి. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం విద్యుత్ ప్రత్యేకంగా కేరళ మార్షల్ ఆర్ట్స్ -కలరిపయట్టు లో త‌న నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు.

జ‌మ్వాల్ ఇప్ప‌టికే కలరిపయట్టు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన మార్షల్ ఆర్ట్ అయిన `కలరిపయట్టు`లో అత‌డి నైపుణ్యం, ప్ర‌కృతి జీవ‌నం పేరుతో అత‌డి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌ల గురించి అభిమానుల‌కు స్ప‌ష్ఠంగా తెలుసు. ఇప్పుడు అదే విధంగా ప్ర‌కృతి జీవ‌నంలో భాగంగా, విద్యుత్ జ‌మ్వాల్ న‌గ్నంగా చెట్టు ఎక్కాడు. ఏడాదికోసారి తాను స‌హ‌జంగా యోగాభ్యాసం ఇలా న‌గ్నంగా చేస్తాన‌ని, దానివ‌ల్ల మ‌న అంత‌రాత్మ ప్ర‌కృతిలో మ‌మేకం అవుతుంద‌ని తెలిపాడు.

గ‌తంలో ఓసారి విద్యుత్ ప్రకృతి ఒడిలో నగ్నంగా ఫోటో షూట్ లో పాల్గొన‌డం వివాదాస్ప‌ద‌మైంది. విద్యుత్ జమ్వాల్ తన 43వ పుట్టినరోజు (డిసెంబర్ 2023) సందర్భంగా హిమాలయాల్లోని అడవులు, మంచు పర్వతాల మధ్య న‌గ్న ఫోటోషూట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోషూట్ కేవలం షో కోసం కాద‌ని, ప్రకృతితో మమేకం అవ్వడం కోసం తీసినట్లు ఆయన పేర్కొన్నారు.

హిమాలయాల్లో 14 రోజుల పాటు ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన ఈ ఫోటోలు, మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉండవచ్చో చూపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫోటోలు అప్పట్లో ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. గ‌డ్డ‌క‌ట్టే మంచులో అత‌డి ధైర్యాన్ని, ఫిట్‌నెస్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా మార్షల్ ఆర్టిస్ట్ గా అత‌డి ఫిట్ బాడీ పైనా ప్రశంసలు కురిపించారు. గతంలో హాలీవుడ్ నటులు మాత్ర‌మే ఇలాంటి సాహసోపేతమైన ఫోటో షూట్లు చేసేవారు. ఇండియాలో విద్యుత్ మాత్ర‌మే అలా చేయ‌గ‌ల‌డు.

విద్యుత్ జమ్వాల్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్రపంచంలోని టాప్-10 మార్షల్ ఆర్టిస్టుల జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక భారతీయ నటుడు ఇలా అప్పుడ‌ప్పుడు న‌గ్నంగా క‌నిపించ‌డం చాలా మందిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కానీ అది అత‌డు ప్ర‌త్యేక సాధ‌న కోసం చేసే ప‌ని. అత‌డు చేసే స్టంట్స్ చాలా సహజంగా ఉంటాయి. తాళ్లు, గ్రాఫిక్స్ వాడకుండా ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలు చేయడం అత‌డి ప్రత్యేకత. కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నా చాలా నిరాడంబరంగా ఉండ‌టం కూడా విద్యుత్ ప్ర‌త్యేక‌త‌.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, విద్యుత్ త‌దుప‌రి కమెండో 4లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ప్ర‌స్తుతం ఫ్రాంఛైజీపై ప‌నులు వేగంగా పూర్త‌వుతున్నాయి. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించ‌నున్నారు. ఇందులో విద్యుత్ ఎటువంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయబోతున్నారని సమాచారం.

Tags:    

Similar News