సినిమా మీద నమ్మకముంటే మార్కెట్ గురించి పట్టించుకోను

తాజాగా తుపాకీతో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల నుంచి ప్రొడక్షన్ అనుభవాల వరకు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

Update: 2026-09-25 08:15 GMT


Full View


ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత చైతన్య రెడ్డి.. భర్త నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మాణ రంగంలో కీలకంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సుదీప్ తో బిల్లా రంగా భాషా, సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో సంబరాల ఏటి గట్టు వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె.. తాజాగా తుపాకీతో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల నుంచి ప్రొడక్షన్ అనుభవాల వరకు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. 2026లో వరుసగా మంచి సినిమాలు వస్తుండటంతో ఆడియ‌న్స్ తో పాటు తాము కూడా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. ఒకేసారి రెండు భారీ సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ త‌మ‌కు ఎలాంటి ప్రెజ‌ర్ లేదని, హీరోలిద్దరూ స్టార్ స్టేట‌స్ ఉన్న‌ప్ప‌టికీ ప్రొడక్షన్‌కు ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు.

బిల్లా రంగా భాషా విషయానికి వస్తే.. ఈ ప్రాజెక్ట్ తమ వద్దకు రాకముందే అనూప్ పలువురితో చర్చలు జరిపారని, చివరకు అది తమ దగ్గరికి వచ్చి ఆగిందని చైతన్య రెడ్డి వెల్లడించారు. సుదీప్ సినిమాల ఎంపిక తనకు చాలా భిన్నంగా అనిపిస్తుందని, ఈ సినిమాలోని ఫ్యూచరిస్టిక్ ఫాంటసీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. తాను ఫాంటసీ, మైథలాజికల్ సినిమాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతానని, ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్ ఉంటాయని తెలిపారు. స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు ప్రొడక్షన్‌పై కంట్రోల్ మారుతుందనే మాటలు వినిపిస్తుంటాయని, అయితే తనకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పారు. హీరోలు షూటింగ్ టైమ్ కు ముందే సెట్స్‌కు వచ్చి మంచి వాతావరణం క్రియేట్ చేస్తారని పేర్కొన్నారు.

సంబరాల ఏటి గట్టు రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేద‌ని జనవరి 12న సినిమాను విడుదల చేయడం ఖాయమని చైత‌న్య రెడ్డి తెలిపారు. సాయి ధరమ్ తేజ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కాకుండా కథను నమ్మి పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. హను మాన్ సినిమా విషయంలోనూ ఇదే విధానాన్ని పాటించామని, స్క్రీన్‌పై గ్రాండ్‌గా కనిపించాలనే ఉద్దేశంతో కాకుండా కథకు ఏది అవసరమో దానికే ఖర్చు చేశామని వివరించారు. ఈ సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్ వర్క్ అని, ఒక కథను గొప్పగా తెరపై చెప్పాలంటే సమయం పడుతుందని అన్నారు. బాహుబలి టైమ్ లోనూ ఇలాంటి డిస్క‌ష‌న్స్ జరిగాయని, ఇప్పుడు వారణాసి విషయంలోనూ బయట ఓటీటీ బిజినెస్ అవ‌డం లేద‌ని, ఏదేదో మాట్లాడుకుంటున్నార‌ని, కానీ వాస్త‌వ‌మేంట‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌ద‌ని ఆమె అన్నారు.

ప్రస్తుతం ఓటీటీ ప్రభావం నిర్మాతలపై ఎక్కువగా ఉందని చైతన్య రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓటీటీ డీల్స్, టైమ్‌లైన్స్ కారణంగా నిర్మాతలకు ఇది కఠినమైన పరిస్థితిగా మారిందని, కొన్నిసార్లు క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా ప్రభావితమవుతోందని చెప్పారు. పెద్ద సినిమాల షూటింగ్‌లో వందలాది మంది పనిచేస్తారని, ఒక్క వ్యక్తి అందుబాటులో లేకపోయినా మొత్తం షెడ్యూల్ ప్రభావితం అవుతుందని వివరించారు. వైరల్ ఫీవర్స్ నుంచి సమ్మెల వరకు అనేక కారణాలతో షూటింగ్స్ వాయిదా పడే పరిస్థితులు ఉంటాయని, ముందే ఫిక్స్ చేసిన టైమ్‌లైన్స్ వల్ల నిర్మాతలు నష్టపోతున్న సందర్భాలున్నాయని తెలిపారు.

