గొడవకు రారా! రాలేరా? డౌట్లు పెట్టేస్తున్న అగ్ర నిర్మాతల వైఖరి!
టాలీవుడ్ ఎగ్జిబిటర్లు .. నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం పరిశ్రమలో పెను సంచలనంగా మారింది.
టాలీవుడ్ ఎగ్జిబిటర్లు .. నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం పరిశ్రమలో పెను సంచలనంగా మారింది. అయితే ఈ గొడవకు సంబంధించి జరిగిన రెండు కీలక మీడియా సమావేశాలకు పరిశ్రమను శాసించే అగ్ర నిర్మాతలు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు , అశ్వినీ దత్ వంటి దిగ్గజాలు బహిరంగంగా ఈ వాదోపవాదాల్లో పాలుపంచుకోకపోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సమస్య రోడ్డు మీదకు వచ్చి ప్రెస్ మీట్ల వరకు వెళ్లినా.. ఈ అగ్రశ్రేణి నిర్మాతలు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ముఖ్యంగా అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి వారు కేవలం నిర్మాతలు మాత్రమే కాదు.. వారికి సొంత థియేటర్ల నెట్‌వర్క్, పంపిణీ వ్యవస్థ- పోస్ట్ ప్రొడక్షన్ వగైరా ఇండస్ట్ట్రీ సంబంధిత వ్యాపారాలు ఉన్నాయి. వీరు అటు నిర్మాతలుగా, ఇటు ఎగ్జిబిటర్లుగా రెండు వైపులా ప్రయోజనాలను కలిగి ఉండటమే వారు బహిరంగంగా ఒక పక్షం వహించకపోవడానికి ప్రధాన కారణం కావొచ్చు. దిల్ రాజు సైతం ఎగ్జిబిటర్ల మీట్‌కు హాజరు కాకుండా తన సోదరుడు శిరీష్ రెడ్డిని పంపడం వెనుక తన `నైజాం కింగ్` ఇమేజ్‌ను కాపాడుకుంటూనే... సమస్యను నిశితంగా గమనిస్తున్నట్లు అర్థమవుతోంది.
మరోవైపు... అశ్వినీ దత్ వంటి అగ్ర నిర్మాతలు సమావేశానికి నేరుగా హాజరు కాకపోయినా.. సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలుపుతున్నారు. `కల్కి 2898 ఏడీ- 2` వంటి భారీ చిత్రాల నిర్మాణం .. విడుదల సమయంలో ఎగ్జిబిటర్-డిస్ట్రిబ్యూటర్ వివాదం పరిశ్రమ భవిష్యత్తును దెబ్బతీస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఫిలిం ఛాంబర్ .. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వంటి అత్యున్నత వ్యవస్థలు పని చేస్తున్నా.. సమస్య వీధికి ఎక్కడంపై వీరు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఈ పెద్ద నిర్మాతలు బయటకు కనిపించకపోయినా తెర వెనుక సమస్య పరిష్కారం కోసం నిరంతరం చర్చలు జరుపుతున్నారని ఇండస్ట్రీ టాక్. ఉద్రిక్తతలు పెంచడం కంటే... ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తీసుకురావడానికి వీరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. సమస్య తీవ్రత దృష్ట్యా షూటింగ్‌లు.. రిలీజ్‌లపై ప్రభావం పడకుండా ఉండేందుకు వీరు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఈ అగ్ర నిర్మాతలు ఒక ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వచ్చే అవకాశం ఉంది.
టాలీవుడ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా ఈ పెద్దలే ముందుండి నడిపించిన చరిత్ర ఉంది. ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి ముగింపు పలికేందుకు వీరు అంతర్గతంగా చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే ఫలిస్తాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. కేవలం ప్రెస్ మీట్లకు హాజరైనంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని.. క్షేత్రస్థాయిలో పంపిణీ-ప్రదర్శన వ్యవస్థలను సమన్వయం చేయడమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నారు. అతి త్వరలోనే పరిశ్రమ ఐక్యతను చాటిచెప్పేలా ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.