చాలా గ్యాప్ తర్వాత.. RGV శిష్యుడిపై ఫోకస్
ఇప్పుడు అదే లైన్‌లో వేణుగోపాల్ రెడ్డి వస్తున్నాడు. ఇంజినీరింగ్ తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక కథ రాసిన అతనికి అదే ఆర్జీవీ దగ్గరకు వెళ్లే దారి అయ్యింది.
రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసి దర్శకులుగా మారిన వాళ్ల లిస్ట్ పెద్దదే. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ లాంటి వాళ్లు అక్కడి నుంచి వచ్చి తమకంటూ పెద్ద కెరీర్ నిర్మించుకున్నారు. ‘శివ’ సమయంలో కృష్ణవంశీ, శివ నాగేశ్వరరావు, తేజ తన టీమ్‌లో ఉన్నారు. ఒక దశలో ఆర్జీవీ దగ్గర పనిచేశాడంటే కొత్త దర్శకుడిపై స్పెషల్ ఫోకస్ పడేది. తర్వాత కూడా ఆ లైన్ పూర్తిగా ఆగలేదు.
కానీ మొదటి తరం నుంచి వచ్చినంత పెద్ద పేర్లు ఆ తరువాత కనిపించలేదు. ఈ మధ్య కాలంలో అజయ్ భూపతి మాత్రం ‘ఆర్ఎక్స్ 100’తో గట్టిగా పేరు తెచ్చుకున్నాడు. అతను ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’, ‘అటాక్’ సమయంలో ఆర్జీవీ టీమ్‌లో పనిచేశాడు. ఆ తర్వాత కూడా దర్శకులు వస్తూనే ఉన్నా, ఆర్జీవీ శిష్యుడు అనే ట్యాగ్‌తో వెంటనే పెద్ద స్థాయికి వెళ్లిన సందర్భాలు తగ్గాయి.
ఇప్పుడు అదే లైన్‌లో వేణుగోపాల్ రెడ్డి వస్తున్నాడు. ఇంజినీరింగ్ తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక కథ రాసిన అతనికి అదే ఆర్జీవీ దగ్గరకు వెళ్లే దారి అయ్యింది. ముంబై వెళ్లి దాదాపు ఆరేళ్లు ఆయనతో పని చేశాడు. ‘రక్త చరిత్ర’, ‘దొంగల ముఠా’ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్‌లో ఉన్నాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘రోమాంచకం’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇక్కడ చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఆర్జీవీ దగ్గరకు తీసుకెళ్లింది ఫ్యాక్షన్ కథ. పని చేసిన సినిమాల్లో కూడా ‘రక్త చరిత్ర’లాంటి హార్డ్ కంటెంట్ ఉంది. కానీ తన మొదటి సినిమాగా వేణు తీసుకొస్తున్నది మాత్రం యూత్ లవ్ కామెడీ డ్రామా. కాలేజ్ పూర్తయ్యాక యువతలో వచ్చే మార్పులు, ప్రేమ, రిలేషన్‌షిప్స్ చుట్టూ కథ నడుస్తుందని అతను చెప్పాడు. అంటే గురువు సినిమాల టోన్‌ను పట్టుకుని వెళ్లకుండా తనకు నచ్చిన జోన్‌లో మొదలు పెడుతున్నాడు.
‘రోమాంచకం’లో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నాడు. సుమంత్‌తో నెలల పాటు రిహార్సల్స్ చేయించినట్లు టీమ్ చెప్పింది. కొత్త దర్శకుడి సినిమా అయినా షూటింగ్ పూర్తయ్యాకే డైరెక్ట్ ప్రమోషన్స్ తో మీడియా ముందుకు తీసుకొచ్చారు. దీంతో వేణు మొదటి సినిమా వెనక మంచి ప్రిపరేషన్ జరిగినట్లు కనిపిస్తోంది.
వేణుకు ఆర్జీవీ దగ్గర దొరికింది షూటింగ్ అనుభవం ఒక్కటే కాదు. ‘దొంగల ముఠా’లాంటి సినిమాను తక్కువ క్రూతో, కొన్ని రోజుల్లో ఎలా పూర్తి చేశారో దగ్గరుండి చూశాడు. ఎడిటింగ్ సమయంలో సీన్ ఉంటుందా పోతుందా అనే విషయాలపై కూడా వర్మతో మాట్లాడేవాడినని చెప్పాడు. ఇప్పుడు ఆ అనుభవం మొత్తం యాక్షన్ సినిమాలో కాకుండా లవ్ కామెడీకి ఉపయోగపడబోతోంది. ఇక సెప్టెంబర్ 3న రానున్న ‘రోమాంచకం’ అతనికి ఎలాంటి క్రేజ్ నీ ఇస్తుందో చూడాలి.