రూట్ మార్చిన సీనియర్లు వయసుకు తగ్గ పాత్రలకే జై!
టాలీవుడ్‌లో ఒకప్పుడు సీనియర్ హీరోలు అంటే కమర్షియల్ ఫార్ములా చిత్రాలకే పరిమితం అయ్యేవారు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు సీనియర్ హీరోలు అంటే కమర్షియల్ ఫార్ములా చిత్రాలకే పరిమితం అయ్యేవారు. వయసు పెరుగుతున్నా? తెరపై తాము ఇంకా కుర్రాళ్లమే అని నిరూపించుకోవడానికి యంగ్ హీరోయిన్లతో డ్యూయెట్లు పాడటం.. రొటీన్ ఫైట్లతోనే కనిపించేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పు వచ్చింది. ఇది గమనించిన పరిశ్రమలోని సీనియర్ స్టార్ హీరోలు తమ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చు కుంటున్నారు. రొటీన్ మాస్ మసాలా పాత్రల కంటే వయసుకు -ఇమేజ్‌కు సరిపోయే విభిన్నమైన, ప్రయోగా త్మకమైన కథల వైపు అడుగులు వేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హీరో కేంద్రంగా సాగే కథలనే కాకుండా బలమైన భావోద్వేగాలు ఉన్న ఇలాంటి పాత్రలను ఒప్పుకుంటూ మెగాస్టార్ తనలోని పరిణతి చెందిన నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ వయసుకు తగ్గ పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కథలో దమ్ముంటే చాలు క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి.. తోటి హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించడానికి ఆయన వెనుకాడరు.
గతంలోనే చిరంజీవి చిత్రంలో చిన్న అతిథి పాత్రలో మెరిసిన వెంకటేష్.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌తో కలిసి భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టులో నటిస్తున్నారు. స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి కథకు ప్రాధాన్యత ఇవ్వడం ఎలాగో వెంకటేష్ తన కెరీర్ ప్లానింగ్‌తో నిరూపిస్తున్నారు. కింగ్ నాగార్జున సరికొత్త వర్సిటాలిటీని చూపిస్తూ దూసుకుపోతున్నారు. గత ఏడాది రజనీకాంత్ `కూలీ` సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతకు ముందు ధనుష్‌తో కలిసి `కుబేర` చిత్రంలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రను పోషించారు. కథ డిమాండ్ చేస్తే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమేనని నాగ్ నిరూపించారు. ఇదే ఊపులో నాగ్ ప్రతిష్టాత్మక 100వ సినిమాలో సైతం వయసుకు తగ్గ, హుందాగా ఉండే పాత్రలోనే కనిపించనున్నట్లు సమాచారం.
ఈ ట్రెండ్ తెలుగు పరిశ్రమకే పరిమితం కాలేదు. మిగిలిన సౌత్ ఇండస్ట్రీలలోనూ ఇది బలంగా కనిపిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వరుసగా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన `పెద్ది` చిత్రంలో సందడి చేయగా `అభిషన్ జీవన్` అనే సినిమాలో హీరో తండ్రి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాలీవుడ్ లెజెండ్ మోహన్ లాల్ తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగా 158 ప్రాజెక్టులో భాగం కావడం తెలిసిందే. అలాగే లోక నాయకుడు కమల్ హాసన్ `కల్కి` చిత్రంలో సుప్రీం యాస్కిన్‌గా నెగెటివ్ రోల్‌లో అలరించడం తెలిసిందే . ఇలా సీనియర్ హీరోలు తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు అటు చిత్ర పరిశ్రమకు.. ఇటు వారి వ్యక్తిగత కెరీర్‌కు ఎంతో మేలు చేస్తోంది. హీరోల వయసును దాచిపెట్టి బలవంతంగా కమర్షియల్ కథలు రాయాల్సిన అవసరం దర్శకులకు తప్పుతుంది. దీంతో వినూత్న కథలు పుట్టుకొస్తున్నాయి.