మాన‌వులు అంత‌మ‌య్యే డేట్ చెప్పిన పూరి జ‌గ‌న్నాథ్

అధికారం కోసం... మతాల కోసం మనుషులు చేసుకునే యుద్ధాలు.. చిందించే రక్తం ఎంత వ్యర్థమో ఈ విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది.;

Update: 2026-04-26 05:04 GMT

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తాజా పాడ్‌కాస్ట్‌లో భూమి భవిష్యత్తు.. మానవ ఉనికి... తాత్కాలిక స్వభావం గురించి అత్యంత లోతుగా విశ్లేషించారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం.. మరో ఒక బిలియన్ (వంద కోట్లు) ఏళ్ల తర్వాత ఈ భూమి ఎలా ఉండబోతుందో ఆయన వివరించిన తీరు ఆక‌ట్టుకుంది. పూరి మాటల్లోని ముఖ్యాంశాలు ఇవి..

విశ్వంలో మానవ ఉనికి ఎంత అల్పమైనదో.. మనం శాశ్వతం అని అనుకోవడం ఎంత పెద్ద భ్రమో దర్శకుడు పూరి జగన్నాథ్ తన తాజా పాడ్‌కాస్ట్‌లో అత్యంత ప్రభావవంతంగా వివరించారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం .. మరో వంద కోట్ల (ఒక బిలియన్) సంవత్సరాల తర్వాత భూమి ఎదుర్కోబోయే భయానక మార్పుల గురించి ఆయన మాట్లాడారు. సూర్యుడి ప్రకాశం పెరిగి.. ఉష్ణోగ్రతలు మితిమీరడం వల్ల సముద్రాలన్నీ ఆవిరైపోయి.. ఈ భూమి జీవం లేని ఒక ఎడారిలా మారిపోతుందని హెచ్చరించారు. ఆ సమయంలో మనం పీల్చే ఆక్సిజన్.. మనం చూసిన‌ పచ్చదనం ఏవీ మిగలవు.. కేవలం శూన్యం మాత్రమే రాజ్యమేలుతుంది.

మనం ఈనాడు ఎంతో గర్వంగా చెప్పుకునే మన సంస్కృతులు, మతాలు.. మనం నిర్మించుకున్న అద్భుత కట్టడాలు ఏవీ ఆ కాలప్రవాహంలో నిలవవని పూరి స్పష్టం చేశారు. మనం గొప్పగా భావించే మహానుభావుల విగ్రహాలు.. మనం ప్రాణప్రదంగా నమ్మే దేవుళ్లు.. గుళ్లు గోపురాలు అన్నీ బూడిదలో కలిసిపోతాయి. భవిష్యత్తులో ఎవరైనా వచ్చి ఈ భూమిని పరిశోధించినా.. ఇక్కడ ఒకప్పుడు మానవ జాతి జీవించిందని చెప్పడానికి కనీసం ఒక అస్థిపంజరం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. మానవ చరిత్ర మొత్తం ఒక కలలా కరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం కోసం... మతాల కోసం మనుషులు చేసుకునే యుద్ధాలు.. చిందించే రక్తం ఎంత వ్యర్థమో ఈ విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మనం ప్రాణం కంటే ఎక్కువగా భావించే నీతి.. నిజాయితీ.. కర్మ సిద్ధాంతం.. స్వర్గనరకాలు వంటి భావనలన్నీ ఆ మహా శూన్యంలో అర్థం లేని మాటలుగా మిగిలిపోతాయి. దేశాల సరిహద్దుల కోసం.. జెండాల కోసం మనం పడే తాపత్రయం.. ఒకరినొకరు చంపుకునే హింసా ప్రవృత్తి అన్నీ కాల గర్భంలో కలిసిపోతాయని పూరి చురకలు అంటించారు. ఏ సామ్రాజ్యం కూడా శాశ్వతం కాదని... ప్రకృతి ముందు అందరం సమానమేనని ఆయన గుర్తుచేశారు.

జీవ పరిణామ క్రమంలో ఏ జాతి అయినా కొన్ని మిలియన్ల ఏళ్లలో అంతరించిపోవాల్సిందేనని.. మానవ జాతి కూడా ఆ విధికి మినహాయింపు కాదని పూరి వివరించారు. ఈ భూమి ఎవరి సొంతం కాదని.. మనం ఇక్కడికి కేవలం అతిథులుగా వచ్చి వెళ్లే ప్రయాణికులం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఒక చిన్న విరామం కోసం ఈ భూమిపైకి వచ్చి.. మళ్లీ మనమంతా ఆ అనంతమైన శూన్యంలో కలిసిపోవాల్సిందే. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే మనిషిలో అనవసరమైన అహంకారం తగ్గి... తోటివారి విష‌యంలో కనికరం కలుగుతుందని పూరి అభిప్రాయపడ్డారు.

మొత్తానికి పూరి మ్యూజింగ్స్ మనల్ని లోతైన ఆలోచనలో పడేశాయి. ఒక బిలియన్ ఏళ్ల తర్వాత మన ధూళి కూడా మనల్ని గుర్తుంచుకోదు అనే చేదు నిజాన్ని ఆయన కళ్ళకు కట్టినట్లు త‌న మాట‌ల్లోనే చూపించారు. మనం ఈ క్షణంలో పడే ఆరాటం..అహంకారం.. విద్వేషాలు అన్నీ ఈ అనంత కాలచక్రంలో చాలా చిన్నవని.. ఉన్నంత కాలం అందరితో కలిసి మెలిసి ఉండటమే సరైన జీవన మార్గమని పూరిజ‌గ‌న్నాథ్ త‌న మ్యూజింగ్స్ లో వివ‌రించారు.

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో పూరి జ‌గ‌న్నాథ్ భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్` అనేది టైటిల్. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఆయన రగ్గడ్ లుక్ .. చేతిలో రక్తంతో ఉన్న కత్తి ఈ సినిమా ఇంటెన్సిటీని ఆవిష్క‌రించాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై, హైదరాబాద్ పరిసరాల్లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్ కీలక దశలో ఉంది. 2026 చివ‌రిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Full View
Tags:    

Similar News