300 టైటిల్స్ రిజిస్ట్రేష‌న్ తో ఏం లాభం!

ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ చిన్న సినిమాల నిర్మాణంతో క‌ళ‌క‌ళ‌లాడేది. శుక్ర‌వారం వ‌స్తే? ఏకంగా 20 సినిమాల రిలీజ్ లు కూడా ఉండేవి.;

Update: 2026-02-15 11:30 GMT

ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ చిన్న సినిమాల నిర్మాణంతో క‌ళ‌క‌ళ‌లాడేది. శుక్ర‌వారం వ‌స్తే? ఏకంగా 20 సినిమాల రిలీజ్ లు కూడా ఉండేవి. వారంతో సంబంధం లేకుండా థియేట‌ర్ల స‌ర్దుబాటును బ‌ట్టి సినిమాలు రిలీజ్ అవుతుండేవి. సినిమాకు న‌ష్టం వ‌చ్చినా? లాభం వ‌చ్చినా? నిర్మాణం మాత్రం ఆగేది కాదు. ఇండ‌స్ట్రీలో కొత్త నిర్మాత‌లు ఎక్కువ‌గా క‌నిపించేవారు. వారిలో క‌థ‌ల ప‌ట్ల స‌రైన అవ‌గాహ‌న ఉన్న నిర్మాత‌లు స‌క్స‌స్ అయ్యేవారు. నిర్మాత‌లుగా కొన‌సాగే వారు. అలాగ‌ని స‌క్సెస్ అవ్వ‌ని వారు పూర్తిగా నిర్మాణానికి దూరం కాలేదు. తెలివిగా బిజినెస్ గేమ్ ఆడి రిలీజ్ చేసేవారు. అలా సినిమా నిర్మాణం అనేది అధికంగా క‌నిపించేది.

కానీ ఏడేనిమిదేళ్ల కాలంగా ఇండ‌స్ట్రీలో ఆ ప‌రిస్థితి అస్స‌లు లేనే లేదు. చిన్న సినిమాల నిర్మాణం అన్న‌ది పూర్తిగా త‌గ్గిన మాట వాస్త‌వం. రెండు కోట్లు కూడా ఖ‌ర్చు చేసి సినిమా తీయ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇక కొత్త నిర్మాత‌లైతే సినిమా ఇండస్ట్రీ వైపే చూడ‌టం లేదు. సినిమా తీస్తే ఏం లాభం. దాన్ని రిలీజ్ చేయ‌డానికి నానా పాట్లు ప‌డాల్సి వ‌స్తోంది అన్న‌ది ప్ర‌ధాన కార‌ణం. థియేట‌ర్ల మోనోప‌లి విధానం తొల‌గిపోయే వ‌ర‌కూ చిన్న సినిమా రిలీజ్ క‌ష్ట‌మ‌ని ఎంతో మంది అభిప్రాయం. థియేట‌ర్ల కోసం ఛాంబ‌ర్ ముందు నిర‌స‌న‌లు, భైటాయించిన సంద‌ర్భాలు ఎన్నో.

కానీ గ‌డిచిన కొన్నాళ్ల‌గా ఈ ప‌రిస్థితి ఛాంబ‌ర్ ముందు క‌నిపించ‌లేదు? అంటే చిన్న సినిమా నిర్మాణం లేదు అన‌డానికి పెద్ద సూచిక‌గా పెచ్చొచ్చు. తాజాగా ఈ నాలుగు నెల‌ల కాలంలోనే ఒకే నెల‌లో ఏకంగా 300 టైటిల్స్ రిజిస్ట్ర‌ర్ అయిన‌ట్లు ఓ నిర్మాత తెలిపారు. చిన్న సినిమాలు రావ‌డం లేదు అన్న మాట‌ను ఆయ‌న ఈ రిజిస్ట్రేష‌న్ ఆధారంగా ఖండించారు. కానీ వాస్త‌వం ఏంటంటే? టైటిల్స్ రిజిస్ట్రేష‌న్ అన్న‌ది అక్క‌డికే ప‌రిమితం. అవి సినిమాలు గా ప్రారంభ‌మై సెట్స్ కు వెళ్ల‌డం లేద‌న్న‌ది అంతే వాస్తవం. రిజిస్ట్రేష‌న్ ది ఏముంది? చ‌లానా చెల్లించి ఎవ‌రైనా న‌చ్చిన టైటిల్ రిజిస్ట‌ర్ చేయించుకోవ‌చ్చు.

కానీ సినిమా ప్రారంభించడం..దాన్ని పూర్తి చేయ‌డం..రిలీజ్ చేయ‌డం అన్న‌దే అసలైన స‌వాల్. వీటిలో కొన్ని సినిమాలు ప్రారంభం అవుతాయి. కానీ పూర్తి కావు. కొన్ని సినిమాలు సెట్స్ మ‌ధ్య‌లో నిలిచిపోతాయి. మ‌రికొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని ల్యాబ్ ల్లో మ‌గ్గిపోతుంటాయి. ఇంకొన్ని సినిమాల‌కు రిలీజ్ ఆటంకం కార‌ణంగా ఆగిపోతాయి. మ‌రికొన్ని సినిమాల‌కు థియేట‌ర్లు స‌రిగ్గా దొర‌క‌డం లేద‌ని రిలీజ్ ఆపేస్తుంటారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నీ చిన్న సినిమాల‌కే స‌హ‌జంగా క‌నిపిస్తుంటాయి. ప్ర‌ధానంగా థియేట‌ర్లు ఇవ్వ‌డం లేదు అన్న కార‌ణంగా చిన్న సినిమాలు నిర్మాణం ఆగిపోయింద‌న్న‌ది చాలా మంది నిర్మాత‌ల వాద‌న‌.

Tags:    

Similar News