టాలీవుడ్ చరిత్ర చెబుతోంది ఇదేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాలుగా పేరు, బ్యాగ్రౌండ్ ఉన్న పెద్ద స్టార్లు తప్ప కొత్త వారు హీగారో నిలబడిన సందర్భాలు చాలా తక్కువే.;
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాలుగా పేరు, బ్యాగ్రౌండ్ ఉన్న పెద్ద స్టార్లు తప్ప కొత్త వారు హీగారో నిలబడిన సందర్భాలు చాలా తక్కువే. ఒక వేళ అలాంటి వారు ఒకటి రెండు సినిమాలతో ప్రభావాన్ని చూపించినా ఆ తరువాత స్టార్‌ల ముందు ప్రభావాన్ని చూపించలేక నిలబడలేకపోయారు. కనుమరుగయ్యారు. ఇక్కడ ఎవరో ఒకరి అండ ఉంటే తప్ప హీరోలుగా, క్రేజీ నటులుగా నిలబడలేరని ఎంతో మంది విషయంలో రుజువైంది. ఇప్పటికీ అదే పరిస్థితి ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది.
సీనియర్స్ అయినా ఎన్టీఆర్, ఏ ఎన్నార్‌ల టైమ్ నుంచి చిరంజీవి ఎరా వరకు ఇదే స్టోరీ రిపీట్ అవుతూ వస్తోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల టైమ్‌లో కొత్త వారు వచ్చినా ప్రభావం చూపించలేకపోయారు. వారి వారసులు, ఆ తరువాత తరం వారే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలుగా నిలబడ్డారు. దీంతో ఇండస్ట్రీ కొంత మందికే పరిమితం అనే చర్చ కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. అది ఇప్పటికీ అదే స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ తరంలో పవన్‌కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల డామినేషనే కనిపిస్తోంది. దీంతో ఇండస్ట్రీకి వచ్చే కొత్త హీరోలకు, ఎమర్జింగ్ స్టార్స్‌కు అవకాశాలు తగ్గుతున్నాయి.
పాన్ ఇండియా సినిమా అంటే స్టార్స్ మాత్రమే చేయాలనే సంప్రదాయం, మార్కెట్ లెక్కలు ఉండటంతో వీరి స్టార్ డామినేషన్ ముందు కొత్త హీరో నిలబడలేకపోతున్నాడు. స్టార్ల ప్రభావం తీవ్ర స్థాయికి చేరడంతో మిగతావారు ఫేడ్ అవుట్ అవుతున్నారు. టాలెంట్‌కు పెద్దపీట వేయాల్సిన ఇండస్ట్రీలో కేవలం ఇమేజ్, క్రేజ్‌ని, బ్యాగ్రౌండ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తుండటంతో గత కొంత కాలంగా మిగతా వారికి అన్యాయం జరుగుతోంది. ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కొత్తలో కొత్త హీరోలు రెండు మూడు హిట్లతో ప్రభావం చూపించినా లాంగ్ రన్‌లో మాత్రం స్టార్‌ల పోటీని తట్టుకుని నిలబడలేకపోతున్నారు.
అలా రెండు మూడు హిట్‌లతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరోలు ఆ తరువాత సరైన సినిమాలు పడక, అనుకున్న విధంగా ఆదరణ లభించక తెరమరుగైన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. దీంతో సినిమా పేరున్న స్టార్ల చుట్టే తిరుగుతూ వారే ప్రధానం అనే స్థాయికి చేరింది. పాన్ ఇండియా సినిమాల ప్రభావం మరింతగా పెరిగిన నేపథ్యంలో కొంత మందికి అవకాశాలు లభించినా భారీ పోటీ ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు.
అయితే పోటీలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో పక్కాగా కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటూ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా కొంత వరకు ప్రభావాన్ని చూపించగలుగుతున్నారు. రవితేజ, నిఖిల్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు స్టార్‌ల డామినేషన్ ఉన్నా కానీ తమదైన మార్కు కథలతో, సినిమాలతో కొంత వరకు ప్రభావాన్ని చూపిస్తూ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా హీరోలుగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. మర్రి చెట్టు నీడలో మొక్కల్లా.. స్టార్ హీరోల నీడలో హీరోలుగా నిలబడుతున్న వీళ్లు ఎంత వరకు ఇండస్ట్రీలో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.