జనాలను భయపెడుతున్న జక్కన్న!
రాజమౌళి సినిమా దగ్గర టికెట్ రేట్ల రచ్చ ఇప్పటిది కాదు. ‘బాహుబలి 2’ సమయంలోనే ధరలు హాట్ టాపిక్ అయ్యాయి.
‘వారణాసి’ రిలీజ్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ అప్పుడే టికెట్ రేట్ల గురించి ప్రేక్షకుల్లో టెన్షన్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులకే రూ.300 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు మాట్లాడుకుంటున్నారనే టాక్ రావడంతో సోషల్ మీడియాలో కామెంట్స్ పెరిగాయి. “ఈసారి టికెట్ వెయ్యి రూపాయలు చేస్తారా?” అని కొందరు సరదాగా అడుగుతుంటే, ఇంకొందరు మాత్రం జక్కన్న సినిమా కాబట్టి ఆ రేంజ్‌కు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.
రాజమౌళి సినిమా దగ్గర టికెట్ రేట్ల రచ్చ ఇప్పటిది కాదు. ‘బాహుబలి 2’ సమయంలోనే ధరలు హాట్ టాపిక్ అయ్యాయి. అప్పట్లో కొన్ని థియేటర్లలో రూ.90 టికెట్ రూ.150కి వెళ్లింది. రూ.200 టికెట్ రూ.300 వరకు పెరిగింది. అదనపు షోలు కూడా పడ్డాయి. ఆ తర్వాత పెద్ద సినిమాలకు మొదటి వారం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు అడగడం తెలుగు రాష్ట్రాల్లో కామన్ అయిపోయింది.
‘వారణాసి’ దగ్గరకు వచ్చేసరికి బిజినెస్ లెక్కలు ఇంకా పెద్దగా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కావడంతో తెలుగు మార్కెట్ నుంచే భారీ మొత్తం ఆశిస్తున్నారు. సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. మేకర్స్ మాత్రం బడ్జెట్‌పై ఇప్పటివరకు అధికారికంగా ఏ నంబర్ చెప్పలేదు. కానీ షూటింగ్ కోసం వేస్తున్న సెట్లు, యాక్షన్ ఎపిసోడ్స్, విదేశీ షెడ్యూల్స్ చూస్తే ఖర్చు భారీగానే ఉందని అర్థమవుతోంది.
అందుకే ఎక్కువ టికెట్ రేట్లను సమర్థించే వాళ్లు కూడా ఉన్నారు. రాజమౌళి సినిమా అంటే పెద్ద తెరపై చూడాల్సిందే, ఇంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు మొదటి వారం కొంచెం ఎక్కువ ధర పెట్టడంలో తప్పేముందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఆయన సినిమాకు మొదటి రోజు టికెట్ ఎంతైనా పెట్టే ఫ్యాన్స్ కూడా ఉంటారు.
కానీ ఫ్యాన్స్ లెక్క ఒకటి, ఫ్యామిలీ ఆడియన్స్ లెక్క ఇంకోటి. ఒక్క టికెట్ రూ.500 దాటితే నలుగురు సినిమా చూడటానికే రెండు వేల రూపాయలకు పైగా అవుతుంది. దానికి ఫుడ్ ఖర్చులు అదనం. పెద్ద ఓపెనింగ్ కోసం మొదటి రోజు రేట్లు పెంచినా, సినిమా ఎక్కువ రోజులు ఆడాలంటే సాధారణ ప్రేక్షకుడు కూడా థియేటర్‌కు రావాలి.
అయితే నిజంగా ఎంత రేటు పెంచుతారు, ఎన్ని రోజులు ప్రత్యేక ధరలు ఉంటాయి అన్నది రిలీజ్ టైమ్ లోనే తేలుతుంది. మేకర్స్ ఒక్కరే రేట్లు ఫిక్స్ చేయలేరు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి కూడా అవసరం. అయితే హక్కుల ధరలే ఇప్పుడే ఇలా భయపెడుతుంటే, రిలీజ్ టైమ్‌లో టికెట్ రేట్లపై హడావుడి మాత్రం గట్టిగానే ఉండొచ్చు.