పైరసీ కారణంగా ఏడాదిలో టాలీవుడ్ నష్టం ఎంతో తెలుసా?
హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దేశంలోని అతిపెద్ద పైరసీ మాఫియాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.;
హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దేశంలోని అతిపెద్ద పైరసీ మాఫియాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బిఇ లాంటి సాంకేతిక విద్యను అభ్యసించిన సిరిల్ అనే 39ఏళ్ల యువకుడు పెద్ద ఎత్తున సినిమాలను పైరసీ చేస్తూ నెలకు 9లక్షలు పైగా సంపాదిస్తూ, కోట్లాది రూపాయలు సంపాదించాడని సైబర్ క్రైమ్ విచారణలో నిగ్గు తేల్చింది. అతడు దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమాలను కాపీ చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేందుకు టీమ్ లను రన్ చేస్తున్నాడు. కొందరిని హైర్ చేసుకుని కాపీ చేసిన సినిమా రేంజును బట్టి వారికి ప్యాకేజీలు అందజేస్తున్నాడు. అతడి టీమ్ సభ్యులకు క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు జరుపుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. క్రిప్టోలో 150 డాలర్ల నుంచి 500 డాలర్ల వరకూ సినిమా రేంజును బట్టి చెల్లిస్తారని పోలీసుల విచారణలో కుమార్ (29) అనే వ్యక్తి తెలిపారు.
తాజా విచారణలో పైరసీ మాఫియాల కారణంగా యేటేటా సినీపరిశ్రమలకు భారీ నష్టం వాటిల్లుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. 2023లో భారతీయ వినోద పరిశ్రమ రూ. 22,400 కోట్లు నష్టపోయిందని, 2024లో ఒక్క టాలీవుడ్ మాత్రమే రూ. 3,700 కోట్లు నష్టపోయిందని సైబర్ క్రైమ్ పోలీస్ అధికారి ఆనంద్ వెల్లడించారు. తాజా అరెస్టులు డిజిటల్ పంపిణీ సంస్థలు ఆన్‌లైన్ భద్రతను అప్‌గ్రేడ్ చేయవలసిన అవసరాన్ని హైలైట్ చేస్తాయి అని ఆయన అన్నారు.
దేశంలో అతిపెద్ద పైరసీ మాఫియా గుట్టు రట్టు చేసిన పోలీసులపై టాలీవుడ్ ప్రముఖలు ప్రశంసలు కురిపిస్తున్నారు. దిల్ రాజు- టిఎఫ్‌సిసి యాంటీ-పైరసీ సెల్ హెడ్ రాజ్ కుమార్ సహా నిర్మాతలు పోలీసుల సమర్థత, చర్యలను ప్రశంసించారు. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల బారిన పడవద్దని లేదా పైరేటెడ్ కంటెంట్‌ను వినియోగించవద్దని తెలుగు సినీనిర్మాతలు ప్రజలను కోరారు.
సినిమాలతో ప్రతియేటా వేల కోట్లు టాలీవుడ్ లో రె వెన్యూ జనరట్ అవుతోంది. ఇందులో 18శాతం ప్రభుత్వ ఆదాయం కూడా ఉంటుంది. అదంతా ప్రభుత్వం నష్టపోతోందని నిర్మాత దిల్ రాజు ఈ సందర్భంగా విశ్లేషించారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎప్పుడూ సినీపరిశ్రమకు సాయం చేస్తున్నారు. వారి సహాయానికి ధన్యవాదాలు అని అన్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ని సినీహబ్ గా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. దానికి అందరూ సహకరించాలని కూడా దిల్ రాజు ఈ సందర్భంగా కోరారు. 3000-4000 కోట్లు పైగా ప్రతియేటా టాలీవుడ్ కారణంగా ఆదాయం జనరేట్ అవుతోందని ఒక అంచనా. ఇంచుమించు అంతే పెద్ద మొత్తాన్ని పైరసీ కారణంగా నష్టపోవాల్సి వస్తోంది.