ఆ లిస్ట్ లో సూపర్ స్టార్, గ్లోబల్ స్టార్ లేరు
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ సీక్వెల్స్ ను విపరీతంగా ఫాలో అవడానికి కారణం మాత్రం రాజమౌళినే.;
టాలీవుడ్ లో ఒకప్పుడు లేని సీక్వెల్స్ ట్రెండ్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఒక సినిమా హిట్ అవకముందే ఆ సినిమా సక్సెస్ పై నమ్మకంతో దానికి సీక్వెల్స్ ను అనౌన్స్ చేసి, ఆ తర్వాత మొదటి సీక్వెల్ కు ఏ మాత్రం సంబంధం లేకుండా కొంతమంది సినిమాలు చేస్తుంటే మరికొందరు మాత్రం ఒకే కథను రెండు భాగాలుగా చేసి సీక్వెల్ పేరుతో కథను కంటిన్యూ చేస్తున్నారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ సీక్వెల్స్ ను విపరీతంగా ఫాలో అవడానికి కారణం మాత్రం రాజమౌళినే. బాహుబలి సినిమాతో రాజమౌళి ఈ ట్రెండ్ ను మొదలుపెట్టగా తర్వాత దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు. బాహుబలి తర్వాత సీక్వెల్స్ ట్రెండ్ ను ఫాలో అవుతూ ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలొచ్చాయి. అందులో టాలీవుడ్ లోని అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాలు కూడా ఉన్నాయి.
టాలీవుడ్ లోని టైర్1 హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మినహాయించి మిగిలిన అందరూ ఈ సీక్వెల్స్ ను చేసిన వాళ్లే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప1, పుష్ప2 పేరిట సీక్వెల్ సినిమాలు చేయగా, ఆ రెండు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో పాటూ ఎన్నో రికార్డులను కూడా సొంతం చేసుకున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి గతేడాది దేవర1 రాగా దానికి సీక్వెల్ గా దేవర2 రావాల్సి ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న దేవర2లోనే సినిమా అసలు కథ దాగి ఉంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే ఈ ట్రెండ్ మొదలైందే తనతో కాబట్టి అందరికంటే ఎక్కువ సీక్వెల్స్ అతని ఖాతాలోనే ఉన్నాయి. ఆల్రెడీ బాహుబలి సిరీస్‌లను చేసి వాటితో మంచి హిట్లు అందుకున్న డార్లింగ్ ప్రభాస్.. సలార్, కల్కి 2898ఏడి సినిమాలకు సీక్వెల్స్ చేయాల్సి ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన చేస్తున్న హరి హర వీరమల్లు కూడా రెండు భాగాలుగా రానుంది మొదటి భాగం జులై లో రిలీజ్ కానుండగా, రెండో భాగం ఎప్పుడొస్తుందనేది తెలియదు. దీంతో ఇప్పటివరకు సీక్వెల్స్ అనౌన్స్ చేయని టాలీవుడ్ టైర్1 హీరోలుగా మహేష్, చరణ్ మిగిలారు.