టాప్ స్టోరి: మెగా ఎడ్యుకేషనల్ వార్

Update: 2019-05-13 06:40 GMT
తెలుగు రాష్ట్రాల్లో మెగా ఎడ్యుకేషనల్ వార్ జరగనుందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. విద్యా రంగంలోకి సినీగ్లామర్ ప్రవేశం తొలి నుంచి ఉన్నా.. ఇప్పుడు అంతకంతకు ఈ రంగంలోకి గ్లామర్ వెల్లువ పెరుగుతోందని అర్థమవుతోంది. ఇప్పటికే ఈ రంగంలో పలువురు సినీప్రముఖులు ఉన్నారు. పలువురు దర్శకనిర్మాతలు స్కూల్స్ .. కాలేజీలు స్థాపించి సక్సెస్ అయినవాళ్లు ఉన్నారు. సినీపరిశ్రమలో ఉన్నది ఉన్నత విద్యావంతులే కాబట్టి ఏదో ఒక కోణంలో విద్యా రంగంలో ఉన్నవాళ్లు తరచుగా ఇక్కడ తారస పడుతుంటారు. ఓవైపు స్కూల్స్ .. కాలేజీల్లో పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూనే నటించేందుకు వచ్చేవాళ్లు ఉన్నారు. అలాగే ఓవైపు స్కూల్స్ నడుపుతూ నటనలో లేదా సినిమాలు తీస్తూనే గడిపేసేవాళ్లు ఉన్నారు. గ్లామర్ రంగంపై కేవలం  ఏ ఒక్క రంగానికో కాదు అన్ని రంగాల ప్రముఖులకు ఆసక్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది చాలా కామన్ విషయమే.

చాలాకాలంగా మంచు కుటుంబం విద్యారంగంలో ఉంది. శ్రీ విద్యానికేతన్ పేరుతో తిరుపతిలో స్కూల్స్ .. కాలేజీలు.. వగైరా వగైరా విజయవంతంగా రన్ చేస్తూ ఉంది ఈ ఫ్యామిలీ. ఇటీవలే ఏపీ ప్రభుత్వంపై స్కాలర్ షిప్ ల విషయమై శ్రీ విద్యానికేతన్ అధినేత మోహన్ బాబు సాగించిన పోరాటం తెలిసినదే. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా టెక్నో స్కూల్స్ అభివృద్ధి కోసం విష్ణు చాలానే కృషి చేయడంపై వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఇప్పుడు అత్యంత కీలకమైన విద్యా రంగంలోకి మెగా ఫ్యామిలీ ఎంటర్ అవ్వడం సరికొత్త పోటీకి తెరలేపనుందని అర్థమవుతోంది. ఎడ్యుకేషన్ రంగంలో ప్రవేశిస్తూ అంతర్జాతీయ స్థాయిలో స్కూల్స్.. కాలేజ్ ల నిర్వహణకు మెగా కుటుంబం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ స్కూల్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకి ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని మెగా ఇంటర్నేషనల్ స్కూల్స్ సీఈవో జె శ్రీనివాసరావు తెలిపారు. చిరంజీవి అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో అశేషంగా ఉన్న మెగా ఫ్యాన్స్ పిల్లల్ని చిరంజీవి స్కూల్స్ లోనే చదివించేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే బెటర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే అక్కడికే పేరెంట్ ప్రాధాన్యత ఇవ్వడం సహజం. అయితే కాలక్రమంలో మెగా స్కూల్స్ నిలదొక్కుకునేందుకు అన్ని రకాలా కొణిదెల కాంపౌండ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. మెగాస్టార్ ఇప్పటికే బ్లడ్ బ్యాంక్.. ఐ బ్యాంక్ నిర్వహణతో సామాజిక సేవలో ఉన్నారు. అయితే ప్రస్తుతం విద్యా రంగం కూడా సేవతో కూడుకున్నది. ఆ దిశగానే మెగా కాంపౌండ్ ఆలోచిస్తోందా? అన్నది మునుముందు తెలుస్తుంది. పలు కార్పొరెట్ కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో విద్యను వ్యాపారంగా మార్చి డబ్బు దండుకుంటున్నాయి. అదే ఫార్ములాతో మెగా ఎడ్యుకేషనల్ సంస్థలు కొనసాగుతాయా.. లేక సేవా ధృక్పథం తో కొనసాగుతాయా? అన్నది వేచి చూడాలి.
    

Tags:    

Similar News