టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్: సైన్స్ ఫిక్షన్ & టైమ్ ట్రావెల్ మ్యాజిక్!

కాలానికి తగినట్లుగా కథాంశాలు మారుతుంటాయి. ఒకప్పుడు రొమాంటిక్ డ్రామాలు, కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు మాత్రమే ట్రెండ్‌లో ఉండేవి.

Update: 2026-08-14 19:30 GMT

కాలానికి తగినట్లుగా కథాంశాలు మారుతుంటాయి. ఒకప్పుడు రొమాంటిక్ డ్రామాలు, కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు మాత్రమే ట్రెండ్‌లో ఉండేవి. కానీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆలోచనల సరళి పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్‌లో టైమ్ ట్రావెల్-సైన్స్ ఫిక్షన్ చిత్రాల ట్రెండ్ ఊపందుకుంటుంది. సాధారణ ప్రేక్షకులను సైతం అబ్బురపరిచే సరికొత్త లోకాలను తెరపైకి తీసుకురావడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సరికొత్త ప్రయోగాల జాబితాలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే` ఒకే ఒక్క జీవితం` వంటి విభిన్నమైన టైమ్ ట్రావెల్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ‌ర్వా తాజాగా దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి మరో సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్‌కు సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ క్షణం నుంచే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కామెడీతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి తెరకెక్కనున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మరో మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అలాగే గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా కీర్తిని పెంచిన దర్శకుడు నాగ్‌అశ్విన్ సృష్టిస్తున్న `కల్కి` ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైన్స్ ఫిక్షన్‌కు .. పురాణేతిహాసాలను అద్భుతంగా ముడిపెట్టి ఆయన సృష్టించిన భవిష్యత్ ప్రపంచం విస్మయానికి గురిచేసింది. ఇప్పుడు దాని కొనసాగింపుగా వస్తున్న `కల్కి` సీక్వెల్లో సైన్స్ .. మైథాలజీ కలయికను మరింత ఉన్నత స్థాయిలో చూపించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరోసారి ప్రపంచ నలుమూలలకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ కోవలోనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడానికి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - మహేష్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `వారణాసి` చిత్రం సిద్ధమవుతోంది. ఇదొక అద్భుతమైన ఫ్యాంటసీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో కథ కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రస్తుత కాలం నుండి నేరుగా రామాయణ కాలానికి టైమ్ ట్రావెల్ చేసే సరికొత్త కాన్సెప్ట్‌తో సాగనుంది. ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ టెక్నాలజీని వాడుతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేర్చుతున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న‌ తాజా చిత్రం `రాకా` సైతం ఇదే కోవలో వస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రంలో బన్నీ మూడు పూర్తిగా భిన్నమైన షేడ్స్‌లో కనిపించబోతున్నారు. ఇదొక హై-వోల్టేజ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న `విశ్వంభర` చిత్రం కూడా ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తోంది. పురాణాల ప్రకారం పైన ఏడు, కింద ఏడు మొత్తం 14 లోకాల నేపథ్యంలో సాగే ఫ్యాంటసీ కథలో సత్యలోకంలో చిక్కుకున్న హీరోయిన్‌ను రక్షించడానికి హీరో 14 లోకాలు దాటి వెళ్లే అద్భుతమైన ప్రయాణాన్ని చూపించనున్నారు.

మొత్తంగా చూస్తే అప్పట్లో వచ్చిన `ఆదిత్య 369` సినిమా వేసిన సైన్స్ ఫిక్షన్ పునాదిని ఇప్పుడున్న టాలీవుడ్ మేకర్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తున్నారు. మాస్ కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా ప్రేక్షకులను సరికొత్త కల్పిత లోకాలకు కాల ప్రయాణాలకు తీసుకెళ్లేలా దర్శకులు వేస్తున్న అడుగులు టాలీవుడ్ భవిష్యత్తును మార్చే స్తున్నాయి. మ‌రి రిలీజ్ త‌ర్వాత ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

Tags:    

Similar News