ఓజీ యాంకర్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తోంది!
అయితే వీరందరికంటే ముందే సినిమాల్లోకి ప్రవేశించి ఆకట్టుకున్న క్రేజీ యాంకర్..ఓజీ యాంకర్ ఉదయభాను. తనదైన గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించి వెండితెరపై కూడా అరంగేట్రం చేసింది.;
బుల్లితెరపై యాంకర్లుగా తనదైన స్టైల్లో కార్యక్రమాలని రక్తికట్టించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. సుమ నుంచి శ్రీముఖి వరకు ఇప్పటికి బుల్లితెరపై తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే ఇందులో చాలా మంది వెండితెరపై కూడా మెరుస్తున్న విషయం తెలిసిందే. బుల్లితెర నుంచి వెండితెరపైకి అరంగేట్రం చేసిన వాళ్లలో అనసూయ, ఝూన్సీ మాత్రమే ఫుల్ టైమ్ యాక్టర్స్‌గా వ్యవహరిస్తూ క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. సుమ, శ్రీముఖి, రష్మీ గౌతమ్ అప్పుడప్పుడు అవకాశాలని బట్టి మెరుస్తున్నారు.
స్రవంతి ఈ మధ్య సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అయితే వీరందరికంటే ముందే సినిమాల్లోకి ప్రవేశించి ఆకట్టుకున్న క్రేజీ యాంకర్..ఓజీ యాంకర్ ఉదయభాను. తనదైన గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించి వెండితెరపై కూడా అరంగేట్రం చేసింది. పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించి డైరెక్ట్ చేసిన `ఎర్రసైన్యం` సినిమాతో 90వ దశకంలో సంచలనం సృష్టించిన ఉదయభాను ఆ తరువాత కొంత విరామం తీసుకుని తనకు నచ్చిన సినిమాల్లో మాత్రమే నటించడం మొదలు పెట్టింది.
ఇప్పుడు ఓటీటీ బాటపడుతోంది. ఉదయభాను నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ `డాటర్ ఆఫ్ ప్రసాదరావు`. రాజీవ్ కనకాల, వాసంతి, గాయత్రి భార్గవి, శ్రీరామ్ వెంకట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కూతురి కోసం తపనపడే ఓ తండ్రి కథగా క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో దీన్ని రూపొందించారు. ఇందులో ఉదయభాను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. అమ్మాయి మిస్సింగ్ మిస్టరీగా మారడంతో ఆ కేసుని ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా ఉదయభాను కనిపించనుంది.
పోలూరు కృష్ణ దీనికి దర్శకుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేశారు. `అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా` అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. కూతురంటే అమితమైన ఇష్టం, ప్రేమ ఉన్న తండ్రిగా రాజీవ్ కనకాల నటించారు. ఆయనకు కూతురిగా `#90`s ఫేమ్ వాసంతిక కీలక పాత్రలో నటించింది. కథ మొత్తం తన మిస్సింగ్ చుట్టే తిరుగుతుంది. కూతురంటే అమితమైన ఇష్టమున్న తండ్రి, తండ్రి అంటే అపారమైన ప్రేమ ఉన్న కూతురు మధ్య సాగే క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కనిపించకుండా పోవడంతో తండ్రి పోలీసుల్ని ఆశ్రయిస్తాడు. ఈ మిస్టరీ కేసుని ఛేందించే బాధ్యతని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ పాత్రలో ఉదయభాను నటించింది. `కళ్లముందే ఏదో ఉంది..కానీ నేను ఏదో మిస్సవుతున్నాను. నేను ఏదో మిస్సవుతున్నాను` అంటూ ఉదయభాను చెబుతున్న డైలాగ్‌లు, ఆమె క్యారెక్టర్‌ని మలిచిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో ఉదయభాను ఓటీటీలో అయినా దూసుకుపోతుందా? అన్నది వేచి చూడాల్సిందే.