అనిల్ టైటిల్ తోనే షురూ చేసేలా ఉన్నాడే!

టాలీవుడ్‌లో టైటిల్ అనేది కేవలం సినిమా పేరు మాత్రమే కాదు, సినిమా మీద తొలి అంచనాలను సృష్టించే ప‌వ‌ర్‌ఫుల్ వెప‌న్ కూడా.

Update: 2026-06-17 10:30 GMT

టాలీవుడ్‌లో టైటిల్ అనేది కేవలం సినిమా పేరు మాత్రమే కాదు, సినిమా మీద తొలి అంచనాలను సృష్టించే ప‌వ‌ర్‌ఫుల్ వెప‌న్ కూడా. ముఖ్యంగా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే, ఆయన సినిమాల టైటిల్స్ మొదటి నుంచే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా మల్టీస్టారర్‌కు సంబంధించిన టైటిల్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా, సినిమాకు జనవరి 13 విడుదల అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్ వినగానే ఆసక్తి కలిగించేలా ఉండటమే కాకుండా, సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసిన కథకు కూడా బాగా సూట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, 2027 సంక్రాంతి సందర్భంగా అదే రోజున సినిమాను విడుదల చేసే ఆలోచన కూడా మేకర్స్ వద్ద ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

అనిల్ రావిపూడి గత సినిమాల‌ను పరిశీలిస్తే, కథకు తగ్గట్టే కాకుండా ఆడియ‌న్స్ కు వెంటనే గుర్తుండిపోయే టైటిల్స్‌ను ఎంచుకోవడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 13 విడుదల అనే టైటిల్ నిజంగానే ఫైనల్ అయితే, అది సినిమాకు విడుదలకు ముందే మంచి పబ్లిసిటీ తీసుకురావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావా బామ్మర్దులుగా కనిపించనున్నారని సమాచారం. ఇద్దరి మధ్య జరిగే సరదా సంఘటనలు, కౌంటర్లు, కుటుంబ నేపథ్యంలో వ‌చ్చే ఎంట‌ర్టైనింగ్ సీన్స్ సినిమాకు మెయిన్ ఎట్రాక్ష‌న్ గా నిలవనున్నాయని అంటున్నారు. వెంకటేశ్‌కు ఉన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇమేజ్, కళ్యాణ్ రామ్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందించనున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. హీరోయిన్లుగా కీర్తి సురేశ్, కృతి శెట్టి నటిస్తున్నట్లు సమాచారం. సంగీత బాధ్యతలను జి.వి. ప్రకాశ్ కుమార్ నిర్వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వ‌ర్క్స్ పూర్తి కావడంతో షూటింగ్ వేగంగా పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి తీసుకురావాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.

ఇటీవల భారీ విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి మరోసారి మ‌రోసారి తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ కామెడీ జానర్‌నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే జనవరి 13 విడుదల అనే టైటిల్ నిజంగానే ఫిక్సైందా? లేక ఇది కేవలం ప్రచారమేనా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News