హనుమాన్ తర్వాత వచ్చిన డార్లింగ్ సినిమా గురించి కూడా చైతన్య రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్ పరంగా సినిమా బాగున్నప్పటికీ రన్‌టైమ్ విషయంలో పొరపాటు జరిగిందని ఆమె భావించారు. సినిమా 2 గంటల 40 నిమిషాల నిడివితో ఉండాల్సిన కథ కాదని, రన్‌టైమ్ విషయంలో డైరెక్ట‌ర్ చాలా పట్టుదలగా ఉండటంతో తాము కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గామని చెప్పారు. అయితే ఓటీటీలో సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో తమకు కమర్షియల్‌గా కూడా వర్కవుట్ అయిందని తెలిపారు.

నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్‌లోకి రావడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించారు. కొత్త నిర్మాతలకు తమ సినిమాలను రిలీజ్ చేయించుకోవడం చాలా కష్టమని, ప్రారంభ దశలో తాము కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. హనుమాన్ రిలీజ్ టైమ్ లో నైజాంలో కొందరు డిస్ట్రిబ్యూటర్లు రూ.2 కోట్లు, రూ.3 కోట్లు ఇస్తామని చెప్పార‌ని, దీంతో తామే సొంతంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అప్పటికే వైజాగ్, గుంటూరు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నామని, పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేశామని వెల్లడించారు. కొత్త నిర్మాతలకు సరైన డిస్ట్రిబ్యూటర్లు దొరకక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కొన్ని చిన్న సినిమాలకు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నామని చెప్పారు.

జై హనుమాన్ గురించి మాట్లాడుతూ.. దాన్ని కేవలం హనుమాన్ సీక్వెల్‌గా చూడకూడదని చైతన్య రెడ్డి అన్నారు. ఈ రెండు సినిమాల మధ్య తేడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్‌తో తన అనుబంధం గురించి చెబుతూ.. ఆయన బయట కనిపించే దానికంటే సెట్స్‌లో మరింత క్లోజ్‌గా, కేరింగ్‌గా ఉంటారని తెలిపారు. రాత్రివేళ సెట్స్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు తన గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తారని, ఏదైనా పని ఉంటే తానే చేస్తానంటూ తనకు సపోర్ట్ చేస్తారని చెప్పారు. నిరంజన్ రెడ్డికి కూడా సాయి ధరమ్ తేజ్ ఎంతో సహకరిస్తారని, ఏ విషయాన్నీ తొందరగా డిసైడ్ అవొద్ద‌ని, అందరం కలిసి ఆలోచించి ముందుకు వెళ్దామని చెబుతుంటారని తెలిపారు.

తాను కేవలం బడ్జెట్ పెట్టి సినిమాను ఇతరుల చేతుల్లో పెట్టే నిర్మాతను కాదని చైతన్య రెడ్డి చెప్పారు. ప్రతీ విషయంలో దగ్గరుండి చూసుకునే వ్యక్తినని, పని లేకుండా కూర్చుంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. హనుమాన్ తో తక్కువ బడ్జెట్‌లోనే భారీ ఔట్‌పుట్ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లోనూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదని తెలిపారు. హనుమాన్ కు నేచురల్ లొకేషన్స్ ప్లస్ అయితే, ప్రస్తుత సినిమాల‌కు వరల్డ్ బిల్డింగ్ కోసం ఎక్కువ సమయం పడుతోందని వివరించారు.

ఇక ఇటీవల తనను ఆకట్టుకున్న సినిమాల గురించి మాట్లాడుతూ డీసీ సినిమా టెక్నికల్‌గా బాగా నచ్చిందని చెప్పారు. కథ, కథాంశం కంటే ఆ సినిమా టెక్నికల్ ట్రీట్‌మెంట్ తన మైండ్‌లో ఎక్కువకాలం నిలిచిపోయిందన్నారు. అలాగే ఇరుముడి, శంకరవ‌రప్రసాద్ సినిమాలు కూడా తనకు బాగా నచ్చాయని పేర్కొన్నారు. నిర్మాణం, ఓటీటీ, డిస్ట్రిబ్యూషన్ ఇలా సినిమా రంగంలోని విభిన్న విభాగాల్లో కొనసాగుతున్నప్పటికీ.. చివరకు తనకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చేది మాత్రం ఒక మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమేనని చైతన్య రెడ్డి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News