ప్లాన్ చేస్తే పాత్ బ్రేకింగ్ సినిమాలు రావు

ఈ సందర్భంగా గతంలో వచ్చిన పలు మైలురాయి సినిమాల‌ను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.

Update: 2026-06-16 12:51 GMT

సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తాయి. అవి రిలీజైన తర్వాత ఆ తరహా కథలు, పాత్రలు, మేకింగ్ స్టైల్స్‌ను అనుసరించే ప్రయత్నాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే అలాంటి సినిమాల స‌క్సెస్ ను కేవలం ఫార్ములాగా మార్చి మళ్లీ మళ్లీ రిపీట్ చేయడం సాధ్యం కాదని ప్రముఖ నటుడు వడ్డే నవీన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తన కొత్త సినిమా ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన, ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ఇండస్ట్రీలో మార్పులు, ట్రెండ్‌లు, పాత్ బ్రేకింగ్ సినిమాల ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు స్పందించిన వడ్డే నవీన్, సినిమా రంగం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని, కానీ ప్రతి సినిమా తనదైన సమయంలో తనదైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. ఒక సినిమా భారీ విజయాన్ని సాధించిందని అందరూ అదే తరహాలో సినిమాలు తీయాలనుకుంటే అది పని చేయదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా గతంలో వచ్చిన పలు మైలురాయి సినిమాల‌ను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. ఒకప్పుడు శివ సినిమా రిలీజైన తర్వాత తెలుగు సినిమా శివ ముందు, శివ తర్వాత అనే చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఆ సినిమా కొత్త దారిని చూపించినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ ప్రేక్షకులు ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు వంటి కమర్షియల్ సినిమాల‌ను కూడా ఆదరించారని చెప్పారు. అంటే ప్రేక్షకుల అభిరుచి ఒకే రకంగా ఉండదని, కాలానికి అనుగుణంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఇటీవల అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలు పెద్ద డిస్క‌ష‌న్‌కు కారణమయ్యాయని పేర్కొన్న వడ్డే నవీన్, అలాంటి సినిమాలు సహజంగా పుడతాయని కానీ వాటిని కూర్చొని ప్లాన్ చేసి తయారు చేయలేమని అన్నారు. ఒక ప్రత్యేక కథ, ప్రత్యేక పాత్ర, సరైన సమయం, డైరెక్ట‌ర్ విజన్, ప్రేక్షకుల మూడ్ అన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే అలాంటి సినిమాలు రూపొందుతాయని వివరించారు.

స‌క్సెస్‌ఫుల్ సినిమాల ప్రభావంతో మొత్తం పరిశ్రమ ఒకే దిశలో వెళ్లాలని ప్రయత్నిస్తే వైవిధ్యం తగ్గిపోతుందని కూడా ఆయన సూచించారు. ప్రతి డైరెక్ట‌ర్ తనకు నమ్మకం ఉన్న కథను చెప్పాలని, ప్రతి సినిమా తన ప్రత్యేకతతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చెప్పారు. కేవలం ఒక హిట్ ఫార్ములాను అనుసరించడం ద్వారా మరో అర్జున్ రెడ్డి లేదా మరో యానిమల్ సృష్టించడం సాధ్యం కాదని ఆయ‌న చెప్పారు. వడ్డే నవీన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో కొనసాగుతున్న ట్రెండ్ వర్సెస్ ఒరిజినాలిటీ చర్చకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆడియ‌న్స్ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని, అందుకే నిజమైన పాత్ బ్రేకింగ్ సినిమాలు ముందుగా ప్లాన్ చేసినవి కాకుండా సహజంగా పుట్టుకొస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News