పైరసీ భూతంపై టాలీవుడ్ సంచలన నిర్ణయం.. కనీసం ఇప్పటికైనా?

అయితే ఈ పైరసీ భూతాన్ని తరిమికొట్టడానికి టాలీవుడ్ సినీ పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయంతోనైనా పూర్తిస్థాయి పైరసీని అరికట్టడానికి వీలవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం..;

Update: 2026-01-06 06:21 GMT

పైరసీ.. టాలీవుడ్ సినీ పరిశ్రమకు అతిపెద్ద భూతంగా మారింది. సుమారుగా కొన్ని సంవత్సరాలలోనే వేలకోట్ల నష్టాన్ని మిగిల్చిన ఈ పైరసీ దుండగులు సినీ పరిశ్రమను పూర్తిస్థాయిలో నష్టాల్లో ముంచేస్తున్నారు అనడంలో సందేహం లేదు. అయితే ఈ పైరసీని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కంకణం కట్టుకున్నా.. ఎప్పటికప్పుడు కొత్త పైరసీ యాప్ లు పుట్టుకొస్తూ అధికారులకు తలనొప్పిగా మారాయి. అయితే ఈ పైరసీ భూతాన్ని తరిమికొట్టడానికి టాలీవుడ్ సినీ పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయంతోనైనా పూర్తిస్థాయి పైరసీని అరికట్టడానికి వీలవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం..

సినీ పరిశ్రమ నష్టాల్లోకి వెళ్తోంది అంటే దీనికి కారణం సినిమా కాదు డిజిటల్ పైరసీ అనే చెప్పాలి. కొత్త సినిమాలు విడుదలైన గంటల వ్యవధిలోనే అక్రమ వెబ్సైట్లోకి వస్తూ నిర్మాతలకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పైరసీ సూత్రధారులను తరచూ అరెస్టు చేస్తున్నప్పటికీ.. చాలా ప్రాంతాలలో ఈ పైరసీ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పైరసీ వెబ్ సైట్లను అభివృద్ధి చేస్తూ చిత్ర పరిశ్రమను నష్టాల్లోకి నెట్టి వేస్తున్నారు. ఈ పైరసీ కారణంగా అత్యంత ప్రభావితమైన చిత్ర పరిశ్రమగా టాలీవుడ్ నిలిచింది అనడంలో సందేహం లేదు.

అలాంటి ఈ పైరసీని శాశ్వతంగా అరికట్టే దిశగా అడుగులు వేసాయి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తో పాటు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్. ఈ రెండు సోమవారం ఒక అధికారిక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ సినీ పరిశ్రమను ప్రభావితం చేసే ఈ ఆన్లైన్ కాపీరైట్ ఉల్లంఘనలపై రియల్ టైం పర్యవేక్షణ, కాపీలను త్వరగా తొలగించడం అలాగే సమన్వయంతో కూడిన చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి సమక్షంలో టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ తో కలిసి ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేసి.. పైరసీ మహమ్మారిని ఎదుర్కోవడానికి పరస్పరం అంగీకారం తెలిపారు. అంతేకాదు ఈ అవగాహన ఒప్పందం రియల్ టైం ఇంటెలిజెన్స్ షేరింగ్, ఆన్లైన్ లీకులను వేగంగా డిలీట్ చేయడం, పైరసీ నెట్వర్క్ లపై సమన్వయంతో కూడిన చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని రూపొందించబోతున్నారు .

సాంకేతిక సాధనాలు అలాగే యంత్రాంగాలను ఉపయోగించి.. ఓటిటి ఫ్లాట్ ఫారం, సోషల్ మీడియా యాప్ స్టోర్ లతో సమన్వయం ద్వారా లీక్డ్ కంటెంట్ ను త్వరగా తొలగించడమే కాకుండా నిరోధించడంపై కూడా ఈ బృందాలు పనిచేస్తాయి.. సినిమా విడుదల సమయంలో సమన్వయంతో కూడిన చర్యలను తీసుకోవడానికి పరిశ్రమ ప్రతినిధులు, పోలీసు శాఖ ఇద్దరు క్రమం తప్పకుండా సమావేశం అవుతారు. అంతేకాదు ఈ ఒప్పందంలో పైరసీ నెట్వర్క్ లతో పాటు డిజిటల్ ప్లాట్ ఫామ్ కంటెంట్ ను కాపీ చేయకుండా చూడడమే కాకుండా కాపీ చేసిన వెంటనే త్వరగా డిలీట్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యంగా ఆటోమేటెడ్ క్రాలర్లు, విశ్లేషణలు , కంటెంట్ గుర్తింపు వ్యవస్థలు వంటి అధునాతన సాంకేతిక సాధనాలను ఉపయోగించి అసలు కంటెంట్ కాపీ కాకుండా చూడడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇన్ని రోజులు ఎంతో సాంకేతికతను ఉపయోగించి పైరసీని అరికట్టే ప్రయత్నాలు చేసిన టాలీవుడ్ పరిశ్రమ ముందు ఇది అతి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సహకారంతో ఫిలిం ఛాంబర్ ఈ పైరసీ భూతాన్ని శాశ్వతంగా అరికట్టే దిశగా అడుగులు వేస్తోంది .కనీసం ఈసారైనా ఈ పైరసీని శాశ్వతంగా తొలగిస్తారేమో చూడాలి. ఏది ఏమైనా ఈ పైరసీ భూతం వల్ల చిత్ర పరిశ్రమ నష్టాల్లోకి వెళ్లడమే కాకుండా ఆ చిత్ర పరిశ్రమను నమ్ముకున్న వేలాదిమంది కార్మికులకు భారీ నష్టం కలుగుతుందని చెప్పవచ్చు.

Tags:    

Similar News