సెలబ్రిటీస్ వెడ్డింగ్ కి ఓటీటీలు భారీ ఆఫర్.. సున్నితంగా తిరస్కరిస్తున్న స్టార్స్!
సినిమా తారల పెళ్లి అంటే ఆ హంగామానే వేరు. అభిమానులకు అది ఒక పండగ లాంటిది. అందుకే ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి.;
సినిమా తారల పెళ్లి అంటే ఆ హంగామానే వేరు. అభిమానులకు అది ఒక పండగ లాంటిది. అందుకే ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. సెలబ్రిటీల వివాహ వేడుకలను లైవ్ స్ట్రీమింగ్ లేదా డాక్యుమెంటరీగా స్ట్రీమ్ చేయడానికి కోట్ల రూపాయల ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే, తమ వ్యక్తిగత జీవితాన్ని వ్యాపారం చేయడం ఇష్టం లేక చాలా మంది స్టార్స్ ఈ భారీ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. వివరాలలోకి వెళితే..
విజయ్ - రష్మిక పెళ్లిపై 'ఓటీటీ' కన్ను:
గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే, వీరిద్దరి పెళ్లి వేడుకల ప్రసార హక్కుల కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ దాదాపు రూ. 50 కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చిందని టాక్. కానీ, ఈ జంట ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తమ జీవితంలో అత్యంత విలువైన క్షణాలను కేవలం తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్యే జరుపుకోవాలని వారు భావిస్తున్నారట. అయితే దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
ఇకపోతే ఇలా ఓటీటీ ఆఫర్ ను తిరస్కరించిన సెలబ్రిటీల జాబితా చాలానే ఉంది. ముఖ్యంగా ఓటీటీ ఆఫర్లను పక్కన పెట్టిన స్టార్స్ లిస్టులో ఎందరో వున్నారు. ఇక వారిలో సిద్ధార్థ్ - అదితి రావు హైదరి.. ఈ జంట కూడా తమ పెళ్లిని చాలా సింపుల్‌గా, సాంప్రదాయబద్ధంగా చేసుకున్నారు. వీరికి కూడా భారీ ఆఫర్లు వచ్చినా, ప్రైవసీకే మొగ్గు చూపారు. ఇక అక్కినేని హీరో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల జంట. వీరి నిశ్చితార్థం నుండే ఓటీటీల ఫోకస్ వీరిపై ఉంది. అయితే, చైతన్య తన వ్యక్తిగత విషయాలను కెమెరాల ముందు ఉంచడానికి అస్సలు ఇష్టపడరు. కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా ఈ కోవకే చెందుతారు. బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా, సిద్ధార్థ్ కూడా తమ పెళ్లి వీడియో కోసం వచ్చిన కోట్ల ఆఫర్లను వద్దనుకున్నారు.
ఓటీటీలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి?: మీకు తెలుసా? నయనతార - విగ్నేష్ శివన్ పెళ్లిని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేసినప్పుడు దానికి భారీ స్థాయిలో వ్యూయర్ షిప్ వచ్చింది. ఇక పోతే, అప్పటి నుండి ఓటీటీ సంస్థలు స్టార్ల వెడ్డింగ్ డాక్యుమెంటరీలపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాయి. ఒక్కోసారి ఈ ఆఫర్లు సినిమా రెమ్యూనరేషన్ కంటే కూడా ఎక్కువగా ఉంటున్నాయి.
డబ్బు కంటే ప్రైవసీ ముఖ్యం అనుకునే స్టార్స్ ఈ ట్రెండ్‌కు దూరంగా ఉంటున్నారు. తమ వైవాహిక జీవితం వ్యాపార వస్తువు కాకూడదని వారు తీసుకునే నిర్ణయం పట్ల నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ వెడ్డింగ్ స్ట్రీమింగ్ ట్రెండ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..