కార్తీ 'అన్నగారు వస్తారు' .. ఆ సమస్యే మళ్లీ..
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ వా వాతియార్ (అన్నగారు వస్తారు). నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన సినిమా.. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.;
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ వా వాతియార్ (అన్నగారు వస్తారు). నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన సినిమా.. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల విడుదల అవ్వలేదు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతుందని కొన్ని రోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. ప్రమోషన్స్ కూడా నిర్వహించారు.
కానీ బాలయ్య అఖండ 2 తాండవం మూవీ అదే డేట్ కు ముందు షెడ్యూల్ అవ్వడంతో అన్నగారు వస్తారు మేకర్స్ తమ సినిమాను వాయిదా వేశారు. ఆ తర్వాత డిసెంబర్ 12వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ ను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే అఖండ 2 నిర్మాణ సంస్థకు తలెత్తిన సమస్య లాంటిదే ఇప్పుడు అన్నగారు వస్తారు నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కు కూడా వచ్చింది. నిజానికి అన్నగారు వస్తారు మూవీని నిర్మించిన స్టూడియో గ్రీన్ బ్యానర్ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. బిజినెస్ మ్యాన్ అర్జున్ లాల్ వద్ద రూ.10.35 కోట్ల రుణం తీసుకున్నారు. కానీ ఇంకా తిరిగి చెల్లించలేదు.
ఇప్పుడు వడ్డీతో కలిసి రుణం రూ.21.78 కోట్లు అయింది. దీంతో మొత్తం డబ్బులు చెల్లించేలా ఆదేశాలివ్వాలని రీసెంట్ గా అర్జున్ లాల్.. మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వడ్డీతో సహా చెల్లించే వరకు అన్నగారు వస్తారు సినిమా విడుదలపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు.. నేడు విచారణ జరిపింది.
న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎం. సుబ్రహ్మణ్యం, జస్టిస్ కుమారప్పతో కూడిన ధర్మాసనం.. అర్జున్ లాల్ పిటిషన్ ను విచారించింది. అన్నగారు వస్తారు మూవీ రిలీజ్ పై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటికే కోర్టు అనేక సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ జ్ఞానవేల్ రాజా అప్పు తిరిగి ఇవ్వలేదని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు.
ఆయన ఆస్తులు జప్తు చేయాలని కోరారు. దీంతో మద్రాసు హైకోర్టు.. జ్ఞానవేల్ రాజాకు ఇప్పటికే అనేక సార్లు అవకాశం ఇచ్చామని తెలిపింది. మళ్లీ అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. అందుకే అప్పు తిరిగి చెల్లించే వరకు సినిమాను విడుదల చేయకూడదని నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అదే సమయంలో స్టూడియో గ్రీన్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయింది. త్వరలోనే విడుదల అంటూ పోస్టు పెట్టింది. మరి అన్నగారు వస్తారు మూవీ.. ఎప్పుడు వస్తుందో చూడాలి.