సాయి వ్రతం పూర్తి చేసిన ఉపాసన.. 945 మందికి ఫుడ్ పంపిణీ
ఆ సమయంలో తన అనుభవం గురించి చెప్పారు. సాయిబాబా వ్రతాన్ని చేపట్టడం భక్తి, క్రమశిక్షణ, స్వస్థతతో నిండి ఉందని తెలిపారు.;
స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ గా ఉన్న ఆమె.. అత్తమ్మాస్ కిచెన్ బిజినెస్ కూడా నడుపుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు వివిధ రకాల పోస్టులు పెడుతూనే ఉంటారు.
అయితే ఉపాసన కొణిదెలకు షిర్డీ సాయిబాబా అంటే అమితమైన భక్తి, ప్రగాఢ నమ్మకం ఉందన్న సంగతి విదితమే. ఇప్పటికే ఆ విషయాన్ని పలుమార్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం.. గురు పూర్ణిమ నాడు నవ గురువార సాయిబాబా వ్రతాన్ని తాను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేవునితో అనుసంధానం కావడానికి అదొక మంచి మార్గమని చెప్పారు.
ఇప్పుడు ఉపాసన తొమ్మిది వారాల పాటు సాయినాధుని వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఇన్ స్టాగ్రామ్ లో స్పెషల్ గురు పూర్ణిమ నాడు మొదలు పెట్టిన సాయిబాబా వ్రతాన్ని తాను సెప్టెంబర్ 4వ తేదీతో ముగించినట్లు తెలిపారు. అంతేకాదు చివరి వారం పూజ వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఆ సమయంలో తన అనుభవం గురించి చెప్పారు. సాయిబాబా వ్రతాన్ని చేపట్టడం భక్తి, క్రమశిక్షణ, స్వస్థతతో నిండి ఉందని తెలిపారు. బాబా తనకు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చారని, అందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని అని పేర్కొన్నారు. వ్రతం పూర్తైనందుకు గుర్తుగా, అత్తమ్మాస్ కిచెన్ ద్వారా సేవా కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.
అతమ్మాస్ కిచెన్ ద్వారా ఎన్ని క్యూరెటెడ్ కిట్స్ ను సేల్ చేశారో.. అన్ని ఫుడ్ ప్యాకెట్స్ ను ప్రత్యేకంగా పంచిపెట్టారు. మొత్తానికి 105 కిట్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో 945 భోజనాల ప్యాక్ లు తయారు చేసి పంపిణీ చేశారు. వాటి ద్వారా సాంప్రదాయ పొంగల్, కేసరిని అందించారు. తద్వారా ఉపాసన హృదయపూర్వక విశ్వాసం, సేవ ప్రతిధ్వనిస్తుంది.
అయితే తన జీవితంలో ఓసారి క్లిష్ట పరిస్థితుల్లో చాలా భయపడినట్లు కొన్ని రోజుల క్రితం తెలిపారు. అప్పుడు సాయిబాబా వ్రతం గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సాయిబాబా వ్రతాన్ని మొదలుపెట్టాలని సూచించారు. పెట్టుకున్న విశ్వాసం మనల్ని కాపాడుతుందని చెప్పారు. ఇప్పుడు నవ గురువార వ్రతం పూర్తి చేసిన ఆమె.. త్వరలో షిర్డీ వెళ్లి సాయి బాబాను దర్శించుకోనున్నారు.