మూవీ కేపిటల్ ఆఫ్ ఇండియా గా మారుతోన్న హైదరాబాద్‌!

ఇలా హైదరాబాద్ మూవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా రూపాంతరం చెందడానికి ఇక్కడి అత్యాధునిక థియేటర్ టెక్నాలజీ ప్రధాన భూమిక పోషిస్తోంది.

Update: 2026-07-30 06:53 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంటే ముంబై (బాలీవుడ్) నగరానికే ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. దేశంలో ఏ పెద్ద సినిమా ఈవెంట్ లేదా హాలీవుడ్ చిత్రాల ప్రీమియర్లు జరగాలన్నా? ముందుగా ముంబై పేరే వినిపించేది. అయితే మారుతున్న కాలానికి తగినట్లుగా టాలీవుడ్ సాధించిన అద్భుత ప్రగతి కారణంగా ఇప్పుడా ట్రెండ్ పూర్తిగా మారిపోతోంది. తాజాగా హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ `స్పైడర్ మన్: బ్రాండ్ న్యూ డే` సెలబ్రిటీ ప్రీమియర్ హైదరాబాద్‌లోని ప్ర‌ముఖ అల్లు సినిమాస్‌లో అత్యంత వైభవంగా నిర్వహించడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఒకప్పుడు ముంబైకే పరిమితమైన ఇలాంటి ప్రెస్టేజియస్ ఇంటర్నేషనల్ హాలీవుడ్ ఈవెంట్స్ ఇప్పుడు వరుసగా హైదరాబాద్‌కు షిఫ్ట్ అవ్వడం గమనించాల్సిన విషయం. గ్లోబల్ స్థాయిలో పేరున్న పెద్ద సినిమాల మేకర్స్ .. డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వైపే ఆసక్తిగా చూస్తున్నారు. నగరంలో పెరుగుతున్న మల్టీప్లెక్స్ కల్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో కూడిన థియేటర్ల నిర్మాణం ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు సైతం హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈవెంట్లకు క్యూ కడుతున్నారు.

ఇలా హైదరాబాద్ మూవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా రూపాంతరం చెందడానికి ఇక్కడి అత్యాధునిక థియేటర్ టెక్నాలజీ ప్రధాన భూమిక పోషిస్తోంది. నగరంలోని థియేటర్లలో అందుబాటులోకి వచ్చిన 4K లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీ, సరికొత్త అనుభూతిని పంచే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ వంటి వరల్డ్ క్లాస్ వసతులు ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ..ఆడియో ఫీస్ట్‌ను అందిస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల స్థాయికి తగినట్లుగా ఇక్కడి థియేటర్లు అప్‌గ్రేడ్ అవ్వడం వల్ల ఇంటర్నేషనల్ స్టూడియోస్‌కు హైదరాబాద్ మోస్ట్ ప్రిఫర్డ్ లొకేషన్‌గా మారుతోంది.

ప్రదర్శనా రంగంలోనే కాకుండా నిర్మాణ రంగంలో కూడా హైదరాబాద్ సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. చారిత్రాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ వంటి టెక్నాలజీలు హాలీవుడ్ స్థాయి సినిమాలను ఇక్కడే తెరకెక్కించడానికి ఎంతో దోహదపడుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రీన్ మ్యాట్ అవసరం లేకుండా నేరుగా రియల్ టైమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో షూటింగ్ జరుపుకునే సరికొత్త టెక్నాలజీని చూసి గ్లోబల్ టెక్నీషియన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ సాంకేతిక పురోగతి కారణంగానే ప్రపంచ స్థాయి చిత్రాల మేకర్స్ హైద‌రాబాద్ నగరానికి క్యూ కడుతున్నారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు హబ్ గా మారుతున్న హైదరాబాద్ కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా పాన్-ఇండియా .. గ్లోబల్ ప్రాజెక్ట్‌లకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇక్కడ లభిస్తున్న మౌలిక వసతులు, నిర్మాకులకు అందుబాటులో ఉన్న సాంకేతిక నిపుణులు, ప్రభుత్వాల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం సినిమా రంగానికి బలమైన పునాదిగా మారాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లు దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుండటం నగర ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది.

హాలీవుడ్ చిత్రాల ప్రీమియర్ల నుంచి అత్యాధునిక వర్చువల్ ప్రొడక్షన్ల వరకు ప్రతి విషయంలోనూ హైదరాబాద్ సత్తాను చాటుతోంది. ముంబై ఆధిపత్యానికి తెరదించుతూ టాలీవుడ్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించేలా దూసుకుపోతున్న భాగ్యనగరం నిజమైన అర్థంలో మూవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. భ‌విష్య‌త్ లో హైదరాబాద్ గ్లోబల్ సినిమా పటంలో మరింత ప్రకాశవంతంగా వెలగడం ఖాయం.

Tags:    

Similar News