దర్శక ధీరుడికి పునాది అలా పడింది

Update: 2015-07-13 16:23 GMT
రాజమౌళి.. ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంతా ఈ పేరే పలవరిస్తోంది. ఆ మాటకొస్తే అంతర్జాతీయ స్థాయిలోనే మనోడి గురించి చర్చ జరుగుతోంది. ఈ స్థాయి అతడికి ఊరికే వచ్చేయలేదు. దాని వెనుక ఎంత కష్టం ఉందో.. తొలి సినిమా నుంచి ఇక్కడిదాకా సాగిన అతడి ప్రయాణాన్ని చూస్తేనే అర్థమవుతుంది. సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ.. కొత్త విషయాలు నేర్చుకుంటూ.. బాహుబలి లాంటి విజువల్ వండర్ తీసే స్థాయికి ఎదిగాడు రాజమౌళి. ఐతే ఇంతకీ రాజమౌళి దర్శకుడు కావడానికి తొలి అడుగులు ఎలా పడ్డాయి? అతనెందుకు దర్శకుడిగా మారాడు? ఈ సంగతులు జక్కన్న మాటల్లోనే విందాం పదండి.

‘‘మా వదిన వల్లి మా ఇంట్లోకి వచ్చే వరకు ఆవారాగా తిరిగేవాణ్ని. కానీ నా మీద చూపించే ప్రేమ చూసి.. ఏదైనా చేయాలనిపించి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరి.. అక్కడ కొన్నాళ్లు పని చేశా. ఆ తర్వాత నాన్న సినిమాలకు సంబంధించి కథా చర్చల్లో పాల్గొనేవాణ్ని. అప్పుడు నా సలహాలు నచ్చి తన దగ్గరే అసిస్టెంటుగా పని చేయమన్నారు. అప్పట్నుంచి ఆరేళ్ల పాటు నాన్నకు నేనే అసిస్టెంటుని. రాఘవేంద్రరావు, గోపాల్ లాంటి దర్శకులకు నాన్న కథల్లోని సన్నివేశాల్ని నేనే వివరించే వాణ్ని. నేను చెప్పిన సన్నివేశాల్ని భారీగా ఊహించుకునేవాణ్ని. కానీ సినిమాలు పూర్తయ్యాక ప్రింట్ చూస్తే నిరాశ కలిగేది. ఆ సన్నివేశాలు నాకు నచ్చేవి కావు. మనకు నచ్చింది రావాలంటే మనమే దాన్ని తీయాలని అనుకున్నా. అందుకే దర్శకుడిగా మారాలనుకున్నా. రాఘవేంద్రరావుగారి దగ్గర నేను అసిస్టెంటుగా పని చేయలేదు కానీ.. ఆయన ప్రభుత్వం కోసం చేపట్టిన కొన్ని కార్యక్రమాలకు యాడ్ ఫిలిమ్స్ చేసిపెట్టాను. అప్పుడు నా టాలెంట్ గుర్తించి శాంతి నివాసం సీరియల్ చేసే అవకాశమిచ్చారు. ఆ తర్వాత దాని కోసం నేను పడ్డ కష్టం చూసి ‘స్టూడెంట్ నెంబర్‌వన్’కు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు’’ అంటూ తొలి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు రాజమౌళి.
Tags:    

Similar News