త్రివిక్రమ్ వెంకీ 'ఆదర్శ కుటుంబం'.. AK 47 ట్విస్ట్!
గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ రోజు సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.;
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ రోజు సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలు. అప్పట్లో త్రివిక్రమ్ రచయితగా అందించిన ఆ కామెడీ పంచ్ లు ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో వెంకీ సాలిడ్ హిట్ అందుకున్నారు. ఆ జోష్ లోనే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలుపెట్టడంతో, మరోసారి ఆ మ్యాజిక్ స్క్రీన్ మీద రిపీట్ అవుతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే, ఈ సినిమాకు "ఆదర్శ కుటుంబం" అనే టైటిల్ ను ఖరారు చేశారు. వినడానికి ఇది చాలా సాఫ్ట్ గా, పద్ధతిగా అనిపిస్తున్నా, దీనికి "హౌస్ నెం. 47, AK 47" అనే ట్యాగ్ లైన్ తగిలించి త్రివిక్రమ్ తన మార్క్ చూపించారు. పైకి కుటుంబ కథా చిత్రంగా కనిపిస్తున్నా, లోపల ఏదో బలమైన యాక్షన్ పాయింట్ లేదా గన్ లాంటి పేలే కామెడీ ఉండే అవకాశం ఉందని ఈ వెరైటీ టైటిల్ చూస్తుంటే అర్థమవుతోంది.
విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో వెంకటేష్ చాలా కూల్ గా, క్లాసీగా కనిపిస్తున్నారు. చేతిలో ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని, కళ్లద్దాలతో ఆకాశం వైపు చూస్తూ నవ్వుతున్న ఆ లుక్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ రోజు నుంచే షూటింగ్ కూడా మొదలైందని మేకర్స్ స్పష్టం చేశారు. పోస్టర్ లోని ఆ ప్రశాంతత, టైటిల్ లోని ఆ వైవిధ్యం చూస్తుంటే, ఇది కేవలం రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా కాదనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2026 సమ్మర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్ తో షూటింగ్ షెడ్యూల్స్ వేసుకుంటున్నారు.
వెంకీ 77వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. త్రివిక్రమ్ పెన్ పవర్, వెంకటేష్ టైమింగ్ కలిస్తే వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ 'ఆదర్శ కుటుంబం' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సౌండ్ చేస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే.