గ్లోబల్ అడ్వెంచర్ లో ఆరు పాటలంటే..
'వారణాసి' ప్రాజెక్ట్ ఒక భారీ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
'వారణాసి' ప్రాజెక్ట్ ఒక భారీ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కేల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గతంలోనే కన్ఫర్మ్ చేశారు. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అన్ని పాటలు ఉండటం సినీ లవర్స్ ను ఆలోచనలో పడేసింది.
సాధారణంగా హాలీవుడ్ తరహా భారీ అడ్వెంచర్ సినిమాల్లో పాటలకు అస్సలు చోటు ఉండదు. కానీ రాజమౌళి మాత్రం తన గ్లోబల్ ప్రాజెక్ట్‌లోనూ ఇండియన్ సినిమా అసలైన మ్యూజికల్ ఫ్లేవర్‌ను వదిలిపెట్టే ఆలోచన చేయడం లేదు. ఆయన సినిమాల్లో పాటలంటే కేవలం హీరో హీరోయిన్ల రొటీన్ డ్యూయెట్స్ మాత్రమే కావు. కథలోని మూడ్‌ను, ప్రధాన పాత్రల లోతైన ఎమోషన్లను ముందుకు నడిపించే ఒక బలమైన ఆయుధంగానే సంగీతాన్ని ఎక్కువగా వాడుతుంటారు.
గతంలో 'మగధీర' చూసినా ఇదే విధానం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో 'అనగనగా' పాట రెగ్యులర్ మాస్ నెంబర్‌లా కాకుండా కథలోని రొమాంటిక్ ఫీల్‌ను బ్యాక్‌గ్రౌండ్ మాంటేజ్‌ల ద్వారా చాలా నేచురల్‌గా ముందుకు తీసుకెళ్తుంది. ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమాలోనూ 'నాటు నాటు', 'కొమురం భీముడో' లాంటి పాటలు నేరుగా కథలోని ఎమోషన్లలో భాగంగానే వస్తాయి. ప్రధాన కథ ముగిసిన తర్వాత కూడా ఎండ్ క్రెడిట్స్‌లో 'ఎత్తర జెండా'తో ఒక సెలబ్రేషన్ మూడ్‌ను చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశారు.
ఇప్పుడు 'వారణాసి' నుంచి వచ్చిన 'సంచారి' పాట కూడా అలాంటి కొత్త ఆలోచనతోనే వచ్చింది. అది మహేష్ బాబు క్యారెక్టర్ జర్నీని, ఆ పాత్రలోని అడ్వెంచర్ స్వభావాన్ని ఆడియన్స్‌కు పరిచయం చేసే ఒక ప్రమోషనల్ థీమ్ సాంగ్‌గా బయటకు వచ్చింది. కథకు అవసరమైన వైబ్‌ను క్రియేట్ చేయడంలో రాజమౌళి మ్యూజిక్‌ను ఎంత పక్కాగా వాడుకుంటాడో ఈ సాంగ్ మరోసారి రుజువు చేసింది.
గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నప్పుడు కథ వేగం కోసం పాటలను బాగా తగ్గించాలనే ఆలోచన చాలామంది మేకర్స్‌కు వస్తుంది. కానీ రాజమౌళి మాత్రం మన ఇండియన్ సినిమా బలమైన మ్యూజికల్ స్టోరీటెల్లింగ్‌నే తన గ్లోబల్ అడ్వెంచర్‌కు ఆయుధంగా మలుచుకుంటున్నారు. టేకింగ్ పరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తూనే, మన నేటివిటీని ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటున్నారు. అందుకే 'వారణాసి'లోని ఆ ఆరు ట్రాక్స్ స్క్రీన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు కథకు ఎలాంటి అడ్డంకి కలగకుండా ప్రతి పాటను రాజమౌళి తన కథలో ఎలా ప్లేస్ చేస్తాడో చూడాలి.