పెళ్లి 20లోనే చేసుకోవాలని ఉపాసనకు కౌంటర్
తన అభిప్రాయం ఆరోగ్యకరమైన చర్చకు దారి తీసిందని చెప్పిన ఉపాసన కొణిదెల, ఎగ్ ఫ్రీజింగ్ విషయంలో తన ఎంపికలు ప్రత్యేక హక్కులు కాదని, వ్యక్తిగత నమ్మకంతో సాగాయని చెప్పారు.;
ఐఐటి-హైదరాబాద్ విద్యార్థులతో చర్చా సమావేశంలో స్టార్ హీరో రామ్ చరణ్ భార్య, అపోలో హెల్త్ సంస్థానాధిపతి ఉపాసన కొణిదెల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కెరీర్ కోసం పెళ్లిని ఆలస్యం చేస్తే కచ్ఛితంగా స్త్రీలు తమ అండాన్ని(గుడ్లు) ఫ్రీజ్ చేయించాలని ఉపాసన ఈ సమావేశంలో సూచించారు. దీనిపై నెటిజనుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదురైంది.
తన అభిప్రాయం ఆరోగ్యకరమైన చర్చకు దారి తీసిందని చెప్పిన ఉపాసన కొణిదెల, ఎగ్ ఫ్రీజింగ్ విషయంలో తన ఎంపికలు ప్రత్యేక హక్కులు కాదని, వ్యక్తిగత నమ్మకంతో సాగాయని చెప్పారు. అయితే ఒక స్త్రీ సామాజిక ఒత్తిడికి లొంగిపోకుండా ప్రేమ కోసం వివాహం చేసుకోవడం తప్పా? సరైన భాగస్వామిని కనుగొనే వరకు ఆమె వేచి ఉండటం తప్పా? ఒక స్త్రీ తనకు ఉన్న పరిస్థితుల ఆధారంగా పిల్లలను కనాలనుకున్నప్పుడు మాత్రమే కంటే తప్పా? ఒక స్త్రీ తన లక్ష్యాలను నిర్దేశించుకుని, వివాహం గురించి లేదా చిన్న వయస్సులోనే పిల్లలను కనడం గురించి మాత్రమే ఆలోచించడం కంటే తన కెరీర్‌పై దృష్టి పెట్టడం తప్పా? అంటూ ప్రశ్నల్ని సంధించారు.
అంతేకాదు ఉపాసన తన పెళ్లి సమయం గురించి తప్పుడు సమాచారాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసారు. తాను 27 ఏళ్ల వయసులో రామ్ చరణ్‌ను వివాహం చేసుకున్నానని, 29 ఏళ్ల వయసులో అండాలు స్తంభింపజేసానని, 36 ఏళ్ల వయసులో తన మొదటి బిడ్డను స్వాగతించానని, ఇప్పుడు 39 ఏళ్ల వయసులో కవలలను ఆశిస్తున్నానని కూడా చెప్పారు. ప్రేమ, సహవాసం కోసం వివాహం చేసుకున్నాను. కొన్ని సమస్యల కారణంగా అండాన్ని ఫ్రీజ్ చేయించానని కూడా ఉపాసన తెలిపారు. అలాగే ఎగ్ ఫ్రీజింగ్ అపోలోలో కాదు.. బయటి సంస్థలో చేయించుకున్నానని తెలిపారు.
ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థులతో చర్చా సమావేశం తర్వాత ఉపాసనపై ట్రోలింగ్ మొదలైంది. మహిళలకు అతిపెద్ద భీమా మీ అండాలను కాపాడుకోవడం.. ఎందుకంటే మీరు ఎప్పుడు వివాహం చేసుకోవాలో, మీకు మీరు నిర్ణయించుకున్న రూల్స్ ప్రకారం పిల్లలను కనాలనుకున్నప్పుడు, మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడు పిల్లల్ని కనొచ్చ``ని ఉపాసన సూచించారు.
20లోనే పిల్లల్ని కనాలి
అయితే ఉపాసన లేటు మ్యారేజీ, లేటుగా పిల్లల్ని కనడంపై జోహో సీఈవో శ్రీధర్ వెంబు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. యువతరం 20లలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని చెబుతుంటానని, వారు తమ సమాజం, పూర్వీకుల కోసం ఈ విధిని నిర్వర్తించాలని అన్నారు. ఇవన్నీ పాత కాలం మాటల్లా అనిపిస్తాయని, కాల క్రమంలో జరగాల్సింది అదేనని భావిస్తానని కూడా ఆయన అన్నారు. అయితే దీనిపై నెటిజనులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసారు. ఉపాధి కోసం, ఆర్థికంగా ఎదగడం కోసం పెళ్లి, పిల్లల్ని కనడాన్ని కొన్నాళ్లు వాయిదా వేయడం తప్పు కాదని పలువురు అభిప్రాయపడ్డారు. పెళ్లిళ్లు లేటవ్వడానికి ఆర్థిక ఒత్తిళ్లు ప్రధాన కారణమని అన్నారు.