ఐదేళ్లు లేట్‌... ఎంట్రీకి సిద్దమైన మిస్ యూనివర్స్‌

అందాల పోటీల్లో పాల్గొన్న ముద్దుగుమ్మల్లో ఎక్కువ శాతం మంది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం మనం చూస్తూ ఉంటాం.;

Update: 2025-10-27 08:53 GMT

అందాల పోటీల్లో పాల్గొన్న ముద్దుగుమ్మల్లో ఎక్కువ శాతం మంది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్‌ వరకు వెళ్లిన ముద్దుగుమ్మలు ఎక్కువ శాతం ఆఫర్లు దక్కించుకుంటూ ఉంటారు. మిస్‌ ఇండియా, మిస్ యూనివర్స్ టైటిల్స్ గెలిచిన ముద్దుగుమ్మలు మాత్రమే కాకుండా ఫైనల్‌ వరకు వెళ్లిన మోడల్స్ కూడా ఇండస్ట్రీలో రాణించిన దాఖలాలు ఉన్నాయి, ఇప్పటికీ రాణిస్తున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే మాజీ మిస్‌ యూనివర్స్ ఇండియా వర్తిక సింగ్ మాత్రం ఇండస్ట్రీకి ఇన్నాళ్లు దూరంగా ఉంటూ వచ్చింది. 2019లో మిస్ యూనివర్స్ ఇండియా గా వర్తిక సింగ్ నిలిచింది. మిస్ యూనివర్స్ 2019 లో టాప్‌ 20 లో నిలిచిన వర్తిక సింగ్‌ మోడల్‌గా ఆ సమయంలో మంచి గుర్తింపు దక్కించుకుంది. కానీ నటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వలేదు.

మిస్ యూనివర్స్ ఇండియా వర్తిక సింగ్‌...

2019లో మిస్ యూనివర్స్ ఇండియాగా నిలిచిన వర్తిక సింగ్‌ లక్ కలిసి రాకపోవడంతో 2020లో కరోనా వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమెకు చిన్నా చితక ఆఫర్స్ తలుపు తట్టిన పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఇప్పుడు వర్తిక సింగ్‌ సినిమాల్లో ఎంట్రీకి సిద్ధం అయింది. మూడు పదుల వయసు దాటిన తర్వాత వర్తిక ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీకి రెడీ అయింది. 32 ఏళ్ల వయసులో వర్తిక సింగ్‌ తన మొదటి బాలీవుడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇమ్రాన్‌ హష్మీ, యామి గౌతమ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన కోర్ట్‌ డ్రామా మూవీ 'హక్‌' లో వర్తిక సింగ్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతుందట. ఈ పాత్రతో బాలీవుడ్‌లో వర్తిక బిజీ అవుతుందని అంటున్నారు. హీరోయిన్‌గా కాకుండా ముందు ముందు బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ నటిగా వర్తిక సింగ్‌ నిలుస్తుందనే విశ్వాసంను హక్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌ 'హక్‌' మూవీలో వర్తిక సింగ్‌

సుపర్ణ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన హక్‌ సినిమాను నవంబర్‌ 7, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. టీజర్‌తో సినిమా కోర్ట్‌ రూం డ్రామా అనే విషయంను క్లారిటీ ఇచ్చారు. ఇమ్రాన్‌ హష్మీ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. యామి గౌతమ్‌ కోర్ట్‌లో న్యాయం కోసం పోరాటం చేసే మహిళ పాత్రలో కనిపించబోతుంది. మొత్తానికి ఈ సినిమాపై ఆసక్తి హిందీ ప్రేక్షకుల్లో పెరిగే విధంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో వర్తిక సింగ్‌ సైతం ఉందంటూ అధికారికంగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో మరింతగా అంచనాలు పెరిగాయంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. వర్తిక సింగ్‌ ఎంట్రీకి సంబంధించి ఎలాంటి హడావిడి లేదు, ఆమె హీరోయిన్‌గా నటించాల్సిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌లో ముందు ముందు...

సాధారణంగా మిస్‌ యూనివర్స్‌ ఇండియా గా నిలిచిన సమయంలోనే వర్తిక సింగ్‌ సినిమాల్లో గట్టిగా ప్రయత్నాలు చేసి ఉంటే, వచ్చిన సినిమా ఆఫర్లను సద్వినియోగం చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు వర్తిక సింగ్‌ బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియాలోనూ మంచి గుర్తింపు దక్కి ఉండేది. కానీ దాదాపు ఐదేళ్ల ఆలస్యంగా వర్తిక సింగ్‌ సినిమాల్లో అడుగు పెట్టడం వల్ల ఆమె ఏ మేరకు ఫలితాన్ని పొందుతుంది అనేది చూడాలి. సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వర్తిక సింగ్‌కి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆమె హీరోయిన్‌గా నటించాలని చాలా మంది కోరుతూ వస్తున్నారు. ఇప్పటికి అయినా వర్తిక ఎంట్రీ కి సిద్ధం అయింది కనుక ముందు ముందు అయినా ఆమె హీరోయిన్‌గా బిజీ అవుతుందేమో చూడాలి. వర్తిక సింగ్‌ బాలీవుడ్‌లో ప్రస్తుతానికి హక్‌ సినిమాలో మాత్రమే చేసింది. ఒకటి రెండు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి సినిమా ఏంటి అనేది హక్‌ విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News