వరుణ్ ధావన్ 'కల్కి 2898 ఏడి' లాంటి సినిమా?
దర్శకుడు నాగ్ అశ్విన్ `కల్కి 2898 ఏడి` చిత్రంలో పురాణాలను, భవిష్యత్తు సాంకేతికతను ముడిపెడుతూ మూడు విభిన్నమైన ప్రపంచాలను అద్భుతంగా ఆవిష్కరించారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ `కల్కి 2898 ఏడి` చిత్రంలో పురాణాలను, భవిష్యత్తు సాంకేతికతను ముడిపెడుతూ మూడు విభిన్నమైన ప్రపంచాలను అద్భుతంగా ఆవిష్కరించారు. మొదటిది కాశీ -కలియుగం అంతానికి చేరుకున్న వేళ ప్రకృతి అంతరించి, వనరుల కోసం జనం అలమటించే భూమిపై చివరి నగరం. దీనికి పూర్తి భిన్నంగా ఆకాశంలో తలకిందుల పిరమిడ్ ఆకారంలో తేలియాడే `కాంప్లెక్స్` అనే మరో విలాసవంతమైన ప్రపంచాన్ని సృష్టించారు. సమస్త వనరులు, సంపదలు కలిగిన ఈ నగరంలో కేవలం సమాజంలోని పాలకులే జీవిస్తుంటారు. ఇక మూడవది `శంబల`- కాంప్లెక్స్ పాలకుల అరాచకాలను ఎదిరించే తిరుగుబాటుదారులకు, శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే ఒక రహస్య హిమాలయ లోయ. ఈ మూడు భిన్న వాతావరణాలు, సంస్కృతులు కలిగిన నగరాలను ఆయన కథాంశంలో ఎంతో చాకచక్యంగా కనెక్ట్ చేశారు.
ఈ మూడు విభిన్న ప్రపంచాలను దర్శకుడు `ప్రాజెక్ట్ కె` అనే ఒక రహస్య ప్రయోగం ..సుమతి (దీపికా పదుకొనే) గర్భంలో పెరుగుతున్న శిశువు చుట్టూ అల్లిన కథతో అనుసంధానించారు. కాంప్లెక్స్ ల్యాబ్ నుండి తప్పించుకుని శంబల వైపు ప్రయాణించే సుమతి.. ఆమెను రక్షించడానికి మహాభారత కాలం నుండి వేచి ఉన్న అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్), కాశీలో ఉంటూ కేవలం కాంప్లెక్స్ లోకి అడుగుపెట్టడమే లక్ష్యంగా బౌంటీలు వేటాడే భైరవ (ప్రభాస్) పాత్రల ద్వారా ఈ నగరాల మధ్య లంకెను కుదిర్చారు. టెక్నాలజీ పరంగా, జీవన విధానం పరంగా ఎక్కడా పొంతన లేని ఈ మూడు భిన్న లోకాలను కలియుగాంతంలో ధర్మ స్థాపన కోసం సాగే ఒకే పోరాటంలో భాగం చేసి నాగ్ అశ్విన్ భారతీయ వెండితెరపై ఒక అపూర్వమైన సినిమాటిక్ యూనివర్స్‌ను ఆవిష్కరించారు.
ఇది హాలీవుడ్ లో వచ్చిన `అవెంజర్స్` ప్రపంచాలను లేదా బ్లాక్ పాంథర్ ప్రపంచాల స్ఫూర్తి నుంచి పుట్టిన భారతీయ నేటివిటీ కథగానే చూడాలి. అందుకే ఇప్పుడు వరుణ్ ధావన్ చేస్తున్న హాలీవుడ్ ప్రయత్నం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతడు కూడా విభిన్న ప్రపంచాల కలయికతో రన్ అయ్యే ఒక కొత్త ప్రపంచంలో నివశించే యువకుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హాలీవుడ్ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...
వరుణ్ ధావన్ హాలీవుడ్ ఎంట్రీ- సరికొత్త సినిమాటిక్ ప్రపంచంలోకి
బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ కెరీర్ సరికొత్త మలుపు తిరగబోతోంది. ఒకవైపు తన తండ్రి, ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో `హై జవానీ తో ఇష్క్ హోనా హై` రిలీజ్ ప్రచారంలో ఉన్న ధావన్ మరోవైపు భారీ హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత లారెన్స్ కసనాఫ్ నిర్మించనున్న ఒక అంతర్జాతీయ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం సంప్రదింపులు ముగిసాయని సమాచారం. పింక్‌విల్లా కథనం ప్రకారం.. గత కొన్ని వారాలుగా వరుణ్ ధావన్ - లారెన్స్ కసనాఫ్ బృందం మధ్య ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు నిరంతరాయంగా సాగుతూ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గనుక అధికారికంగా ఖరారైతే.. వరుణ్ ధావన్ గ్లోబల్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
ఇది భారతీయ వెండితెరపై సంచలనం సృష్టించిన `కల్కి 2898 ఏడి` తరహాలోనే సరికొత్త మల్టీ-వర్స్ లేదా విభిన్న ప్రపంచాల నేపథ్యంలో సాగే `మినీ అవెంజర్స్` తరహా ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇది `ఇంటర్-పారలల్ యూనివర్శ్ యాక్షన్` (సమాంతర విశ్వాల నేపథ్యంలో సాగే యాక్షన్) జోనర్‌లో తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు నాగ్ అశ్విన్ `కల్కి` చిత్రంలో కాశీ, కాంప్లెక్స్, శంబల వంటి విభిన్న లోకాలను సృష్టించి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లుగానే ఈ హాలీవుడ్ చిత్రం కూడా పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇవ్వబోతోంది. ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఇలాంటి విభిన్నమైన, క్లిష్ఠమైన జోనర్‌ను పెద్దగా ప్రయత్నించలేదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే వరుణ్ ధావన్ మునుపెన్నడూ చూడని సరికొత్త హై-టెక్నిక్ యాక్షన్ అవతారంలో గ్లోబల్ ఆడియన్స్‌ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.