ఆ డైరెక్ట‌ర్ మెట్టు దిగ‌నంటున్నాడా?

అగ్ర హీరోల కాల్ షీట్లు ఇప్ప‌ట్లో లభించే అవకాశం లేకపోవడంతో సమయం వృథా కాకుండా మీడియం రేంజ్ లేదా ఎదుగుతున్న యువ హీరోలతో సినిమా చేయవచ్చు?

Update: 2026-09-07 07:00 GMT

పరిశ్రమలో దర్శకుడు సాధించే వరుస విజయాలు ఆయన మార్కెట్ స్థాయిని ఒక్కసారిగా పెంచేస్తాయి. వరుసగా రెండు భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న ఓ ప్రతిభావంతుడైన దర్శకుడు ఇప్పుడు మూడవ‌ ప్రాజెక్ట్ విషయంలో ధర్మసంకటంలో పడినట్లు చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది. మొదటి రెండు సినిమాలతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, భారీ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న మేకర్ త‌ర్వాతి చిత్రాన్ని కూడా అంతకంటే పెద్ద స్థాయిలోనే తెరకెక్కించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

రెండో సినిమాతోనే ఏకంగా పాన్ ఇండియా రేంజ్ విజయాన్ని, భారీ వసూళ్లను సాధించడంతో దర్శకుడి ఆలోచనా సరళి కూడా పూర్తిగా మారిపోయింది. మూడో సినిమాను కూడా పరిశ్రమలోని అగ్ర శ్రేణి హీరోలతోనే చేయాలనే బలమైన పట్టుదలతో ఉన్నారని తెలిసింది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. ప్రస్తుతం ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకులందరూ ఒప్పుకున్న భారీ ప్రాజెక్టులతో.. పాన్ ఇండియా చిత్రాలతో రాబోయే రెండేళ్ల వరకు బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నారు.

అగ్ర హీరోల కాల్ షీట్లు ఇప్ప‌ట్లో లభించే అవకాశం లేకపోవడంతో సమయం వృథా కాకుండా మీడియం రేంజ్ లేదా ఎదుగుతున్న యువ హీరోలతో సినిమా చేయవచ్చు? కదా అని కొందరు సన్నిహితులు సలహా ఇచ్చినట్లు సమాచారం. కానీ ఆ ప్రతిపాదనకు సదరు దర్శకుడు అంతగా మొగ్గు చూపడం లేదని టాక్. తన మార్కెట్ స్థాయి, క్రేజ్ దృష్ట్యా చిన్న ..యువ హీరోల వైపు అడుగులు వేయడానికి సుముఖంగా లేరని తన స్టేటస్ తగ్గకూడదనే ఉద్దేశంతో ఉన్నారని పరిశ్రమ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

స్టార్ హీరో అందుబాటులోకి వచ్చేవరకు ఎంత సమయం పట్టినా? వేచి చూడటమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకానీ తన రేంజ్ కంటే తక్కువ స్థాయి ప్రాజెక్ట్‌ను ఒప్పుకుని ఆచితూచి అడుగు వేయకపోతే సాధించిన క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందనే ఆలోచనలో ఆయన ఉన్నారట. దీంతో దిగి రాను అనే మొండి పట్టుదలతోనే ఆయన అగ్ర కథానాయకుడి కాల్ షీట్స్ కోసం నిరీక్షిస్తున్నారని ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది.

అయితే విశ్లేషకులు మాత్రం ఈ ధోరణిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విజయాలు వచ్చినప్పుడు ఎంత త్వరగా తదుపరి సినిమాను పట్టాలెక్కిస్తే అంత మంచిదని.. సుదీర్ఘమైన విరామం తీసుకోవడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉందంటున్నారు. సరైన కథ, కథనాలు ఉంటే యంగ్ హీరోలతో చేసినా కూడా ఆ సినిమాను తన దర్శకత్వ ప్రతిభతో భారీ విజయం వైపు నడిపించవచ్చని సలహాలు ఇస్తున్నారు.

ఏది ఏమైనా? వరుస విజయాల జోరులో ఉన్న ఆ దర్శకుడు తదుపరి అడుగు ఎటువైపు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అగ్ర హీరోల కాల్ షీట్ల కోసం వేచి చూస్తూ కాలయాపన చేస్తారా? లేక పట్టుదలను కాస్త పక్కనబెట్టి యువ హీరోతో సినిమాను పట్టాలెక్కిస్తారా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News