క్రేజీ ప్రొడక్షన్ హౌస్ భవితవ్యం తేల్చేది ఆ రెండే?
బ్యాక్ టు బ్యాక్ క్రేజీ చిత్రాలని అందించిన ప్రొడక్షన్ హౌస్‌లు అప్పుడప్పుడు తడబాటుకు గురవుతూ తమ ట్రాక్ రికార్డ్‌ని కోల్పోతుంటాయి.;
బ్యాక్ టు బ్యాక్ క్రేజీ చిత్రాలని అందించిన ప్రొడక్షన్ హౌస్‌లు అప్పుడప్పుడు తడబాటుకు గురవుతూ తమ ట్రాక్ రికార్డ్‌ని కోల్పోతుంటాయి. అయితే చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని తమ సంస్థ పేరుకు తగ్గ చిత్రాలని అందించనప్పుడే పేయిన క్రెడిబిలిటీని తిరిగి పొందగలుగుతాయి. ఇప్పుడు ఇలాంటి చర్చనే ప్రముఖ ప్రొడక్షన్ కంపనీ యువీ క్రియేషన్స్‌పై జరుగుతోంది. ప్రభాస్ సహాకారంతో చిన్న సినిమాతో మొదలైన ఈ సంస్థ ప్రయాణం ప్రామిసింగ్ సినిమాలతో అభిరుచి గల సంస్థగా పేరు తెచ్చుకుంది.
ప్రభాస్ - కొరటాల శివల కాంబినేషన్‌లో రూపొందిన `మిర్చి`తో మొదలు పెట్టిన ఈ సంస్థ ప్రయాణం శర్వానంద్, `రన్ రాజా రాన్`,`భలే భలే మగాడివోయ్`, మహానుభావుడు, ఎక్స్‌ప్రెస్ రాజా, భాగమతి, 2019లో వచ్చిన ప్రభాస్ మూవీ `సాహో` వరకు సాఫీగానే సాగింది. జీఏ2తో కలిసి గోపీచంద్‌తో చేసిన `పక్కా కమర్షియల్`తో గాడి తప్పింది. అదే ఏడాది ప్రభాస్‌తో చేసిన `రాధేశ్యామ్`తో మరింతగా దారితప్పి భారీ నష్టాల్లోకి వెళ్లిపోయింది.
కరోనా నేపథ్యంలో సాహసోపేతంగా ఇటీలీ షెడ్యూల్‌ని సైతం పూర్తి చేసి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేసిన ఈ సినిమా వంద కోట్లకు మించి నష్టాలని తెచ్చి పెట్టింది. ప్రొడక్షన్ కంపనీకున్న క్రెడిబిలిటీకి పెద్ద సవాల్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత యువీ చాలా వరకు సైలెంట్ అయిపోయింది. క్రేజీ సినిమాలు, కథాబలమున్న, మంచి మేకింగ్ మూవీస్‌కి ఒక దశలో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని, భారీ నిర్మాణ సంస్థగా నిలబడుతుందని అంతా భావించారు. కానీ `రాధేశ్యామ్`తో ఒక్కసారిగా పరిస్థితి అంతా తారుమారైపోయింది.
మళ్లీ ఇన్నాళ్ల విరామం తరువాత ఈ సంస్థకు మళ్లీ జోష్‌ని తీసుకొచ్చిన మూవీ `బైకర్`. శర్వానంద్ హీరోగా, డా. రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన ఈమూవీ రీసెంట్‌గా విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకుని సూపర్ హిట్ అనిపించుకుంది. దీంతో యువీకి పూర్వవైభవం వచ్చేస్తోందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. యువీ సినిమా అంటే భారీ మేకింగ్ విలువలతో పాటు ఎమోషన్స్‌కి, కంటెంట్‌కు ప్రాధాన్యత నిస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించి సంస్థకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
దీంతో అందరి దృష్టి రెండు సినిమాలపై పడింది. అవే విశ్వంభర, కొరియన్ కనకరాజు. ఈ రెండు సినిమాలని యువీనే నిర్మిస్తోంది. ఇందులో మెగాస్టార్ హీరోగా రూపొందుతున్న `విశ్వంభర` గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సోషియో ఫాంటసీ డ్రామా. గ్రాఫిక్స్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో దీనికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. అది ఎప్పుడు పూర్తవుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఇక మరొకటి `కొరియన్ కనకరాజు`. వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలనుకుంటున్నాడు. ఈ రెండు సినిమాల ఫలితం, పైనే యువీ భవితవ్యం ఆధారపడి ఉందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.