విడుదలకు ముందే స్టోరీ లీక్.. నిర్మాతల స్ట్రాటజీనా? లేక?

ఇటీవలే దళపతి విజయ్ నటించిన రాజకీయ యాక్షన్ మూవీ 'జన నాయగన్' విషయంలో జరిగిన సంఘటన తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలను షాక్‌కు గురిచేసింది.

Update: 2026-09-12 06:20 GMT

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న 'రణబాలి' సినిమా కథ 1876 నాటి మద్రాస్ కరవు, బ్రిటిష్ తిరుగుబాటు నేపథ్యంతో వస్తోందంటూ సోషల్ మీడియాలో కథనాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలా సినిమా రిలీజ్‌కి ముందే కథలు లేదా కీలకమైన సీన్లు బయటకు రావడం చిత్ర పరిశ్రమను కలవరపెడుతోంది. కొన్నిసార్లు ఈ లీకులు సినిమాను ఘోరంగా దెబ్బతీస్తే, మరికొన్నిసార్లు ఊహించని సక్సెస్ అందిస్తున్నాయి. అసలు ఈ లీకుల వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందా? లేక నిర్మాతల పబ్లిసిటీ స్ట్రాటజీనా? ఇప్పుడు చూద్దాం.

బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన 'అత్తారింటికి దారేది':

సినిమా లీక్ అయిపోతే కలెక్షన్లు రావు అనే అపోహను 'అత్తారింటికి దారేది' తుడిచిపెట్టేసింది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా విడుదలకాక ముందే ఏకంగా 90 నిమిషాల ఫస్ట్ హాఫ్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇక ఎడిటింగ్ రూమ్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనం. అయితే థియేటర్లలో బొమ్మ పడ్డాక ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

విజయ్ దేవరకొండ సినిమాలపై లీకుల దెబ్బ :

విజయ్ దేవరకొండ నటించిన 'గీతా గోవిందం', 'టాక్సీవాలా' చిత్రాలు కూడా విడుదలకి ముందే లీకుల బారిన పడ్డాయి. 'టాక్సీవాలా' విషయంలో గ్రాఫిక్స్ పూర్తికాని రఫ్ వర్షన్ ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. ఇక 'గీతా గోవిందం' ఎడిటింగ్ సీన్లు బయటకు వచ్చాయి. ఐతే, మేకర్స్ పట్టు వదలకుండా పోస్ట్ ప్రొడక్షన్ నాణ్యత పెంచి థియేటర్లలోకి తీసుకురావడంతో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.

షాక్ ఇచ్చిన 'జన నాయగన్' పైరసీ లీక్ :

ఇటీవలే దళపతి విజయ్ నటించిన రాజకీయ యాక్షన్ మూవీ 'జన నాయగన్' విషయంలో జరిగిన సంఘటన తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలను షాక్‌కు గురిచేసింది. సెన్సార్ వివాదాల వల్ల ఆలస్యమవుతున్న క్రమంలో, ఏకంగా పూర్తి సినిమానే ఇంటర్నెట్, టోరెంట్లలో లీక్ అయిపోయింది. ఇక ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, పరిశ్రమ భద్రతా వ్యవస్థకే పెద్ద సవాలుగా మారింది.

నిర్మాతల పబ్లిసిటీ స్ట్రాటజీనా?:

ఈమధ్య కథలోని పాయింట్లు లీక్ అవ్వడం వెనుక నిర్మాతల "హైప్ క్రియేషన్" స్ట్రాటజీ కూడా ఉందనే ప్రచారం నడుస్తోంది. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిన నేపథ్యంలో.. కథపై క్యూరియాసిటీ పెంచడానికి కొన్ని లీడ్ పాయింట్లను కావాలనే సోషల్ మీడియాలోకి వదులుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఐతే నిజమైన లీకులు మాత్రం బడ్జెట్‌ను నీరుగార్చే ప్రమాదకరమైన అంశమే..

లీకులు నిర్మాతల స్ట్రాటజీ అయినా లేక కేటుగాళ్ల నిర్వాకమైనా.. సినిమా బాగుంటే ఆడియన్స్ థియేటర్‌కే వస్తారని ఈ హిట్లు నిరూపిస్తున్నాయి. కథ ముందే తెలిసినా, థియేటర్లో ఇచ్చే ఆ విజువల్ ఎక్స్‌పీరియన్స్, ఎమోషన్ పర్ఫెక్ట్‌గా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News