కష్టపడి పైకొచ్చారు.. ఇప్పుడు కొత్త వాళ్లకు ఛాన్స్

ఇలాంటి విషయంలో ముందుగా గుర్తొచ్చే పేరు సుకుమార్. దర్శకుడిగా టాప్‌లోకి వెళ్లాక సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్త వాళ్లను ముందుకు తీసుకొచ్చాడు.

Update: 2026-08-31 05:49 GMT

‘అర్జున్ రెడ్డి’ కోసం సందీప్ రెడ్డి వంగా ఎంత కష్టపడ్డాడో చాలాసార్లు చెప్పుకున్నాడు. నిర్మాతలు ముందుకు రాకపోవడంతో చివరకు కుటుంబమే డబ్బు పెట్టి సినిమా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే వంగా పేరు ‘రోమాంచకం’ వెనక ఉంది. కొత్త దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి, సుమంత్ ప్రభాస్ లాంటి యంగ్ టీమ్‌తో ప్రణయ్ రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మించగా, సందీప్ సమర్పిస్తున్నాడు. సెప్టెంబర్ 3న సినిమా రిలీజ్ కానుంది.

ఇలాంటి విషయంలో ముందుగా గుర్తొచ్చే పేరు సుకుమార్. దర్శకుడిగా టాప్‌లోకి వెళ్లాక సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్త వాళ్లను ముందుకు తీసుకొచ్చాడు. ‘కుమారి 21F’తో సూర్య ప్రతాప్‌కు మరో అవకాశం వచ్చింది. ‘ఉప్పెన’తో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘విరూపాక్ష’తో కార్తీక్ దండు పేరు బాగా వినిపించింది. తన దగ్గర పనిచేసిన వాళ్ల కథలకు సుకుమార్ పేరు, బ్యానర్ రెండూ అండగా నిలిచాయి.

వేణు ఊడుగుల కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. దర్శకుడిగా ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ చేసిన అతను ‘రాజు వెడ్స్ రాంబాయి’కి నిర్మాతగా మారాడు. తన దగ్గర పనిచేసిన సాయిలు కంపాటిని దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ తర్వాత కూడా తెలంగాణ నుంచి కొత్త నటీనటులను తీసుకోవడానికి ఆడిషన్స్ పెట్టడం మొదలుపెట్టాడు.

నాగ్ అశ్విన్ కూడా దర్శకుడిగా తన సినిమాలతో బిజీగా ఉంటూనే ఇతరుల సినిమాలకు నిర్మాతగా నిలబడ్డాడు. ‘జాతిరత్నాలు’ కోసం అనుదీప్ కేవీని ముందుకు తీసుకొచ్చాడు. ఆ సినిమా తర్వాత లేటెస్ట్ గా 94 ఏళ్ల సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన ‘సింగ్ గీతం’ను కూడా నిర్మాతగా తీసుకొచ్చాడు. ఒకవైపు కొత్త దర్శకుడికి పెద్ద బ్రేక్ ఇవ్వడం, మరోవైపు సీనియర్ దర్శకుడి కొత్త ప్రయత్నానికి అండగా నిలబడటం నాగ్ అశ్విన్ దగ్గర కనిపించిన మరో మంచి గుణం.

ప్రశాంత్ వర్మ కూడా ‘హనుమాన్’ తర్వాత తన సినిమాటిక్ యూనివర్స్‌ను తానే ఒక్కొ సినిమా డైరెక్ట్ చేస్తూ నడపడం లేదు. ‘మహాకాళి’ని పూజ కొల్లూరు చేతిలో పెట్టాడు. కథ, యూనివర్స్ తనదే అయినా మరో దర్శకురాలిని ముందుకు తీసుకొస్తున్నాడు. పెద్ద హిట్ తర్వాత మొత్తం తన చేతిలోనే ఉంచుకోవడం కంటే కొత్త వాళ్లతో ఆ ప్రపంచాన్ని పెంచుతున్నాడు.

ఇప్పుడు ‘రోమాంచకం’ రిలీజ్ దగ్గరికి రావడంతో వంగా పేరు కూడా ఈ లిస్ట్‌లోకి వచ్చింది. ఈ సినిమా తర్వాత భద్రకాళీ పిక్చర్స్ నుంచి మళ్లీ కొత్త దర్శకులు, కొత్త హీరోలతో సినిమాలు వస్తాయా అన్నది చూడాలి. ఒకప్పుడు తమ కథ పట్టుకుని నిర్మాతల కోసం తిరిగిన వాళ్లే ఇప్పుడు మరో కొత్తవాడి కథకు మొదటి తలుపు తెరవడం మాత్రం మంచి మార్పే.

Tags:    

Similar News