ఫ్యాన్స్ అతి ఒక్కటే కాదు.. ఈవెంట్స్‌లో ప్లానింగ్ కూడా మారాలి!

అభిమానుల ఉత్సాహం ఎంత ఉంటుందో తెలిసిన తర్వాత కూడా అదే రిస్క్ ఉన్న సెటప్ కొనసాగితే సమస్య మళ్లీ వస్తూనే ఉంటుంది.

Update: 2026-08-23 05:04 GMT

పెద్ద హీరో సినిమా ఈవెంట్ అంటే అభిమానులు భారీగా రావడం కొత్త విషయం కాదు. హీరోను దగ్గరగా చూడాలనే ఉత్సాహంలో ముందుకు రావడం, స్టేజ్ దగ్గరకు వెళ్లడం కూడా తరచూ కనిపిస్తూనే ఉంటుంది. కానీ అదే ఉత్సాహం ఎక్కడ ఆగాలి, ఏ ప్రాంతంలో ఎవ్వరిని అనుమతించకూడదు అన్నది ముందే ప్లాన్ చేయాల్సింది నిర్వాహకుల పని. ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఘటన మళ్లీ అదే డౌట్ ను తీసుకొచ్చింది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు భారీగా విద్యార్థులు, అభిమానులు వచ్చారు. కొందరు సౌండ్, లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన స్ట్రక్చర్‌పైకి ఎక్కడంతో అది కూలిపోయి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఇలాంటి నిర్మాణాల దగ్గరకు ప్రేక్షకులు చేరకుండా ముందే బ్యారికేడ్లు, ప్రత్యేక సిబ్బంది ఎందుకు ఉండరన్న ప్రశ్న మాత్రం మిగిలింది.

ఇలాంటి ఘటనలు మొదటిసారి కాదు. ఈ ఏడాదే ‘పెద్ది’ ఈవెంట్‌లో రామ్ చరణ్ దగ్గరకు అభిమానులు ఒక్కసారిగా రావడంతో అక్కడ కూడా పరిస్థితి అదుపు తప్పింది. ఆయన గాయపడిన చేతిని అభిమానులు పట్టుకోవడంతో మళ్లీ నొప్పి వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే స్టార్ దగ్గరకు వెళ్లాలనే ఫ్యాన్స్ ఉత్సాహం ఎలా ఉంటుందో నిర్వాహకులకు ముందే తెలిసిన విషయమే.

ఇంకా వెనక్కి వెళ్తే ‘పుష్ప 2’ ప్రీమియర్ సమయంలో జరిగిన ఘటన చాలా పెద్ద హెచ్చరిక. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద భారీగా జనం చేరడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందారు, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఘటన తర్వాత క్రౌట్ మేనేజ్మెంట్ విషయంలో థియేటర్ యాజమాన్యంపై పోలీసులు పలు లోపాలను కూడా ప్రస్తావించారు.

అందుకే ప్రతి ఘటన తర్వాత అభిమానులనే పూర్తిగా తప్పు పట్టడం కూడా సరిపోదు. ఎవరు ఎక్కడ నిలబడాలి, మీడియా ఏరియా ఏది, విద్యార్థులు లేదా అభిమానులు ఎంత దూరం వరకు రావచ్చు, సౌండ్ టవర్లు లేదా లైటింగ్ స్టాండ్స్ చుట్టూ ఎంత దూరం ఖాళీగా ఉంచాలి.. ఇవన్నీ ఈవెంట్ మొదలయ్యేలోపే ఫిక్స్ కావాలి. ఒకరు ఎక్కడం మొదలుపెట్టాక ఆపడం కంటే, అక్కడికి వెళ్లే అవకాశమే లేకుండా చేయడం బెటర్.

‘టాక్సిక్’ ఈవెంట్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ప్రతి సారి అదృష్టం ఇలానే ఉండదు. అభిమానుల ఉత్సాహం ఎంత ఉంటుందో తెలిసిన తర్వాత కూడా అదే రిస్క్ ఉన్న సెటప్ కొనసాగితే సమస్య మళ్లీ వస్తూనే ఉంటుంది. పెద్ద సినిమాలకు భారీ ఈవెంట్లు తప్పక జరుగుతాయి.. కానీ వాటి స్కేల్ ఎంత పెరుగుతుందో, సేఫ్టీ ప్లానింగ్ కూడా అంతే పెరగాల్సిందే.

Tags:    

Similar News