చీటింగ్ ఆరోపణలు.. లీగల్ యాక్షన్ అంటూ అషురెడ్డి వార్నింగ్!

Update: 2026-04-26 03:38 GMT

సోషల్ మీడియా సెలబ్రిటీ ఆషు రెడ్డి పేరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. గత రాత్రి నుంచి ఆమెపై వస్తున్న కొన్ని ఆరోపణలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక ఎన్నారైని ఆమె మోసం చేసిందనే వార్త సోషల్ మీడియా  తో పాటు ప్రధాన మీడియా వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా తనపై వచ్చే విమర్శలపై స్పందించే ఆషు రెడ్డి, ఈసారి మాత్రం కాస్త గట్టిగానే బదులిచ్చారు. తన అనుమతి లేకుండా అసత్య వార్తలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె ఒక పోస్ట్ ద్వారా హెచ్చరించారు.

అసలు ఈ వివాదం ఎక్కడి నుంచి మొదలైందంటే.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ధర్మేంద్ర అనే వ్యక్తికి, ఆషు రెడ్డికి మధ్య పెళ్లి ప్రతిపాదన వచ్చినట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వివిధ సందర్భాల్లో ఆమె డబ్బు, ఇతర ఆస్తులు తీసుకుందని ఆ వ్యక్తి ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 9.35 కోట్ల రూపాయల విలువైన నగదు, బంగారం, కార్లు, ఫ్లాట్లు ఆమెకు ఇచ్చినట్లు సదరు వ్యక్తి పేర్కొంటున్నట్లు సమాచారం.

ఈ ఆరోపణల ప్రకారం.. ఆషు రెడ్డి తన భార్య అవుతుందని నమ్మిన ఆ ఎన్నారై, 2025 వరకు ఆమెకు ఆర్థికంగా అండగా ఉన్నారట. అయితే ఇటీవల ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ప్రస్తుతం ఆషు రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అందుబాటులో లేకుండా పోయారని ప్రచారం జరుగుతోంది. దీనిపై బాధితుడి తండ్రి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

ఇంతటి ఆరోపణలు వస్తున్నా, ఆషు రెడ్డి మాత్రం వీటిపై నేరుగా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక హెచ్చరికను మాత్రమే పోస్ట్ చేశారు. "నా అనుమతి లేకుండా నా గురించి తప్పుడు సమాచారం లేదా వార్తలు ప్రచారం చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఒక్క పోస్ట్ తప్ప, తనపై వస్తున్న ఆస్తుల బదిలీ లేదా చీటింగ్ కేసు ఆరోపణలపై ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ వ్యవహారంలో నిజమెంత ఉందనేది ఇంకా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇది కేవలం అసత్య ప్రచారమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

ఆషు రెడ్డి చేసిన ఈ లీగల్ వార్నింగ్ పోస్ట్ పై మీ స్పందన ఏంటి? ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో సోషల్ మీడియా ప్రచారం ఎంతవరకు సరైనదని మీరు భావిస్తున్నారు?



Tags:    

Similar News