దర్శకుడి విమర్శలకు యంగ్‌ హీరో కౌంటర్‌

బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఉన్న స్టార్స్‌లో చాలా మంది స్టార్‌ కిడ్స్ అనే విషయం తెలిసిందే.;

Update: 2025-10-16 17:30 GMT

బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఉన్న స్టార్స్‌లో చాలా మంది స్టార్‌ కిడ్స్ అనే విషయం తెలిసిందే. అయితే స్టార్‌ కిడ్స్ అయినంత మాత్రాన బాలీవుడ్‌లో సూపర్‌ స్టార్స్ అయిపోరు అనేది చాలా మంది అభిప్రాయం. కానీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి స్టార్‌ కిడ్స్ హోదా ఉపయోగపడుతుంది. ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌ సైతం నెపోటిజం గురించి మాట్లాడుతూ స్టార్‌ కిడ్స్ అయినంత మాత్రాన ఇండస్ట్రీలో స్టార్‌డం దక్కుతుంది అనుకోవడానికి లేదు. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడుగు పెట్టి కష్టపడుతారో అప్పుడే ఖచ్చితంగా స్టార్‌డం దక్కుతుందని, ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో ఆఫర్లు వచ్చినంత మాత్రాన, అక్కడ సెటిల్‌ అయిపోవచ్చు అనుకోవద్దని కొందరు అంటున్నారు. తాజాగా యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌ పై దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ నెపోటిజం విమర్శలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి.

విక్కీ కౌశల్‌ హీరోగా నటించిన ఛావా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం విక్కీ కౌశల్‌ తన స్నేహితుడు వినీత్‌ కుమార్‌ను తీసుకోవాలని సూచించాడు. ఆ పాత్ర సినిమాకు చాలా కీలకం. అలాంటి పాత్రలకు స్నేహితులను సన్నిహితులను తీసుకోవడం అనేది ఎంత వరకు కరెక్ట్‌ అన్నట్లుగా అనురాగ్‌ కశ్యప్‌ ప్రశ్నించాడు. నాకు అతడితో పెద్దగా పరిచయం లేదు, అతడి ఎంపిక విషయంలో కారణాలు ఉండవచ్చు, కానీ నెపోటిజంను అనుమతించే విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని అనురాగ్‌ కశ్యప్‌ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్‌లో కేవలం డబ్బు సంపాదన మాత్రమే లక్ష్యంగా ఉండటం వల్లే తాను ముంబై విడిచి వెళ్లి పోయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో విక్కీ కౌశల్‌ స్పందించాడు.

ఇటీవల ఒక కార్యక్రమంలో విక్కీ కౌశల్‌ ఈ విషయమై స్పందిస్తూ... తాను ఎంపిక చేసుకున్న విషయాన్ని గురించి కొందరు విమర్శించడంను పట్టించుకోను, అయితే డబ్బు కోసం అన్నట్లుగా కాకుండా తాను ఎంపిక చేసుకున్న రంగంలో అత్యున్నత స్థానంలో నిలవడం కోసం కష్టపడుతాను. ఇండస్ట్రీకి వచ్చాం ఏదో అలా ఉండి పోదాం అనుకునే మనస్థత్వం నాది కాదు. ఇండస్ట్రీలో లెజెండ్స్‌గా పిలువబడుతున్న వారికి ఏమాత్రం తగ్గకుండా నేను పేరు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను. డబ్బు తో పాటు పేరు ప్రతిష్టలు కూడా చాలా ముఖ్యం అని విక్కీ కౌశల్‌ చెప్పుకొచ్చాడు. కెరీర్‌ మొదట్లో అనురాగ్‌ కశ్యప్‌ వద్ద విక్కీ కౌశల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాడు. పారితోషికం గురించి ఎక్కువగా ఆలోచించకుండా కేవలం మంచి పేరు తెచ్చి పెట్టే పాత్రలను చేయాలని కోరుకుంటాను అని విక్కీ కౌశల్‌ చెప్పుకొచ్చాడు.

డబ్బు, నెపోటిజం గురించి అనురాగ్‌ కశ్యప్‌ చేసిన వ్యాఖ్యలపై విక్కీ కౌశల్‌ సీరియస్‌గా కాకుండా తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. తన గురువు అయినప్పటికీ విక్కీ కౌశల్‌ ఈ విషయంలో తన అభిప్రాయంను క్లీయర్‌గా చెప్పడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం వీరిద్దరి గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. విక్కీ కౌశల్‌ ప్రస్తుతం కెరీర్‌ పరంగా దూకుడు మీద ఉన్నాడు. ముఖ్యంగా ఈయన ఛావా సినిమాతో బాలీవుడ్‌లో టాప్‌ స్టార్స్ సరసన నిలిచాడు. మరిన్ని సినిమాలను చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలని ఆశ పడుతున్న విక్కీ కౌశల్‌ విభిన్న కథలను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. పారితోషికం పట్టింపు లేకుండా విక్కీ కౌశల్‌ సినిమాలు చేస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News